(సునీల్ గావస్కర్)
పాయింట్ల జాబితాలో చివరి స్థానాల్లో ఉన్న రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లకు మరో అవకాశం. ఒక స్థానం మెరుగుపరుచుకునేందుకు రాజస్తాన్, లీగ్‌లో తొలి గెలుపు నమోదు చేసుకునేందుకు బెంగళూరు నేడు మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఈ మ్యాచ్‌ల్లో రెండు జట్లూ గెలుపొందినా... నాకౌట్ దశకు అర్హత సాధించే విషయంలో ఈ విజయాలు పెద్దగా ప్రభావం చూపలేవు. రాజస్తాన్‌తో తలపడనున్న ముంబై ఇప్పుడే విజయాల బాట పట్టింది. గత మ్యాచ్‌లో గొప్పగా పోరాడి పంజాబ్‌పై చివరి బంతికి విజయాన్ని సాధించింది. పొలార్డ్ ముందుండి జట్టును నడిపిస్తున్నాడు. పటిష్ట బౌలింగ్‌కు తోడు హార్దిక్ పాండ్యా లాంటి హిట్టర్లతో ముంబై మంచి జోరు మీదుంది. ఈ పరిస్థితుల్లో ముంబైని ఓడించడం అంత సులభమేం కాదు. ఇటు చూస్తే రాజస్తాన్ గత మ్యాచ్‌లో చివరి బంతికే చెన్నై చేతిలో ఓటమి చవిచూసింది.
దీనినుంచి వారు తొందరగా బయట పడాలి. ఈ సమయంలో జట్టులోని భారత ఆటగాళ్ల సేవలు జట్టుకు మరింత అవసరం. కానీ సంజూ సామ్సన్, శ్రేయస్ గోపాల్ మినహా మిగతా భారత ఆటగాళ్లంతా కేవలం తుది జట్టులో ఉన్నారంటే ఉన్నారన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. బట్లర్, స్మిత్, ఆర్చర్‌లపైనే జట్టు ఎక్కువగా ఆధారపడుతోంది. స్టోక్స్ మరింతగా రాణిస్తే జట్టుకు ఉపయోగపడతాడు. పేలవ బౌలింగ్‌తో బెంగళూరు మ్యాచ్ లు గెలవడం కష్టమే. చహల్ మినహా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేసే బౌలర్లు ఆ జట్టుకు లేరు. 200 పరుగులు చేసినా దాన్ని నిలబెట్టుకోలేకపోవడం ఆ జట్టు బౌలర్ల డొల్లతనాన్ని బయటపెడుతోంది. బ్యాటింగ్‌లో కోహ్లి, డివిలియర్స్‌లే దిక్కు. పొరపాటున వారిద్దరు విఫలమైతే మిగతా బ్యాట్స్‌మెన్ కనీస ప్రదర్శన ఇవ్వలేకపోతున్నారు.
మొయిన్ అలీ కొంత రాణిస్తున్నా జట్టును గెలిపించేంతగా కాదు. షిమ్రాన్ హెట్‌మైర్‌కు ఆ జట్టు మరో అవకాశం ఇస్తే బాగుంటుంది. ఇతర వెస్టిండియన్లు పొలార్డ్, రసెల్ మాదిరిగా బెంగళూరుకు హెట్‌మైర్ ఉపయోగపడతాడేమో! శివం దూబేకు కూడా తుదిజట్టులో చోటు కల్పిస్తే జట్టు రాత మారొచ్చేమో. ముంబైతో మ్యాచ్‌లో చివరి బంతికి ఎదురైన ఓటమి బాధాకరమే అయినా... లీగ్‌లో పంజాబ్ బాగానే ఆడుతోంది. రాహుల్ నిలకడైన ఇన్నింగ్స్‌లతో పాటు, గేల్ మెరుపులతో పంజాబ్ బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. అశ్విన్ సారథ్యంలోని బౌలింగ్ విభాగం కూడా మెరుగ్గానే కనబడుతోంది. అన్ని విధాలుగా కుదురుకున్నట్లు కనిపిస్తున్న ఈ జట్టు ఇదే తరహా ఆటను కొనసాగిస్తే వారికి కూడా మంచి అవకాశాలు ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment