బ్యాటింగ్ కనిపించట్లేదు | Another spin-dominant venue threatens century-less series | Sakshi
Sakshi News home page

బ్యాటింగ్ కనిపించట్లేదు

Published Wed, Dec 2 2015 3:57 PM | Last Updated on Sun, Sep 3 2017 1:23 PM

బ్యాటింగ్ కనిపించట్లేదు

బ్యాటింగ్ కనిపించట్లేదు

స్పిన్‌కు దాసోహం అంటున్న భారత బ్యాట్స్‌మెన్
 
దక్షిణాఫ్రికాతో సిరీస్ నెగ్గిన భారత్ జట్టుకు ప్రశంసలు మాత్రమే కాదు విమర్శలు కూడా దక్కాయి. ముఖ్యంగా పిచ్‌ను తమకు అనుకూలంగా తయారు చేయించుకోవడంపై మాజీలు మండిపడ్డారు. అయితే సిరీస్ విజయం, పిచ్‌పై చర్చతో మరో కీలక అంశంపై పెద్దగా ఎవరి దృష్టి పడలేదు. అదే భారత బ్యాట్స్‌మెన్ వైఫల్యం. పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలంగా లేవు కాబట్టి బ్యాటింగ్ పెద్దగా కనిపించే అవకాశం ఉండదు అని అనుకోవచ్చు. అయితే ఈ సిరీస్‌ను పక్కన పెట్టి  కాస్త లోతుగా పరిశీలిస్తే మన బ్యాట్స్‌మెన్ గత రెండేళ్లుగా స్పిన్‌ను ఎదుర్కొవడానికి కష్టాలు పడుతున్నారని స్పష్టంగా అర్థమవుతుంది.
 
సిరీస్ నెగ్గాలనే ఒకే లక్ష్యంతో దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు తయారు చేసిన పిచ్‌లు ప్రస్తుతం బాగా చర్చనీయాంశం అయ్యాయి. నిజానికి భారత్‌లో సిరీస్ అంటే ఏ జట్టైనా స్పిన్ పిచ్‌లు తప్పవని ముందుగానే నిశ్చయించుకుంటుంది. అయితే ఈ స్థాయిలో పిచ్‌లు ఉంటాయని ఎవరూ అనుకోలేదు. కేవలం మూడురోజుల్లోనే మ్యాచ్ ముగిసే స్థాయిలో పిచ్‌లు ఉండడంతో కొంతమంది మాజీలు మండిపడుతున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది మరో విషయం కూడా ఉంది. అదే మన బ్యాట్స్‌మెన్ వైఫల్యం.

 వాళ్లే ఉంటే..
 ఆ పిచ్‌లపై దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ రాణించలేకపోయారు కదా మనవాళ్లు ఎలా రాణిస్తారని సందేహం రావచ్చు. అయితే సచిన్, లక్ష్మణ్, ద్రవిడ్ ఉంటే ఈ స్థాయిలో కుప్పకూలేవారా అనేది సునీల్ గవాస్కర్ ప్రశ్న. ప్రొటీస్ జట్టులో కూడా స్మిత్, కలిస్ ఉంటే వందలోపు ఆలౌట్ అయ్యేవారా అనేది కూడా ఆలోచించాల్సిందే. నిజానికి కాస్త సహనం ప్రదర్శిస్తే క్రీజ్‌లో నిలదొక్కుకోవచ్చు అని మూడో టెస్టులో ఆమ్లా, డుప్లెసిస్ నిరూపించారు. వారిద్దరే 50 ఓవర్లకు పైగా బంతులు ఆడడమే దానికి నిదర్శనం. ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ధావన్, కోహ్లి, రహానే అవుటవడానికి బౌలర్ల కృషి కంటే వారి తొందరపాటు షాట్లే కారణమని స్పష్టంగా అర్థమవుతుంది.

 కాస్త మెరుగైన వాళ్లు ఉండుంటే..
 సిరీస్‌లో భారత జట్టు నాలుగు సార్లు ఆలౌటైతే వాటిలో 28 వికెట్లు దక్షిణాఫ్రికా స్పిన్నర్లకే దక్కాయి. పైగా వారి స్పిన్నర్లు ఇద్దరూ ప్రపంచ స్థాయి ఆటగాళ్లు కూడా కారు. సైమన్ హార్మర్ భారత పర్యటనకు ముందు 2 టెస్టులు మాత్రమే ఆడగా, ఇమ్రాన్ తాహిర్ జట్టులో చోటు కోల్పోయి ఏకంగా 9 నెలల తర్వాత పునరాగమనం చేశాడు. వారి స్పిన్నర్ల బౌలింగ్‌లో భారత బ్యాట్స్‌మెన్ సగటు 18.39 మాత్రమే. (అంటే సగటున 18 పరుగులకు ఒక వికెట్ సమర్పించుకున్నారు).

తాహిర్ 13.25 సగటుతో 12 వికెట్లు తీయగా, హర్మర్ 25.40 సగటుతో 10 వికెట్లు తీశాడు. వారిద్దరు పెద్దగా లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడి బౌలింగ్ చేయలేదు. ఒకవేళ యాసిర్ షా, హెరాత్ వంటి ప్రపంచస్థాయి బౌలర్లు ప్రత్యర్థి జట్టులో ఉండి ఉంటే సిరీస్‌ను మనం నెగ్గేవాళ్లమా అని ప్రశ్నిస్తే.. దానికి సమాధానం కష్టమే.

 2014 నుంచి ఇదే వరుస..
 గత రెండేళ్లుగా మన బ్యాట్స్‌మెన్ స్పిన్ బౌలింగ్‌కు దాసోహం అయిన తీరును గమనిస్తే కాస్త విస్తుపోవాల్సిందే. స్పినర్ల బౌలింగ్‌లో అతి తక్కువ సగటు ఉన్న టాప్-8 జట్ల జాబితాలో మనం చివరి నుంచి మూడో స్థానంలో ఉన్నాం. 31.61 సగటుతో మనం ఉండగా, వెస్టిండీస్ (30.20), దక్షిణాఫ్రికా (27.01) మన కింది స్థానాల్లో ఉన్నాయి. (మన సిరీస్ లేకపోయింటే దక్షిణాఫ్రికా సగటు కూడా భారత్ కంటే మెరుగ్గానే ఉండేది) ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏమిటంటే ఈ కాలంలో భారత్ విదేశాల్లోనే ఎక్కువగా మ్యాచ్‌లు ఆడింది.

 

ఇంగ్లండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో స్పిన్‌కు అనుకూలించని పిచ్‌లపై కూడా మన బ్యాట్స్‌మెన్ స్పిన్నర్లకే వికెట్లు సమర్పించుకున్నారు. ఇంగ్లండ్ స్పిన్నర్ మొయిన్ అలీకి దాసోహమైన మన బ్యాట్స్‌మెన్ అతని బౌలింగ్‌లో సగటున 23 పరుగులకు ఒక వికెట్ ఇచ్చేశారు. అదే సిరీస్‌లో భారత స్పిన్నర్ల సగటు ఏకంగా 44.07. (అప్పటికి అశ్విన్ ఈ స్థాయి ఫామ్‌లో లేడు). మరోవైపు ఆస్ట్రేలియా సిరీస్‌లో సైతం ఎక్కువ వికెట్లు తీసింది వారి స్పిన్నర్ నాథన్ లియోనే.

 ఆసియా దేశాల బ్యాట్స్‌మెన్ స్పిన్ ఆడడంలో సిద్ధహస్తులు. ఇక్కడి పిచ్‌లు స్పిన్‌కే అనుకూలిస్తాయి కాబట్టి బంతి టర్న్ అయినా సరే ఆడడంలో పెద్దగా ఇబ్బంది పడరు. అయితే గత రెండేళ్లలో స్పిన్ బౌలింగ్‌లో మన బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడినంతగా ఆసియా టాప్-4 జట్లలో ఏది పడలేదు. స్పిన్ బౌలింగ్‌లో పాకిస్తాన్ సగటు 47.10, బంగ్లాదేశ్ సగటు 37.92, శ్రీలంక సగటు 33.58గా ఉంది.

 విదేశాల్లో సమస్యలు..
 మన దేశంలో సిరీస్ కాబట్టి స్పిన్‌ను నమ్ముకున్నారు. అందుకు తగ్గట్లుగానే అశ్విన్ 24 వికెట్లతో, జడేజా 16 వికెట్లతో, మిశ్రా 7 వికెట్లతో దుమ్ములేపారు. సిరీస్‌లో దక్షిణాఫ్రికావి మొత్తం 50 వికెట్లు పడితే 47 స్పిన్నర్లకే దక్కాయి. పిచ్‌పై చర్చ రాగానే స్పందించిన కోహ్లి మాట్లాడుతూ.. విదేశాల్లో వారికి అనుకూలమైన పిచ్‌లే ఉంటాయి కదా అని వ్యాఖ్యానించాడు.

అంటే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాల్లో పేస్ ట్రాక్‌లు ఉంటాయని దానర్థం. మరీ అక్కడి వెళితే మన స్పిన్ ప్రభావం నామమాత్రమే. టెస్టుల్లో వికెట్లు తీస్తేనే గెలుస్తామని చెప్పే కోహ్లి ఆ పని చేసే పేస్ ఎవరనేది ప్రశ్నించుకోవాలి. ప్రస్తుతం జట్టులో ఉన్న ఇషాంత్, ఉమేశ్ యాదవ్, వరుణ్ అరోన్, భువనేశ్వర్ కుమార్‌లో ఎవరిపైనా నమ్మకం పెట్టుకునే పరిస్థితుల్లో జట్టు మేనేజ్‌మెంట్ లేదు. అలాంటి సమయాల్లో బ్యాట్స్‌మెన్‌నే నమ్ముకోవాలి.

 పుంజుకోవాల్సిన సమయమిదే...
 ఈ సిరీస్‌లో భారత జట్టు చేసిన అత్యధిక స్కోరు 215 పరుగులు. కోహ్లి నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి చేసినవి 68 పరుగులు మాత్రమే. కోహ్లి తర్వాత అంతటి స్టార్ రహానే, రోహిత్ శర్మ, సాహా, ధానవ్ ఘోరంగా విఫలమయ్యారు. వీళ్లలో కోహ్లి, రహానే, రోహిత్ సాంకేతికత గురించి అందరికి తెలిసిందే. లోపమంతా సహనంగా ఆడకపోవడమే. 1990-2011 మధ్య దిగ్గజాలు సచిన్, లక్ష్మణ్, ద్రవిడ్, గంగూలీ ఆడే సమయంలో స్పిన్ బౌలింగ్‌లో మన సగటు 44.97 (ఆ సమయంలో మనదే అత్యధికం).

వీళ్ల రిటైర్మెంట్ తర్వాతే అసలు సమస్య వచ్చింది. కనీసం నాలుగో టెస్టులోనైనా వారి దాన్ని అధిగమిస్తారని ఆశిద్దాం. దక్షిణాఫ్రికాతో సిరీస్ తర్వాత భారత్ మళ్లీ ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల్లోనే పర్యటిస్తుంది. ఇంతకుముందులా కాకుండా అక్కడి పిచ్‌లపై వారి స్పిన్నర్లను మన బ్యాట్స్‌మెన్ ఎదుర్కొవాలంటే నాలుగో టెస్టు మ్యాచే వారికి సరైన ప్రయోగశాల లాంటిది. అక్కడి ఫాస్ట్‌ట్రాక్‌లపై మన బౌలర్ల వైఫల్యాన్ని అధిగమించాలంటే ఉన్న ఏకైక మార్గం మన బలమైన బ్యాటింగ్‌లో రాణించడమేనని జట్టు గుర్తిస్తే మంచిది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement