south africa series
-
సౌతాఫ్రికా సిరీస్, 2024 వరల్డ్‌కప్ కోసం భారత జట్టు ప్రకటన
సౌతాఫ్రికా వేదికగా వచ్చే ఏడాది (2024) జరిగే అండర్ 19 వరల్డ్‌కప్ కోసంభారత యువ జట్టును ఇవాళ (డిసెంబర్ 12) ప్రకటించారు. వరల్డ్‌కప్‌తో పాటు దానికి ముందు సౌతాఫ్రికాలోనే జరిగే ట్రై సిరీస్‌కు కూడా సెలెక్టర్లు ఇవాళే ఉమ్మడి జట్టును ప్రకటించారు. ఈ జట్టు కెప్టెన్‌గా ఉదయ్ సహరన్, వైస్ కెప్టెన్‌గా సౌమీ కుమార్ పాండేను ఎంపిక చేశారు. రెగ్యులర్ జట్టుతో పాటు ట్రావెలింగ్ స్టాండ్ బైలు, బ్యాకప్ ప్లేయర్లను కూడా సెలెక్టర్లు ఎంపిక చేశారు. మొత్తంగా 22 మంది సభ్యుల జంబో బృందాన్ని భారత సెలెక్టర్లు ఇవాళ ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 19 నుంచి ఫిబ్రవరి 11 మధ్య జరిగే వరల్డ్‌కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ జనవరి 20న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. భ్లోంఫాంటీన్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో యంగ్ ఇండియా.. బంగ్లాదేశ్‌తో తలపడనుంది. అనంతరం భారత్.. జనవరి 25, 28 తేదీల్లో ఐర్లాండ్, యూఎస్ఏలతో తమ తొలి రౌండ్ మ్యాచ్‌లు ఆడనుంది. మెగా టోర్నీకి ముందు యంగ్ ఇండియా.. ఇంగ్లండ్, సౌతాఫ్రికాలతో కలిసి ట్రై సిరీస్ ఆడుతుంది. ఈ టోర్నీ డిసెంబర్ 29న మొదలై వచ్చే ఏడాది జనవరి 10 వరకు సాగుతుంది. ట్రయాంగులర్ సిరీస్, అండర్ 19 వరల్డ్‌కప్ 2024 కోసం భారత జట్టు.. ఉదయ్ సహరన్ (కెప్టెన్), సౌమీ కుమార్ పాండే (వైస్ కెప్టెన్), అరవెల్లి అవినాశ్ రావ్ (వికెట్‌కీపర్), ఇన్నేశ్ మహాజన్ (వికెట్‌కీపర్), అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, సచిన్ ధాస్, ప్రియాన్షు మోలియా, ముషీర్ ఖాన్, మురుగన్ అభిషేక్, ధనుశ్ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబానీ, నమన్ తివారి ట్రై సిరీస్‌కు ట్రావెలింగ్ స్టాండ్ బై ప్లేయర్స్.. ప్రేమ్ దేవ్కర్, అన్ష్ గోసాయ్, మొహమ్మద్ అమాన్ బ్యాకప్ ప్లేయర్స్.. దిగ్విజయ్ పాటిల్, జయంత్ గోయత్, పి విజ్ఞేశ్, కిరణ్ చోర్మలే -
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. ఉమ్రాన్, అర్ష్‌దీప్‌లకు తొలి అవకాశం
ముంబై: ఐపీఎల్లో సత్తా చాటిన ఇద్దరు యువ పేస్ బౌలర్లకు భారత జట్టు పిలుపు లభించింది. ఫాస్ట్ బౌలింగ్‌తో అదరగొట్టిన ఉమ్రాన్ మలిక్, పొదుపైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను కట్టడి చేసిన అర్ష్‌దీప్ సింగ్‌లకు మొదటిసారి టీమిండియా అవకాశం దక్కింది. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగే ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్ కోసం 18 మంది సభ్యుల భారత జట్టును సెలక్షన్ కమిటీ ఆదివారం ప్రకటించింది. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, కోహ్లి, బుమ్రాలకు విశ్రాంతినివ్వడంతో కేఎల్ రాహుల్ ఈ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. కొంత విరామం తర్వాత హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ జట్టులోకి పునరాగమనం చేశారు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య జూన్ 9న (ఢిల్లీ), 12న (కటక్), 14న (విశాఖపట్నం), 17న (రాజ్‌కోట్), 19న (బెంగళూరు) ఐదు టి20 మ్యాచ్‌లు జరుగుతాయి. వేగం...పొదుపు... ప్రస్తుత ఐపీఎల్ ప్రదర్శనను కూడా సెలక్టర్లు పరిగణనలోకి తీసుకున్నట్లు ఉమ్రాన్, అర్‡్షదీప్ ఎంపిక చూపిస్తోంది. జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఉమ్రాన్ తన అసలు సిసలు ఫాస్ట్ బౌలింగ్‌తో అందరి దృష్టిలో పడ్డాడు. ప్రతీ మ్యాచ్‌లోనూ కనీసం 150 కి.మీ. వేగానికి తగ్గకుండా బౌలింగ్ చేస్తూ వచ్చిన అతను ఈ సీజన్లో ఫాస్టెస్ట్ బాల్ (156.9 కి.మీ.)ను నమోదు చేశాడు. వేగంతో కొన్నిసార్లు గతి తప్పినా... ఎక్కువ భాగం నియంత్రణతో కూడిన బౌలింగ్‌ను ప్రదర్శించిన ఉమ్రాన్ 22 వికెట్లు పడగొట్టాడు. అర్‡్షదీప్ ఖాతాలో 10 వికెట్లే ఉన్నా పొదుపైన బౌలింగ్ (7.70 ఎకానమీ)తో ఆకట్టుకున్నాడు. వారిద్దరూ వచ్చారు... 2021 టి20 ప్రపంచకప్‌లో ఆడినా ఎక్కువ భాగం బ్యాటింగ్‌కే పరిమితమైన హార్దిక్ పాండ్యా ఆ తర్వాత గాయంతో జట్టుకు దూరమయ్యాడు. కోలుకున్న తర్వాత ఐపీఎల్లో పూర్తి స్థాయి ఆల్‌రౌండర్‌గా సత్తా చాటుతున్న అతనికి సహజంగానే భారత జట్టులో చోటు లభించింది. 2019 తర్వాత భారత జట్టుకు ఆడని దినేశ్ కార్తీక్ కూడా ఐపీఎల్ ప్రదర్శనతోనే తిరిగి రావడం విశేషం. ఈ సీజన్లో 191.33 స్ట్రయిక్‌రేట్‌తో 287 పరుగులు చేసిన అతను డెత్ ఓవర్లలో మరింత చెలరేగిపోయాడు. గాయాల నుంచి ఇంకా కోలుకోని దీపక్ చహర్, రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్ పేర్లను సెలక్టర్లు పరిశీలించలేదు. భారత జట్టు చివరిగా శ్రీలంకతో టి20 సిరీస్ ఆడగా... అందులో భాగంగా ఉన్న సంజు సామ్సన్, మొహమ్మద్ సిరాజ్ మాత్రం జట్టులో చోటు కోల్పోయారు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, వెంకటేశ్ అయ్యర్, యజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్. చదవండి: హిట్‌మ్యాన్ ఖాతాలో మరో రెండు చెత్త రికార్డులు -
‘టెస్టుల గురించి అతిగా ఆలోచించేవాడిని’
న్యూఢిల్లీ: వన్డేలు, టి20ల్లో విధ్వంసక ఆటతీరు కనబర్చినా మొదటి నుంచి టెస్టుల్లో రోహిత్ శర్మ ఆటతీరు అంతంత మాత్రమే. అతడికి ప్రధాన బ్యాట్స్‌మన్‌గా కూడా పెద్దగా గుర్తింపు రాలేదు. ఇటీవల దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగే ముందు వరకు కూడా రోహిత్ టెస్టు కెరీర్ డోలాయమానంలోనే ఉంది. టెస్టులకు తగినట్లుగా అతని టెక్నిక్ లేకపోవడం కూడా అందుకు కారణం. దీనిపై మాట్లాడుతూ రోహిత్... టెస్టుల్లో ప్రదర్శన గురించి గతంలో అతిగా ఆలోచించేవాడినని, ఇప్పుడు దానిని వదిలేసి ఆటను ఆస్వాదించడంపైనే దృష్టి పెట్టినట్లు చెప్పాడు. ‘టెస్టుల్లో విజయవంతం కావడం గురించి చాలా తీవ్రంగా ఆలోచించేవాడిని. ఇలాంటి షాట్ ఎందుకు ఆడానా అని తలబద్దలు కొట్టుకునేవాడిని. ప్రతీ ఇన్నింగ్స్ తర్వాత వీడియో అనలిస్ట్ వద్దకు వెళ్లి విశ్లేషణ చేసి నా బుర్రను మరింత గందరగోళంలో పడేసేవాడిని. టెక్నిక్ గురించి అతిగా ఆలోచించేవాడిని. గత ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందు నా ఆలోచన మారిపోయింది. ఫలితం ఎలా ఉన్నా సరే సాంకేతిక అంశాలను పట్టించుకోవద్దని నిర్ణయించుకున్నా. మైదానంలో వెళ్లి నాదైన శైలిలో స్వేచ్ఛగా ఆడటమే ముఖ్యమని భావించా’ అని వ్యాఖ్యానించాడు. ఎవరో చేసే వ్యాఖ్యలను పట్టించుకునే దశను కూడా దాటిపోయానన్న రోహిత్... తన కుటుంబమే అన్నింటికంటే ముఖ్యమని చెప్పాడు. వరల్డ్ కప్ సమయంలో ఆటగాళ్లు అనుమతించిన రోజులను మించి నిబంధనలకు విరుద్ధంగా కుటుంబ సభ్యులను తమతోనే ఉంచుకోవడంపై వచ్చిన విమర్శలకు స్పందిస్తూ... తమకు అండగా నిలిచేందుకు వారు అక్కడ ఉండటంలో తప్పేమీ లేదని, అయినా అనవసరంగా వారిని వివాదాల్లోకి లాగవద్దని కోరాడు. -
మిథాలీ స్థానంలో షెఫాలీ
న్యూ ఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టులో టీనేజీ బ్యాటింగ్ సంచలనం షెఫాలీ వర్మకు చోటు దక్కింది. హరియాణాకు చెందిన 15 ఏళ్ల షెఫాలీ... దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరుగనున్న ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌లకు ఎంపికైంది. తాజాగా టి20 లకు రిటైర్మెంట్ ప్రకటించిన హైదరాబాదీ వెటరన్ మిథాలీ రాజ్ స్థానంలో ఆమెకు అవకాశం లభించింది. తెలుగమ్మాయి, పేసర్ అరుంధతిరెడ్డికి సైతం స్థానం దక్కింది. ఈ ఏడాది మొదట్లో జరిగిన బీసీసీఐ అండర్–19 టోర్నీలో విధ్వంసక ఆటతో 5 ఇన్నింగ్స్‌ల్లో 376 పరుగులు చేసి షెఫాలీ అందరి దృష్టిలో పడింది. మహిళల టి20 చాలెంజ్ టోర్నీలోనూ రాణించడంతో జాతీయ జట్టులోకి రావడం ఖాయమని తేలిపోయింది. దక్షిణాఫ్రికా సిరీస్‌కు జట్టు ఎంపికకు గురువారం సమావేశమైన సెలక్షన్ కమిటీ... వన్డేలకు మిథాలీ రాజ్, టి20లకు హర్మన్‌ప్రీత్ కౌర్‌లను సారథులుగా కొనసాగించింది. తొలి టి20 ఈ నెల 24న సూరత్‌లో జరుగనుంది. -
బ్యాటింగ్ కనిపించట్లేదు
స్పిన్‌కు దాసోహం అంటున్న భారత బ్యాట్స్‌మెన్ దక్షిణాఫ్రికాతో సిరీస్ నెగ్గిన భారత్ జట్టుకు ప్రశంసలు మాత్రమే కాదు విమర్శలు కూడా దక్కాయి. ముఖ్యంగా పిచ్‌ను తమకు అనుకూలంగా తయారు చేయించుకోవడంపై మాజీలు మండిపడ్డారు. అయితే సిరీస్ విజయం, పిచ్‌పై చర్చతో మరో కీలక అంశంపై పెద్దగా ఎవరి దృష్టి పడలేదు. అదే భారత బ్యాట్స్‌మెన్ వైఫల్యం. పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలంగా లేవు కాబట్టి బ్యాటింగ్ పెద్దగా కనిపించే అవకాశం ఉండదు అని అనుకోవచ్చు. అయితే ఈ సిరీస్‌ను పక్కన పెట్టి కాస్త లోతుగా పరిశీలిస్తే మన బ్యాట్స్‌మెన్ గత రెండేళ్లుగా స్పిన్‌ను ఎదుర్కొవడానికి కష్టాలు పడుతున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. సిరీస్ నెగ్గాలనే ఒకే లక్ష్యంతో దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు తయారు చేసిన పిచ్‌లు ప్రస్తుతం బాగా చర్చనీయాంశం అయ్యాయి. నిజానికి భారత్‌లో సిరీస్ అంటే ఏ జట్టైనా స్పిన్ పిచ్‌లు తప్పవని ముందుగానే నిశ్చయించుకుంటుంది. అయితే ఈ స్థాయిలో పిచ్‌లు ఉంటాయని ఎవరూ అనుకోలేదు. కేవలం మూడురోజుల్లోనే మ్యాచ్ ముగిసే స్థాయిలో పిచ్‌లు ఉండడంతో కొంతమంది మాజీలు మండిపడుతున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది మరో విషయం కూడా ఉంది. అదే మన బ్యాట్స్‌మెన్ వైఫల్యం. వాళ్లే ఉంటే.. ఆ పిచ్‌లపై దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ రాణించలేకపోయారు కదా మనవాళ్లు ఎలా రాణిస్తారని సందేహం రావచ్చు. అయితే సచిన్, లక్ష్మణ్, ద్రవిడ్ ఉంటే ఈ స్థాయిలో కుప్పకూలేవారా అనేది సునీల్ గవాస్కర్ ప్రశ్న. ప్రొటీస్ జట్టులో కూడా స్మిత్, కలిస్ ఉంటే వందలోపు ఆలౌట్ అయ్యేవారా అనేది కూడా ఆలోచించాల్సిందే. నిజానికి కాస్త సహనం ప్రదర్శిస్తే క్రీజ్‌లో నిలదొక్కుకోవచ్చు అని మూడో టెస్టులో ఆమ్లా, డుప్లెసిస్ నిరూపించారు. వారిద్దరే 50 ఓవర్లకు పైగా బంతులు ఆడడమే దానికి నిదర్శనం. ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ధావన్, కోహ్లి, రహానే అవుటవడానికి బౌలర్ల కృషి కంటే వారి తొందరపాటు షాట్లే కారణమని స్పష్టంగా అర్థమవుతుంది. కాస్త మెరుగైన వాళ్లు ఉండుంటే.. సిరీస్‌లో భారత జట్టు నాలుగు సార్లు ఆలౌటైతే వాటిలో 28 వికెట్లు దక్షిణాఫ్రికా స్పిన్నర్లకే దక్కాయి. పైగా వారి స్పిన్నర్లు ఇద్దరూ ప్రపంచ స్థాయి ఆటగాళ్లు కూడా కారు. సైమన్ హార్మర్ భారత పర్యటనకు ముందు 2 టెస్టులు మాత్రమే ఆడగా, ఇమ్రాన్ తాహిర్ జట్టులో చోటు కోల్పోయి ఏకంగా 9 నెలల తర్వాత పునరాగమనం చేశాడు. వారి స్పిన్నర్ల బౌలింగ్‌లో భారత బ్యాట్స్‌మెన్ సగటు 18.39 మాత్రమే. (అంటే సగటున 18 పరుగులకు ఒక వికెట్ సమర్పించుకున్నారు). తాహిర్ 13.25 సగటుతో 12 వికెట్లు తీయగా, హర్మర్ 25.40 సగటుతో 10 వికెట్లు తీశాడు. వారిద్దరు పెద్దగా లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడి బౌలింగ్ చేయలేదు. ఒకవేళ యాసిర్ షా, హెరాత్ వంటి ప్రపంచస్థాయి బౌలర్లు ప్రత్యర్థి జట్టులో ఉండి ఉంటే సిరీస్‌ను మనం నెగ్గేవాళ్లమా అని ప్రశ్నిస్తే.. దానికి సమాధానం కష్టమే. 2014 నుంచి ఇదే వరుస.. గత రెండేళ్లుగా మన బ్యాట్స్‌మెన్ స్పిన్ బౌలింగ్‌కు దాసోహం అయిన తీరును గమనిస్తే కాస్త విస్తుపోవాల్సిందే. స్పినర్ల బౌలింగ్‌లో అతి తక్కువ సగటు ఉన్న టాప్-8 జట్ల జాబితాలో మనం చివరి నుంచి మూడో స్థానంలో ఉన్నాం. 31.61 సగటుతో మనం ఉండగా, వెస్టిండీస్ (30.20), దక్షిణాఫ్రికా (27.01) మన కింది స్థానాల్లో ఉన్నాయి. (మన సిరీస్ లేకపోయింటే దక్షిణాఫ్రికా సగటు కూడా భారత్ కంటే మెరుగ్గానే ఉండేది) ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏమిటంటే ఈ కాలంలో భారత్ విదేశాల్లోనే ఎక్కువగా మ్యాచ్‌లు ఆడింది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో స్పిన్‌కు అనుకూలించని పిచ్‌లపై కూడా మన బ్యాట్స్‌మెన్ స్పిన్నర్లకే వికెట్లు సమర్పించుకున్నారు. ఇంగ్లండ్ స్పిన్నర్ మొయిన్ అలీకి దాసోహమైన మన బ్యాట్స్‌మెన్ అతని బౌలింగ్‌లో సగటున 23 పరుగులకు ఒక వికెట్ ఇచ్చేశారు. అదే సిరీస్‌లో భారత స్పిన్నర్ల సగటు ఏకంగా 44.07. (అప్పటికి అశ్విన్ ఈ స్థాయి ఫామ్‌లో లేడు). మరోవైపు ఆస్ట్రేలియా సిరీస్‌లో సైతం ఎక్కువ వికెట్లు తీసింది వారి స్పిన్నర్ నాథన్ లియోనే. ఆసియా దేశాల బ్యాట్స్‌మెన్ స్పిన్ ఆడడంలో సిద్ధహస్తులు. ఇక్కడి పిచ్‌లు స్పిన్‌కే అనుకూలిస్తాయి కాబట్టి బంతి టర్న్ అయినా సరే ఆడడంలో పెద్దగా ఇబ్బంది పడరు. అయితే గత రెండేళ్లలో స్పిన్ బౌలింగ్‌లో మన బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడినంతగా ఆసియా టాప్-4 జట్లలో ఏది పడలేదు. స్పిన్ బౌలింగ్‌లో పాకిస్తాన్ సగటు 47.10, బంగ్లాదేశ్ సగటు 37.92, శ్రీలంక సగటు 33.58గా ఉంది. విదేశాల్లో సమస్యలు.. మన దేశంలో సిరీస్ కాబట్టి స్పిన్‌ను నమ్ముకున్నారు. అందుకు తగ్గట్లుగానే అశ్విన్ 24 వికెట్లతో, జడేజా 16 వికెట్లతో, మిశ్రా 7 వికెట్లతో దుమ్ములేపారు. సిరీస్‌లో దక్షిణాఫ్రికావి మొత్తం 50 వికెట్లు పడితే 47 స్పిన్నర్లకే దక్కాయి. పిచ్‌పై చర్చ రాగానే స్పందించిన కోహ్లి మాట్లాడుతూ.. విదేశాల్లో వారికి అనుకూలమైన పిచ్లే ఉంటాయి కదా అని వ్యాఖ్యానించాడు. అంటే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాల్లో పేస్ ట్రాక్‌లు ఉంటాయని దానర్థం. మరీ అక్కడి వెళితే మన స్పిన్ ప్రభావం నామమాత్రమే. టెస్టుల్లో వికెట్లు తీస్తేనే గెలుస్తామని చెప్పే కోహ్లి ఆ పని చేసే పేస్ ఎవరనేది ప్రశ్నించుకోవాలి. ప్రస్తుతం జట్టులో ఉన్న ఇషాంత్, ఉమేశ్ యాదవ్, వరుణ్ అరోన్, భువనేశ్వర్ కుమార్లో ఎవరిపైనా నమ్మకం పెట్టుకునే పరిస్థితుల్లో జట్టు మేనేజ్మెంట్ లేదు. అలాంటి సమయాల్లో బ్యాట్స్‌మెన్‌నే నమ్ముకోవాలి. పుంజుకోవాల్సిన సమయమిదే... ఈ సిరీస్‌లో భారత జట్టు చేసిన అత్యధిక స్కోరు 215 పరుగులు. కోహ్లి నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి చేసినవి 68 పరుగులు మాత్రమే. కోహ్లి తర్వాత అంతటి స్టార్ రహానే, రోహిత్ శర్మ, సాహా, ధానవ్ ఘోరంగా విఫలమయ్యారు. వీళ్లలో కోహ్లి, రహానే, రోహిత్ సాంకేతికత గురించి అందరికి తెలిసిందే. లోపమంతా సహనంగా ఆడకపోవడమే. 1990-2011 మధ్య దిగ్గజాలు సచిన్, లక్ష్మణ్, ద్రవిడ్, గంగూలీ ఆడే సమయంలో స్పిన్ బౌలింగ్‌లో మన సగటు 44.97 (ఆ సమయంలో మనదే అత్యధికం). వీళ్ల రిటైర్మెంట్ తర్వాతే అసలు సమస్య వచ్చింది. కనీసం నాలుగో టెస్టులోనైనా వారి దాన్ని అధిగమిస్తారని ఆశిద్దాం. దక్షిణాఫ్రికాతో సిరీస్ తర్వాత భారత్ మళ్లీ ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ల్లోనే పర్యటిస్తుంది. ఇంతకుముందులా కాకుండా అక్కడి పిచ్‌లపై వారి స్పిన్నర్లను మన బ్యాట్స్‌మెన్ ఎదుర్కొవాలంటే నాలుగో టెస్టు మ్యాచే వారికి సరైన ప్రయోగశాల లాంటిది. అక్కడి ఫాస్ట్ట్రాక్లపై మన బౌలర్ల వైఫల్యాన్ని అధిగమించాలంటే ఉన్న ఏకైక మార్గం మన బలమైన బ్యాటింగ్‌లో రాణించడమేనని జట్టు గుర్తిస్తే మంచిది. -
క్రికెట్ మాట్లాడదాం క్రికెట్ విందాం క్రికెట్ చూద్దాం
♦ భారత్, దక్షిణాఫ్రికా సిరీస్‌కు రంగం సిద్ధం ♦ నేడు తొలి టి20 మ్యాచ్ ♦ సమంగా కనిపిస్తున్న ఇరు జట్లు ♦ హోరాహోరీ పోరు ఖాయం ►... ఎందుకంటే ఇలాంటి సిరీస్ ప్రతిసారీ రాదు. ఇలాంటి పోరాటాన్ని తరచుగా చూడలేం. ప్రపంచకప్ ముగిసిన దగ్గర్నించి నాణ్యమైన క్రికెట్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన భారత అభిమానులకు రాబోయే రెండు నెలలూ పండగే. ►సొంతగడ్డపై తిరుగులేని రికార్డుతో భారత్ ఓవైపు... విదేశాల్లో మెరుగైన రికార్డు ఉన్న దక్షిణాఫ్రికా మరోవైపు... భారీ హిట్టర్లు... నాణ్యమైన బౌలర్లు... మెరుపు ఫీల్డర్లు... ఆఖరి క్షణం దాకా పోరాడే తత్వం... అందుకే చూసినోళ్లకు చూసినంత వినోదం. ►చరిత్రలో తొలిసారి జాతి నేతల పేర్ల మీద జరుగుతున్న గాంధీ-మండేలా సిరీస్... మహాత్మా గాంధీ జయంతి రోజే ప్రారంభమవుతోంది. హిమాలయాల ఒడిలో రెండు జట్లు ధనాధన్ పోరుతో అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ధర్మశాల: గత ఏడాది బంగ్లాదేశ్‌లో టి20 ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత భారత జట్టు 3 అంతర్జాతీయ టి20లు మాత్రమే ఆడింది. అటు దక్షిణాఫ్రికా మాత్రం 10 మ్యాచ్‌లలో బరిలోకి దిగింది. అయితే సొంతగడ్డపై ఐపీఎల్ ద్వారా అపార అనుభవం సంపాదించిన మన ఆటగాళ్లకు పొట్టి క్రికెట్ సమరం కొత్త కాదు. ఈ నేపథ్యంలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు (శుక్రవారం) ఇక్కడ తొలి పోరుకు రంగం సిద్ధమైంది. ధోని నాయకత్వంలో కొంత విరామం తర్వాత భారత్ మళ్లీ బరిలోకి దిగుతుండగా, అటు డు ప్లెసిస్ నేతృత్వంలో దక్షిణాఫ్రికా సన్నద్ధమైంది. అంతా స్టార్లే టి20 మ్యాచ్ కోసం భారత బ్యాటింగ్ లైనప్ దుర్భేద్యంగా కనిపిస్తోంది. గాయంనుంచి పూర్తిగా కోలుకొని బంగ్లా ‘ఎ’పై సత్తా చాటిన శిఖర్ ధావన్ శుభారంభం అందించగలడు. మరో ఓపెనర్‌గా రోహిత్ శర్మ, రహానేలలో ఒకరు బరిలోకి దిగుతారు. ఆ తర్వాత కోహ్లి, రైనా, ధోనిలు చెలరేగితే భారీస్కోరు ఖాయం. ఇక్కడి పిచ్‌ను దృష్టిలో ఉంచుకొంటే బిన్నీ తుది జట్టులో ఖాయంగా ఉండే అవకాశం ఉంది. బౌలింగ్ విభాగంలో ఇద్దరు స్పిన్నర్లతో ఆడే అవకాశం ఉంది. అశ్విన్‌తో పాటు హర్భజన్, మిశ్రాలలో ఒకరికే చోటు దక్కుతుంది. పేస్ విభాగంలో మాత్రం అనుభవలేమి కనిపిస్తోంది. గతంలో ప్రధాన పేసర్‌గా జట్టుకు అనేక విజయాలు అందించిన భువనేశ్వర్ కుమార్ గత ఆరు నెలలుగా మ్యాచ్ ఆడలేదు. ఇక ఐపీఎల్ అనుభవంతో మోహిత్ శర్మ ఆకట్టుకోవచ్చు. కేవలం టి20లకే ఎంపికైన శ్రీనాథ్ అరవింద్‌కు చోటు దక్కుతుందా లేదా చూడాలి. జట్టులో అందరికీ ఐపీఎల్ అనుభవం ఉండటం కీలకం కానుంది. కోలుకుంటారా... మరో వైపు వార్మప్ మ్యాచ్‌కు విలువ లేకపోయినా, భారీ స్కోరు చేసి కూడా ఓడటం దక్షిణాఫ్రికాను కాస్త ఇబ్బంది పెట్టింది. అయితే స్వింగ్‌కు అనుకూలించే ధర్మశాల పిచ్‌పై తొలి మ్యాచ్ ఆడటం తమకు శుభారంభం ఇస్తుందని ఆ జట్టు నమ్ముతోంది. బ్యాటింగ్‌లో డివిలియర్స్, డు ప్లెసిస్, మిల్లర్, డుమినిలాంటి హిట్టర్లు టీమ్‌లో ఉండగా డి కాక్ కూడా చక్కటి షాట్లు ఆడగలడు. భారత్‌లాగే ఐపీఎల్‌ను ఎక్కువగా ఉపయోగించుకున్న ఆటగాళ్లు ఉండటం ఆ జట్టుకు అనుకూలాంశం. సుదీర్ఘ పర్యటన కావడంతో టి20ల్లో తమ అగ్రశ్రేణి బౌలర్లకు సఫారీలు విశ్రాంతినిచ్చారు. ఫలితంగా కైల్ అబాట్, క్రిస్ మోరిస్ జట్టు బాధ్యతలు మోస్తున్నారు. ఎడీ లీ, రబడ, జోండోలకు అనుభవం లేదు. వీరంతా ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారీగా పరుగులిచ్చారు. టి20ల్లో మంచి రికార్డు ఉన్న ప్రధాన స్పిన్నర్ తాహిర్‌ను ఎదుర్కోవడం అంత సులువు కాదు. ఆసీస్ దిగ్గజం మైక్ హస్సీ దక్షిణాఫ్రికా సలహాదారుడిగా పని చేస్తుండటం ఆ జట్టుకు అదనపు బలం. జట్ల వివరాలు (అంచనా): భారత్: ధోని (కెప్టెన్), ధావన్, రోహిత్, రహానే, కోహ్లి, రైనా, బిన్నీ, అశ్విన్, భువనేశ్వర్, మోహిత్, హర్భజన్/అక్షర్ దక్షిణాఫ్రికా: డు ప్లెసిస్ (కెప్టెన్), డి కాక్, డివిలియర్స్, డుమిని, మిల్లర్, బెహర్దీన్, మోరిస్, డి లాంజ్, అబాట్, రబడ, తాహిర్. దూకుడు అంటే మాటల దాడినో, భౌతికంగా ఢీకొట్టడమో కాదు. నిబంధనలకు లోబడే హద్దులు దాటకుండా దూకుడు ఉంటే తప్పు లేదు. కానీ క్రమశిక్షణ చర్యతో మ్యాచ్‌కు దూరమయ్యేంత కాదు. మేం అనుకున్న సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఇంకా దొరకలేదని చెప్పగలను. కాబట్టి అందుబాటులో ఉన్న ఆటగాళ్లనుంచే అత్యుత్తమమైనవారిని ఎంచుకోవాలి. ఈ సిరీస్‌లో వచ్చే ప్రపంచకప్‌పై ఎలాంటి ప్రభావం ఉండదు. దానికి చాలా సమయముంది. మన ఆటగాళ్లను వంతులవారీగా పరీక్షించుకునేందుకు, ఫామ్‌లోకి వచ్చేందుకు ఈ మ్యాచ్‌లు ఉపయోగపడతాయి. -ధోని పేసర్లు మా బలమే అయినా ఇక్కడ మేం తాహిర్పై చాలా ఆధార పడుతున్నాం. అతను ఈ మ్యాచ్‌లో కీలకం అవుతాడు. ప్రాక్టీస్ మ్యాచ్ ఫలితాన్ని పట్టించుకోవడం లేదు. ఇక్కడి పరిస్థితులపై అవగాహన ఉంది. సుదీర్ఘ పర్యటన మా ఆటగాళ్లందరికీ సవాల్లాంటిది. ఐపీఎల్ జట్టులోని స్నేహాలు ఇక్కడి పోటీతత్వానికి అడ్డు రావు. కాకపోతే బలాలు, బలహీనతలపై అవగాహన ఉంది కాబట్టి విజయం కోసం కొత్తగా ఆలోచించాల్సి ఉంటుంది. - డు ప్లెసిస్, దక్షిణాఫ్రికా కెప్టెన్ పిచ్, వాతావరణం వేగవంతమైన వికెట్, అవుట్ ఫీల్డ్ ఉన్నాయి. ఆరంభంలో బంతి స్వింగ్ అయినా... చక్కటి బౌన్స్‌తో బ్యాటింగ్‌కు కూడా అనుకూలిస్తుందని క్యురేటర్ చెప్పారు. మంచు కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో బౌలర్లకు కాస్త ఇబ్బంది కలగవచ్చు. కాబట్టి టాస్ కీలకం కానుంది. శుక్రవారం వర్ష సూచన లేదు. సా. గం. 7.00నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం టి20ల్లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య 8 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ 6 గెలిచి, 2 ఓడింది. భారత గడ్డపై ఇరు జట్ల మధ్య ఇదే తొలి టి20 మ్యాచ్ కావడం విశేషం. -
ధావన్ అజేయ సెంచరీ
భారత్ ‘ఎ’ 161/1 బంగ్లాదేశ్ ‘ఎ’తో టెస్టు మ్యాచ్ బెంగళూరు: కీలకమైన దక్షిణాఫ్రికా సిరీస్‌కు ముందు ఓపెనర్ శిఖర్ ధావన్ (112 బంతుల్లో 116 బ్యాటింగ్; 16 ఫోర్లు, 2 సిక్సర్లు) గాడిలో పడ్డాడు. బంగ్లాదేశ్ ‘ఎ’తో ఆదివారం ప్రారంభమైన అనధికార టెస్టు మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగి ఫామ్, ఫిట్నెస్ను నిరూపించుకున్నాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 33 ఓవర్లలో వికెట్ నష్టానికి 161 పరుగులు చేసింది. ధావన్‌తో పాటు శ్రేయస్ అయ్యర్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. అభినవ్ ముకుంద్ (34) ఓ మాదిరిగా ఆడినా... ధావన్ మాత్రం బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తొలి వికెట్‌కు 153 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చాడు. ప్రస్తుతం టీమిండియా ఇంకా 67 పరుగులు వెనుకబడి ఉంది. ధావన్ 97 బంతుల్లో శతకం పూర్తి చేశాడు. రాణించిన ఆరోన్, జయంత్: అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 52.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. పేసర్ వరుణ్ ఆరోన్ (4/45), స్పిన్నర్ జయంత్ యాదవ్ (4/28) బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీశారు. ఆరంభంలో పేసర్ ఆరోన్ నిప్పులు చెరగడంతో ఓ దశలో బంగ్లా 6 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో షబ్బీర్ రెహమాన్ (131 బంతుల్లో 122; 23 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో రాణించి బంగ్లాదేశ్‌ను ఆదుకున్నాడు. నాసిర్ హుస్సేన్ (32)తో కలిసి ఐదో వికెట్‌కు 44; షువుగత (62)తో కలిసి ఆరో వికెట్‌కు 132 పరుగులు జోడించి బంగ్లాదేశ్ స్కోరును 200 దాటించాడు. చివర్లో జయంత్ స్పిన్ మ్యాజిక్ చూపెట్టడంతో బంగ్లా లోయర్ ఆర్డర్ ఒత్తిడిని తట్టుకోలేకపోయింది. 46 పరుగుల తేడాలో చివరి 5 వికెట్లు కోల్పోయింది. -
ధోనీకి ఉద్వాసన తప్పదా..?
(వెబ్సైట్ ప్రత్యేకం) తను ఆడిందే ఆటగా సాగిన మహేంద్ర సింగ్ ధోనీకీ ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది.. కొహ్లీ ని ప్రమోట్ చేయడం వెనక... బోర్డు రాజకీయాలే కారణమా..? ధోనీ.. శ్రీని మనిషనే బ్రాండే .. కెప్టెన్ కూల్ కొంప ముంచుతోందా..? ధోనీని టీమిండియా నుంచి సాగనంపడానికి రంగం సిద్ధమైందా..? విరాట్ కోహ్లీకి పూర్తిస్ధాయిలో కెప్టెన్సీ ఇవ్వడానికి బీసీసీఐ ప్లాన్ చేస్తోందా...? రానున్న సౌతాఫ్రికా సిరీస్ నే ముహుర్తంగా ఎంచుకున్నారా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. 2019 ప్రపచ కప్ దృష్టి లో పెట్టుకుని టీమిండియా లో మార్పులు చేర్చులు జరుగుతున్నాయని.. గత కొంత కాలంగా.. బీసీసీఐ వర్గాలు చెబతున్నాయి. ఇప్పుడు అదే మంత్రాన్ని కెప్టెన్సీ విషయంలోనూ వల్లె వేసే పరిస్థితి కనిపిస్తోంది. రానున్న దక్షిణ ఆఫ్రికా సిరీస్ కు ధోనికి బదులు విరాట్ కొహ్లీని కెప్టెన్ గా ఎంపిక చేసే దిశగా.. బీసీసీఐ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జరిగే ట్వంటీ సిరీస్ వరకు ధోనీకి విశ్రాంతి ఇచ్చి.. కోహ్లీని కెప్టెన్సీ ఇచ్చే అంశంపై బీసీసీఐ కసరత్తు చేస్తోంది. ఇవన్నీ నిజమైతే ధోనీ కెరీర్ ముగిసినట్టే. లేదంటే.. ధోనీ ని టీ20 కెప్టెన్‌గా మాత్రం కొనసాగించే అవకాశం ఉంది. అయితే అంతర్జాతీయ క్రికెట్లో భారత క్రికెట్‌కు ప్రత్యేక గుర్తింపు, అనేక విజయాలు సాధించిపెట్టిన ధోనీకి ఈ కష్టాకాలం ఎందుకొచ్చింది. 2011లో శ్రీనివాసన్ బీసీసీఐ పగ్గాలు చేపట్టాక.. అతడి స్వంత ఐపీఎల్ టీమ్ లో ధోనీ భాగస్వామిగా మారాడు. అప్పటి నుంచి ధోనీ వ్యవహార శైలి మారిపోయిందంటారు. బోర్డును .. టీమిండియాను అప్రతిహతంగా ఏలాడు. అయితే అవినీతి ఆరోపణలతో.. బోర్డునుంచి.. శ్రీని నిష్క్ర మించడంతో ధోనీకి కష్టాలు ప్రారంభమయ్యాయి. శ్రీనివాసన్‌తో వ్యక్తిగతంగానూ.. వ్యాపార సంబంధాలు ఉన్న ధోనీని పక్కన పెట్ట సాగింది. దీనికి తోడు పేవలమైన ఫాం, ఆస్టేలియా పర్యటనలో టీమిండియా ఘోర పరాజయంతో.. టెస్టు కెప్టెన్ బాధ్యతల నుంచి ధోని తప్పుకోవాల్సి వచ్చింది. అవకాశం లభించడంతో సెలక్టర్లు ఆలస్యం చేయకుండా టెస్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని ఎంపిక చేశారు. ఇక శ్రీలంక టెస్టు సిరిస్‌లో టీమిండియా దున్నేయడంతో.. కొహ్లీ పాతుకు పోయాడు. ప్రస్తుతం టీమిండియాలో ధోనీ వికెట్ కీపర్‌గా.. మాత్రమే కొనసాగుతున్నాడు. అయితే.. ఐపీఎల్ పుణ్యమా అని బోలెడు మంది యంగ్స్టర్లు జట్టులో ఛాన్స్ కోసం పోటీ పడుతున్నారు. దీంతో, ధోనీపై వత్తిడి పెరుగుతోంది. నిజానికి ధోనీ గొప్ప వికెట్ కీపరేమీ కాదు. బ్యాటింగ్ టాలెంటే అతన్ని ఇంతకాలం కాపాడింది. అయితే.. ఇదే ఇప్పుడు ధోనీకి ఇబ్బందిగా మారుతోంది.. మిస్టర్ కూల్ ను టెన్షన్ పెడుతోంది. పేవల ఫామ్ తో ఇక ఎంతో కాలం టీమ్ ను అంటి పెట్టుకుని ఉండటం సాధ్యం కాదు.. నిజానికి ఏడాదిన్నర నుంచీ, వన్డే ఫార్మాట్లో కెప్టెన్ మారాలనే వాదన బలంగా వినిపిస్తోంది. ధోనీ ప్లేస్‌లో కోహ్లీకి ఛార్జ్ ఇవ్వమని మాజీ క్రికెటర్లు బీసీసీఐకి చాలా సందర్భాల్లో సూచించారు. విరాట్ దూకుడుకు, వన్డే ఫార్మాట్ కు కరెక్టర్ అని మాజీలు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ కప్ తర్వాత.. బంగ్లాదేశ్‌లో వన్డే సిరీస్‌ను ఓడిపోవడంతో ఈ వాదన మరో సారి ముందుకు వచ్చింది. మరి కొద్ది రోజుల్లో మొదలు కానున్న సౌతాఫ్రికా సిరీస్ టీమిండియాకు కీలకం. దీంతో సెలక్టర్ల లో ఒక వర్గం విరాట్‌కు అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ ఇవ్వాలన్న వాదనను తెరపైకి తెస్తోంది. దీనికితోడు, శ్రీలంక టూర్ యంగ్ కెప్టెన్ కు ఫుల్ మార్కులు పడేలా చేసింది. టెస్టుల్లో దూకుడు వద్దంటున్న వాళ్లూ.. వన్డేల్లో విరాట్ మనస్థత్వాన్ని సమర్ధిస్తున్నారు. దీనికి తోడు కెప్టెన్‌గానూ రెండు వన్డే సిరీస్‌లను అందించాడు కోహ్లీ. అగ్రిసివ్‌గా ఉన్నా.. అపారమైన టాలెంట్ ఉంది కాబట్టి కోహ్లీకి మైనస్ మార్కులేమీ లేవు. అదే, ఇతన్ని వన్డేల్లోనూ కెప్టెన్‌గా చేయాలన్న వాదనను బలపరుస్తోంది. ఏదేమైనా, క్రికెటర్‌గా కాకున్నా కెప్టెన్‌గా ధోనీ కెరీర్ ముగింపుకొచ్చింది. వచ్చే ఏడాది జరిగే టీ 20 వరల్డ్ కప్ తర్వాత, కెప్టెన్సీపై ఓ నిర్ణయం తీసుకుంటానని ఇంతకు ముందే చెప్పాడు... కానీ , సెలక్టర్లు అంతవరకూ ఆగేలా కనిపించడం లేదు.. ఒకప్పుడు దిగ్గజ ఆటగాళ్లను ఎలా అయితే.. బలవంతంగా టీమ్ నుంచి ఉద్వాసన పలికాడో.. సరిగ్గా అలాంటి స్ధితిలో ధోనీ ఉండటం యాదృచ్చికం మాత్రం కాదు.. అయితే.. టీమిండియా కలలో కూడా ఊహించని కప్పులు.. దిగ్గజాలకు కూడా సాధ్యం కాని విజయాలు సాధించి పెట్టిన ధోనీకి గౌరవ ప్రదంగా తప్పుకునే అవకాశం ఇవ్వాలనేది సగటు క్రికెట్ ప్రేమికుడి కోరిక.. మరి సెలక్టర్ లు ఎలా స్పందిస్తారో చూడాలి. -
మరో నాలుగేళ్లు ఆడతాడు
♦ ధోని కెరీర్‌పై సంజయ్ పటేల్ వ్యాఖ్య ♦ వీడ్కోలు టెస్టు కోరుకోలేదన్న కార్యదర్శి ముంబై: టెస్టుల నుంచి తప్పుకోవాలన్న మహేంద్ర సింగ్ ధోని నిర్ణయాన్ని తాము మార్చాలని ప్రయత్నించినా లాభం లేకపోయిందని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ వెల్లడించారు. అతను కనీసం మరో రెండేళ్లు కొనసాగాలని తాము కోరుకున్నట్లు ఆయన చెప్పారు. ‘ఒకవేళ ఒత్తిడిలో రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తుంటే దాన్ని వెంటనే మర్చిపో. వచ్చే ఏడాది కూడా నువ్వే కెప్టెన్‌గా కొనసాగుతావని హామీ ఇస్తున్నా అని ధోనితో చెప్పాను. కానీ అతను అప్పటికే తన నిర్ణయం తీసేసుకున్నాడు. సరిగ్గా చెప్పాలంటే అతను టెస్టు జట్టుకు భారంగా మారాడని బోర్డు గానీ సెలక్టర్లు గానీ అసలు ఏనాడు అనుకోలేదు’ అని పటేల్ అన్నారు. తన అంచనా ప్రకారం ధోని కనీసం 2019 వరకు ఆడుతాడని పటేల్ అభిప్రాయ పడ్డారు. గత ఏడాది వరకు తమకు వైస్ కెప్టెన్ ఆలోచనే లేదని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ధోని కోరడంతోనే వైస్ కెప్టెన్‌ను ఎంపిక చేశామని ఆయన వెల్లడించారు. అది ధోని బ్రాండ్... ధోని వ్యక్తిత్వాన్ని బట్టి చూస్తే అతను వీడ్కోలు టెస్టు కోరుకునే రకం కాదని సంజయ్ పటేల్ వ్యాఖ్యానించారు. అతని రిటైర్మెంట్ ప్రకటనలోనే అది కనిపించిందని ఆయన అన్నారు. ‘ధోని ఇలాంటి విషయాలు ఎప్పుడూ డిమాండ్ చేయడు. ఎంతో ధైర్యవంతుడైన వ్యక్తే ఇలాంటి నిర్ణయం తీసుకోగలడు. చివరి టెస్టు ఘనంగా ముగించాలనుకుంటే ఈ ఏడాది చివర్లో సొంతగడ్డపై దక్షిణాఫ్రికా సిరీస్ వరకు వేచి చూసేవాడు. అది ధోని బ్రాండ్ రిటైర్మెంట్’ అని పటేల్ చెప్పారు. ధోని ఇక చదువుకోవచ్చు.. రాంచీ: టెస్టుల నుంచి తప్పుకోవడంతో ధోనికి కొంతైనా విరామం దొరుకుతుందని, అతను తన గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేయవచ్చని అతని ఒకనాటి స్కూల్ ప్రిన్సిపల్ ధరంరాజ్ సింగ్ సలహా ఇచ్చారు. ఇక్కడి సెయింట్ గ్జేవియర్ కాలేజీలో డిగ్రీలో అడ్మిషన్ తీసుకున్నా, తగిన హాజరు లేక ధోని మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరు కాలేదు. ‘ధోని ప్లస్ టూ మాత్రమే పూర్తి చేశాడని నాకు తెలుసు. ఇకపై అతను అనుకుంటే గ్రాడ్యుయేషన్ పూర్తి చేయవచ్చు. అయితే మరో రకంగా కూడా చదువుతో భాగం కావచ్చు. ధోని ఇప్పుడు ఎంతో పరిణతి చెందాడు. ఇంగ్లీష్‌లో కూడా బాగా మాట్లాడుతున్నాడు. కాబట్టి చిన్నారులకు చదువుపై ఆసక్తి పెరిగి, వారు రాణించేలా తన వంతుగా సహాయం చేయగలడు’ అని ప్రిన్సిపల్ అన్నారు. కోచ్‌గా హస్సీకి ఎంఎస్ సిఫారసు! బెంగళూరు: భారత క్రికెట్ జట్టు కోచ్ పదవికి మైక్ హస్సీ పేరును ధోని సిఫారసు చేసినట్లు తెలిసింది. ఈ విషయాన్ని నేరుగా ధోని, బీసీసీఐ పెద్దలకు చెప్పినట్లు సమాచారం. ప్రస్తుత కోచ్ ఫ్లెచర్ కాంట్రాక్ట్ ఈ ఏడాది వన్డే ప్రపంచ కప్‌తో ముగియనుంది. హస్సీ వ్యూహ చతురత, నైపుణ్యం భారత కెప్టెన్‌ను ఆకట్టుకున్నాయి. ఇటీవల ఆసీస్ పర్యటనకు ముందు మురళీ విజయ్ టెక్నిక్‌ను కూడా హస్సీ సరిదిద్దాడు. ఈ సిరీస్‌లో విజయ్ అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడిగా హస్సీతో ధోనికి మంచి అనుబంధం ఉంది. మహి వ్యక్తిత్వం గొప్పది: హాడిన్ సిడ్నీ: టెస్టులకు వీడ్కోలు పలికిన మహేంద్ర సింగ్ ధోని గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి అని ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ బ్రాడ్ హాడిన్ అన్నాడు. అతను చాలా మెరుగైన స్థితిలో జట్టును వదిలి వెళ్లాడన్నాడు. ‘ధోనిలో గొప్పతనం అతని స్వభావం, వ్యక్తిత్వమే. ఆటను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాడు. ప్రస్తుత జట్టులో నిలకడను తెచ్చాడు. ఆట విలువను పెంచాడు. అయితే ధోని రిటైర్మెంట్ మాత్రం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. భారత క్రికెట్‌కు గొప్ప సేవకుడు. తనతో పాటు జట్టును నడిపిన తీరు అమోఘం. ఎంఎస్లోని ప్రశాంతత టీమిండియాకు గొప్ప కెప్టెన్‌గా నిలబెట్టింది. అలాంటి వ్యక్తితో కలిసి క్రికెట్ ఆడటం చాలా గొప్పగా భావిస్తున్నా’ అని హాడిన్ వ్యాఖ్యానించాడు. ఈ సిరీస్‌లో కోహ్లితో జరిగిన మాటల యుద్ధంపై వికెట్ కీపర్ స్పందించలేదు. కోరుకున్న విధంగా ఆడుతున్నాం... ఈ సిరీస్‌లో తాము కోరుకున్న విధంగా ఆడుతున్నామని హాడిన్ అన్నాడు. ‘మేం సిరీస్ గెలిచాం. ఇది మాకు చాలా ప్రధానమైంది. మెల్‌బోర్న్‌లోనూ సరైన విధంగానే ఆడాం. భారత్‌ను ఈ సిరీస్ నుంచి పూర్తిగా పక్కకు నెట్టాం. సిడ్నీలో కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండదు. ఆట ఎలా సాగుతుందనేది మాకు పూర్తిగా తెలుసు. గెలుపుతో సిరీస్‌ను ముగిస్తే చాలా సంతోషంగా ఉంటుంది. దాని కోసమే మేం ఆడతాం. పది అవకాశాలను సృష్టించుకుంటే గెలుపు మాదే’ అని ఈ వైస్ కెప్టెన్ పేర్కొన్నాడు. షార్ట్ బంతులతో భారత బౌలర్లు తనను లక్ష్యంగా చేసుకున్నా... ఎలాంటి ఇబ్బంది లేదన్నాడు.