
న్యూఢిల్లీ: వన్డేలు, టి20ల్లో విధ్వంసక ఆటతీరు కనబర్చినా మొదటి నుంచి టెస్టుల్లో రోహిత్ శర్మ ఆటతీరు అంతంత మాత్రమే. అతడికి ప్రధాన బ్యాట్స్‌మన్‌గా కూడా పెద్దగా గుర్తింపు రాలేదు. ఇటీవల దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగే ముందు వరకు కూడా రోహిత్ టెస్టు కెరీర్ డోలాయమానంలోనే ఉంది. టెస్టులకు తగినట్లుగా అతని టెక్నిక్ లేకపోవడం కూడా అందుకు కారణం. దీనిపై మాట్లాడుతూ రోహిత్... టెస్టుల్లో ప్రదర్శన గురించి గతంలో అతిగా ఆలోచించేవాడినని, ఇప్పుడు దానిని వదిలేసి ఆటను ఆస్వాదించడంపైనే దృష్టి పెట్టినట్లు చెప్పాడు.
‘టెస్టుల్లో విజయవంతం కావడం గురించి చాలా తీవ్రంగా ఆలోచించేవాడిని. ఇలాంటి షాట్ ఎందుకు ఆడానా అని తలబద్దలు కొట్టుకునేవాడిని. ప్రతీ ఇన్నింగ్స్ తర్వాత వీడియో అనలిస్ట్ వద్దకు వెళ్లి విశ్లేషణ చేసి నా బుర్రను మరింత గందరగోళంలో పడేసేవాడిని. టెక్నిక్ గురించి అతిగా ఆలోచించేవాడిని. గత ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందు నా ఆలోచన మారిపోయింది. ఫలితం ఎలా ఉన్నా సరే సాంకేతిక అంశాలను పట్టించుకోవద్దని నిర్ణయించుకున్నా.
మైదానంలో వెళ్లి నాదైన శైలిలో స్వేచ్ఛగా ఆడటమే ముఖ్యమని భావించా’ అని వ్యాఖ్యానించాడు. ఎవరో చేసే వ్యాఖ్యలను పట్టించుకునే దశను కూడా దాటిపోయానన్న రోహిత్... తన కుటుంబమే అన్నింటికంటే ముఖ్యమని చెప్పాడు. వరల్డ్ కప్ సమయంలో ఆటగాళ్లు అనుమతించిన రోజులను మించి నిబంధనలకు విరుద్ధంగా కుటుంబ సభ్యులను తమతోనే ఉంచుకోవడంపై వచ్చిన విమర్శలకు స్పందిస్తూ... తమకు అండగా నిలిచేందుకు వారు అక్కడ ఉండటంలో తప్పేమీ లేదని, అయినా అనవసరంగా వారిని వివాదాల్లోకి లాగవద్దని కోరాడు.