క్రికెట్ మాట్లాడదాం క్రికెట్ విందాం క్రికెట్ చూద్దాం | Dhoni says India lack a seamer all-rounder who can bowl four overs in T20 | Sakshi
Sakshi News home page

క్రికెట్ మాట్లాడదాం క్రికెట్ విందాం క్రికెట్ చూద్దాం

Published Fri, Oct 2 2015 12:52 AM | Last Updated on Sun, Sep 3 2017 10:18 AM

క్రికెట్ మాట్లాడదాం క్రికెట్ విందాం క్రికెట్ చూద్దాం

క్రికెట్ మాట్లాడదాం క్రికెట్ విందాం క్రికెట్ చూద్దాం

భారత్, దక్షిణాఫ్రికా సిరీస్‌కు రంగం సిద్ధం
  నేడు తొలి టి20 మ్యాచ్
  సమంగా కనిపిస్తున్న ఇరు జట్లు
  హోరాహోరీ పోరు ఖాయం


... ఎందుకంటే ఇలాంటి సిరీస్ ప్రతిసారీ రాదు. ఇలాంటి పోరాటాన్ని తరచుగా చూడలేం. ప్రపంచకప్ ముగిసిన దగ్గర్నించి నాణ్యమైన క్రికెట్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన భారత అభిమానులకు రాబోయే రెండు నెలలూ పండగే.

సొంతగడ్డపై తిరుగులేని రికార్డుతో భారత్ ఓవైపు... విదేశాల్లో మెరుగైన రికార్డు ఉన్న దక్షిణాఫ్రికా మరోవైపు...
భారీ హిట్టర్లు... నాణ్యమైన బౌలర్లు... మెరుపు ఫీల్డర్లు... ఆఖరి క్షణం దాకా పోరాడే తత్వం... అందుకే చూసినోళ్లకు చూసినంత వినోదం.

చరిత్రలో తొలిసారి జాతి నేతల పేర్ల మీద జరుగుతున్న గాంధీ-మండేలా సిరీస్... మహాత్మా గాంధీ జయంతి రోజే ప్రారంభమవుతోంది. హిమాలయాల ఒడిలో రెండు జట్లు ధనాధన్ పోరుతో అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.

ధర్మశాల: గత ఏడాది బంగ్లాదేశ్‌లో టి20 ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత భారత జట్టు 3 అంతర్జాతీయ టి20లు మాత్రమే ఆడింది. అటు దక్షిణాఫ్రికా మాత్రం 10 మ్యాచ్‌లలో బరిలోకి దిగింది. అయితే సొంతగడ్డపై ఐపీఎల్ ద్వారా అపార అనుభవం సంపాదించిన మన ఆటగాళ్లకు పొట్టి క్రికెట్ సమరం కొత్త కాదు. ఈ నేపథ్యంలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు (శుక్రవారం) ఇక్కడ తొలి పోరుకు రంగం సిద్ధమైంది. ధోని నాయకత్వంలో కొంత విరామం తర్వాత భారత్ మళ్లీ బరిలోకి దిగుతుండగా, అటు డు ప్లెసిస్ నేతృత్వంలో దక్షిణాఫ్రికా సన్నద్ధమైంది.

అంతా స్టార్‌లే
టి20 మ్యాచ్ కోసం భారత బ్యాటింగ్ లైనప్ దుర్భేద్యంగా కనిపిస్తోంది. గాయంనుంచి పూర్తిగా కోలుకొని బంగ్లా ‘ఎ’పై సత్తా చాటిన శిఖర్ ధావన్ శుభారంభం అందించగలడు. మరో ఓపెనర్‌గా రోహిత్ శర్మ, రహానేలలో ఒకరు బరిలోకి దిగుతారు. ఆ తర్వాత కోహ్లి, రైనా, ధోనిలు చెలరేగితే భారీస్కోరు ఖాయం. ఇక్కడి పిచ్‌ను దృష్టిలో ఉంచుకొంటే బిన్నీ తుది జట్టులో ఖాయంగా ఉండే అవకాశం ఉంది. బౌలింగ్ విభాగంలో ఇద్దరు స్పిన్నర్లతో ఆడే అవకాశం ఉంది. అశ్విన్‌తో పాటు హర్భజన్, మిశ్రాలలో ఒకరికే చోటు దక్కుతుంది. పేస్ విభాగంలో మాత్రం అనుభవలేమి కనిపిస్తోంది. గతంలో ప్రధాన పేసర్‌గా జట్టుకు అనేక విజయాలు అందించిన భువనేశ్వర్ కుమార్ గత ఆరు నెలలుగా మ్యాచ్ ఆడలేదు. ఇక ఐపీఎల్ అనుభవంతో మోహిత్ శర్మ ఆకట్టుకోవచ్చు. కేవలం టి20లకే ఎంపికైన శ్రీనాథ్ అరవింద్‌కు చోటు దక్కుతుందా లేదా చూడాలి. జట్టులో అందరికీ ఐపీఎల్ అనుభవం ఉండటం కీలకం కానుంది.

కోలుకుంటారా...
మరో వైపు వార్మప్ మ్యాచ్‌కు విలువ లేకపోయినా, భారీ స్కోరు చేసి కూడా ఓడటం దక్షిణాఫ్రికాను కాస్త ఇబ్బంది పెట్టింది. అయితే స్వింగ్‌కు అనుకూలించే ధర్మశాల పిచ్‌పై తొలి మ్యాచ్ ఆడటం తమకు శుభారంభం ఇస్తుందని ఆ జట్టు నమ్ముతోంది. బ్యాటింగ్‌లో డివిలియర్స్, డు ప్లెసిస్, మిల్లర్, డుమినిలాంటి హిట్టర్లు టీమ్‌లో ఉండగా డి కాక్ కూడా చక్కటి షాట్లు ఆడగలడు. భారత్‌లాగే ఐపీఎల్‌ను ఎక్కువగా ఉపయోగించుకున్న ఆటగాళ్లు ఉండటం ఆ జట్టుకు అనుకూలాంశం. సుదీర్ఘ పర్యటన కావడంతో టి20ల్లో తమ అగ్రశ్రేణి బౌలర్లకు సఫారీలు విశ్రాంతినిచ్చారు. ఫలితంగా కైల్ అబాట్, క్రిస్ మోరిస్ జట్టు బాధ్యతలు మోస్తున్నారు. ఎడీ లీ, రబడ, జోండోలకు అనుభవం లేదు. వీరంతా ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారీగా పరుగులిచ్చారు. టి20ల్లో మంచి రికార్డు ఉన్న ప్రధాన స్పిన్నర్ తాహిర్‌ను ఎదుర్కోవడం అంత సులువు కాదు. ఆసీస్ దిగ్గజం మైక్ హస్సీ దక్షిణాఫ్రికా సలహాదారుడిగా పని చేస్తుండటం ఆ జట్టుకు అదనపు బలం.

జట్ల వివరాలు (అంచనా): భారత్: ధోని (కెప్టెన్), ధావన్, రోహిత్, రహానే, కోహ్లి, రైనా, బిన్నీ, అశ్విన్, భువనేశ్వర్, మోహిత్, హర్భజన్/అక్షర్

దక్షిణాఫ్రికా: డు ప్లెసిస్ (కెప్టెన్), డి కాక్,  డివిలియర్స్, డుమిని, మిల్లర్, బెహర్దీన్, మోరిస్, డి లాంజ్, అబాట్, రబడ, తాహిర్.

దూకుడు అంటే మాటల దాడినో, భౌతికంగా ఢీకొట్టడమో కాదు. నిబంధనలకు లోబడే హద్దులు దాటకుండా దూకుడు ఉంటే తప్పు లేదు. కానీ క్రమశిక్షణ చర్యతో మ్యాచ్‌కు దూరమయ్యేంత కాదు. మేం అనుకున్న సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఇంకా దొరకలేదని చెప్పగలను. కాబట్టి అందుబాటులో ఉన్న ఆటగాళ్లనుంచే అత్యుత్తమమైనవారిని ఎంచుకోవాలి. ఈ సిరీస్‌లో వచ్చే ప్రపంచకప్‌పై ఎలాంటి ప్రభావం ఉండదు. దానికి చాలా సమయముంది. మన ఆటగాళ్లను వంతులవారీగా పరీక్షించుకునేందుకు, ఫామ్‌లోకి వచ్చేందుకు ఈ మ్యాచ్‌లు ఉపయోగపడతాయి.    -ధోని

పేసర్లు మా బలమే అయినా ఇక్కడ మేం తాహిర్‌పై చాలా ఆధార పడుతున్నాం. అతను ఈ మ్యాచ్‌లో కీలకం అవుతాడు. ప్రాక్టీస్ మ్యాచ్ ఫలితాన్ని పట్టించుకోవడం లేదు. ఇక్కడి పరిస్థితులపై అవగాహన ఉంది. సుదీర్ఘ పర్యటన మా ఆటగాళ్లందరికీ సవాల్‌లాంటిది. ఐపీఎల్ జట్టులోని స్నేహాలు ఇక్కడి పోటీతత్వానికి అడ్డు రావు. కాకపోతే బలాలు, బలహీనతలపై అవగాహన ఉంది కాబట్టి విజయం కోసం కొత్తగా ఆలోచించాల్సి ఉంటుంది.    - డు ప్లెసిస్, దక్షిణాఫ్రికా కెప్టెన్

పిచ్, వాతావరణం
వేగవంతమైన వికెట్, అవుట్ ఫీల్డ్ ఉన్నాయి. ఆరంభంలో బంతి స్వింగ్ అయినా... చక్కటి బౌన్స్‌తో బ్యాటింగ్‌కు కూడా అనుకూలిస్తుందని క్యురేటర్ చెప్పారు. మంచు కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో బౌలర్లకు కాస్త ఇబ్బంది కలగవచ్చు. కాబట్టి టాస్ కీలకం కానుంది.  శుక్రవారం వర్ష సూచన లేదు.

సా. గం. 7.00నుంచి
స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం


 టి20ల్లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య 8 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ 6 గెలిచి, 2 ఓడింది. భారత గడ్డపై
ఇరు జట్ల మధ్య ఇదే తొలి టి20 మ్యాచ్ కావడం విశేషం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement