
న్యూఢిల్లీ: ఇంగ్లిష్ కౌంటీల్లో ఆడేందుకు అనుమతించాలంటూ కేరళ క్రికెటర్ శ్రీశాంత్ దాఖలు చేసిన అభ్యర్థనను మంగళవారం సుప్రీం కోర్టు విచారణకు తిరస్కరించింది. అయితే, అతనితో సహా స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతరుల సంగతిని జూలైలోగా తేల్చాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆదేశించింది. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఖాన్విల్కర్ నేతృత్వంలోని బెంచ్... క్రికెట్ ఆడాలన్న శ్రీశాంత్ తపనను అర్థం చేసుకుంటున్నామని, ఢిల్లీ పోలీసులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు వచ్చే దాకా వేచి చూడాలని పేర్కొంది.
2013లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినందుకు శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ చవాన్‌లను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. మరో 33 మందిపై అభియోగాలు మోపారు. కానీ, వీటిని పాటియాలా హౌస్ కోర్టు 2015లో కొట్టివేసింది. దీంతో ఢిల్లీ పోలీసులు హైకోర్టుకు వెళ్లారు.