
కాంపౌండ్ టీమ్ ఆర్చరీలో భారత పురుషుల జట్టు తమ స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకోలేకపోయింది. మరోవైపు భారత మహిళల జట్టు కూడా ‘పసిడి’ పోరులో ఒత్తిడికిలోనై రజత పతకంతోనే సరిపెట్టుకుంది. 2014 ఏషియాడ్ ఫైనల్లో దక్షిణ కొరియాను ఓడించి స్వర్ణం నెగ్గిన భారత జట్టు ఈసారి కొరియా చేతిలోనే ఓడిపోయి రజతంతో సంతృప్తి పడింది. అభిషేక్ వర్మ, అమన్ సైని, రజత్ చౌహాన్‌లతో కూడిన భారత పురుషుల జట్టుకు ఫైనల్లో అదృష్టం కలిసి రాలేదు. నిర్ణీత 24 షాట్‌ల తర్వాత భారత్, కొరియా 229–229 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించేందుకు రెండు జట్లకు మూడేసి షాట్‌లతో కూడిన ‘షూట్ ఆఫ్’ను నిర్వహించారు. ఇందులోనూ రెండు జట్లు 29 పాయింట్ల చొప్పున సాధించాయి. అయితే కొరియా ఆర్చర్లు కొట్టిన రెండు షాట్‌లు 10 పాయింట్ల వృత్తానికి అతి సమీపంలో ఉండటంతో వారికి స్వర్ణం ఖాయమైంది. భారత్ ఖాతాలో రజతం చేరింది.
ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, ముస్కాన్, మధుమితలతో కూడిన భారత మహిళల జట్టు ఫైనల్లో 228–231తో దక్షిణ కొరియా జట్టు చేతిలో ఓడిపోయింది. 18 షాట్‌ల తర్వాత రెండు జట్లు 173–173తో సమంగా ఉన్నాయి. అయితే చివరి ఆరు షాట్‌ల సిరీస్‌లో భారత్ 55 పాయింట్లు సాధించగా... కొరియా 58 పాయింట్లు స్కోరు చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. జ్యోతి సురేఖకు ఇది రెండో ఆసియా క్రీడల పతకం. 2014 ఏషియాడ్‌లో సురేఖ సభ్యురాలిగా ఉన్న భారత మహిళల కాంపౌండ్ జట్టు కాంస్యం గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment