ద్యుతీ... రజత ఖ్యాతి | Dutee Chand Wins Silver Medal | Sakshi
Sakshi News home page

ద్యుతీ... రజత ఖ్యాతి

Published Mon, Aug 27 2018 4:45 AM | Last Updated on Mon, Aug 27 2018 9:41 AM

Dutee Chand Wins Silver Medal - Sakshi

ద్యుతీ చంద్‌

అంచనాలు నిలబెట్టుకుంటూ పతకంతో మెరిసిన టీనేజర్‌ ఒకరు... ఆటకే పనికిరావంటూ ఒకనాడు ఎదురైన చేదు జ్ఞాపకాలను ట్రాక్‌ కింద సమాధి చేస్తూ విజయంతో మరొకరు... సొంతూళ్లో ప్రకృతి వైపరీత్యానికి అల్లాడుతున్న సన్నిహితులకు గెలుపుతో ఊరటనందించే ప్రయత్నం చేసిన వారొకరు... ఆసియా క్రీడల్లో ముగ్గురు భిన్న నేపథ్యాల అథ్లెట్లు అందించిన రజత పతకాలతో ఆదివారం భారత్‌ మురిస్తే... ‘గీత’ దాటినందుకు మరో అథ్లెట్‌ చేతికి వచ్చిన కాంస్యం దూరమై విజయం కాస్తా విషాదంగా మారిపోవడం మరో కీలక పరిణామం. ఈక్వెస్ట్రియన్‌లో వచ్చిన రెండు వెండి పతకాలు, ‘బ్రిడ్జ్‌’ అందించిన రెండు కాంస్యాలు కలిపి ఈవెంట్‌ ఎనిమిదో రోజు మొత్తం ఏడు పతకాలు మన ఖాతాలో చేరాయి.   

జకార్తా: అథ్లెటిక్స్‌లో ప్రతిష్టాత్మక ఈవెంట్‌ 100 మీటర్ల పరుగు (మహిళల)లో భారత క్రీడాకారిణి ద్యుతీ చంద్‌ రజత పతకంతో సత్తా చాటింది. 11.32 సెకన్లలో ఆమె లక్ష్యాన్ని చేరి రెండో స్థానంలో నిలిచింది. ఒడియాంగ్‌ ఎడిడియాంగ్‌ (బహ్రెయిన్‌) 11.30 సెకన్లలో పరుగు పూర్తి చేసి స్వర్ణం గెలుచుకోగా... వీ యోంగ్లీ (చైనా–11.33 సెకన్లు) కాంస్యం సాధించింది. ఎనిమిది మంది హోరాహోరీగా తలపడ్డ ఈ రేస్‌లో ఫలితాన్ని ‘ఫొటో ఫినిష్‌’ ద్వారా తేల్చారు. తాను పాల్గొంటున్న తొలి ఆసియా క్రీడల్లోనే ద్యుతీ రజతం సాధించడం విశేషం. మహిళల 100 మీటర్ల ఈవెంట్‌లో భారత అథ్లెట్‌ ఒకరు ఆఖరిసారిగా 1998 ఆసియా క్రీడల్లో పతకం సాధించారు. నాడు రచిత మిస్త్రీకి కాంస్యం దక్కింది. 1951లో రోషన్‌ మిస్త్రీ... 1982, 1986 ఆసియా క్రీడల్లో పీటీ ఉష రజత పతకాలు సాధించాక ... మళ్లీ ఇప్పుడు భారత అథ్లెట్‌కు 100 మీటర్ల విభాగంలో రజతం దక్కింది.   

హిమ దాస్‌ మళ్లీ రికార్డు...
వరుసగా రెండో రోజు జాతీయ రికార్డును బద్దలు కొడుతూ 18 ఏళ్ల హిమ దాస్‌ 400 మీటర్ల పరుగులో రజతం గెలుచుకుంది. హిమ 50.79 సెకన్లలో పరుగు పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. సల్వా నాసర్‌ (బహ్రెయిన్‌–50.09 సెకన్లు) స్వర్ణం గెలుచుకోగా, మిఖినా ఎలీనా (కజకిస్తాన్‌–52.63 సె.)కి కాంస్యం దక్కింది. శనివారమే ఆమె క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో 51.00 సెకన్ల టైమింగ్‌ నమోదు చేసి కొత్త జాతీయ రికార్డు నెలకొల్పగా, ఇప్పుడు తానే దానిని బద్దలు కొట్టింది. ఇదే ఈవెంట్‌లో మరో భారత అథ్లెట్‌ నిర్మలా (52.96 సెకన్లు) నాలుగో స్థానంలో నిలిచి నిరాశగా వెనుదిరిగింది.

2006 దోహా క్రీడల్లో మన్‌జీత్‌ కౌర్‌ రజతం గెలిచిన తర్వాత 400 మీటర్ల పరుగులో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం. పురుషుల 400 మీటర్ల పరుగులో భారత అథ్లెట్‌ మొహమ్మద్‌ అనస్‌ యహియా రజతం సాధించాడు. 45.69 సెకన్ల టైమింగ్‌ నెలకొల్పి అనస్‌ రెండో స్థానంలో నిలిచాడు. ఈ పోరులో హసన్‌ (ఖతర్‌–44.89 సెకన్లు) అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం గెలుచుకోగా, అలీ (బహ్రెయిన్‌–45.70 సె.)కు కాంస్యం లభించింది. ‘నేను మరింత వేగంగా పరుగెత్తాల్సింది. అయితే ప్రస్తుతానికి రజతంతో సంతృప్తిగా ఉన్నా. కచ్చితంగా పతకం సాధించాలనే లక్ష్యంతో ఇక్కడ బరిలోకి దిగాను. అనుకున్నది దక్కింది. నా కేరళలో అష్టకష్టాలు పడుతున్న ప్రజలకు నా విజయం అంకితం’ అని అనస్‌ వ్యాఖ్యానించాడు.

కొత్తగా రెక్కలు తొడిగి...
సాక్షి క్రీడా విభాగం
సరిగ్గా నాలుగేళ్ల క్రితం ద్యుతీ చంద్‌ గ్లాస్గో కామన్వెల్త్‌ క్రీడలకు సన్నద్ధమవుతోంది. అప్పటికే ఈ ఈవెంట్‌కు అర్హత సాధించిన ఆమె ఎలాగైనా పతకం గెలవాలని పట్టుదలగా శ్రమిస్తోంది. అయితే అనూహ్యంగా అథ్లెటిక్స్‌ సమాఖ్య చేసిన ప్రకటనతో ఆమె ట్రాక్‌పై కుప్పకూలిపోయింది. ద్యుతీచంద్‌లో అధిక మోతాదులో పురుష హార్మోన్లు (టెస్టోస్టిరాన్‌) ఉన్నాయి కాబట్టి ఆమెకు మహిళల విభాగంలో పాల్గొనే అర్హత లేదంటూ కామన్వెల్త్‌ క్రీడల నుంచి తప్పించారు. ఎలాంటి డ్రగ్స్‌ ఆరోపణలు లేకున్నా... ఈ తరహాలో వేటు పడటం 18 ఏళ్ల అమ్మాయిని ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది.

అన్ని వైపుల నుంచి విమర్శలతో పాటు ఒక రకమైన వ్యంగ్య వ్యాఖ్యలతో ఆమె మనసు వికలమైంది. ట్రాక్‌పై ప్రాక్టీస్‌కంటే కూడా ముందు తాను ఆడపిల్లనేనని రుజువు చేసుకోవాల్సిన అగత్యం ద్యుతీకి ఎదురైంది. అయితే ఆమె వెనక్కి తగ్గకుండా పోరాడాలని నిర్ణయించుకుంది. తాను ఎంచుకున్న ఆటలో లక్ష్యం చేరాలంటే అన్ని అడ్డంకులు అధిగమించేందుకు సిద్ధమైంది. చివరకు కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ ద్యుతీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ‘హైపర్‌ఆండ్రోజెనిజమ్‌’ను రుజువు చేయడంలో అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఐఏఏఎఫ్‌) విఫలమైందని, సరైన ఆధారాలు కూడా లేవంటూ ద్యుతీ మళ్లీ బరిలోకి దిగేందుకు అనుమతి ఇచ్చింది. దాంతో ద్యుతీ మళ్లీ కొత్తగా ట్రాక్‌పైకి అడుగు పెట్టి తన పరుగుకు పదును పెట్టింది.  

హైదరాబాద్‌లోనే...
పేరుకు ఒడిషాకు చెందిన అమ్మాయే అయినా ద్యుతీ ప్రాక్టీస్‌ మొత్తం హైదరాబాద్‌లోనే సాగింది. గచ్చిబౌలి అథ్లెటిక్స్‌ స్టేడియంలో ట్రాక్‌లో ఆమె సాధన చేసింది. ద్యుతీని తీర్చి దిద్దడంలో తెలంగాణకు చెందిన భారత కోచ్‌ నాగపురి రమేశ్‌దే ప్రధాన పాత్ర. ఎన్ని సమస్యలు వచ్చినా, కొన్ని సార్లు ప్రతికూల ఫలితాలు వచ్చినా పట్టువదలకుండా ఆయన ద్యుతీకి లక్ష్యాలు విధించి ప్రాక్టీస్‌ చేయించారు. ఒక మెగా ఈవెంట్‌లో ఆమె వల్ల పతకం సాధించడం సాధ్యమవుతుందా అనే సందేహాలు అనేక సార్లు వచ్చినా... రమేశ్‌ మాత్రం ఆశలు కోల్పోలేదు.

చివరకు ఇప్పుడు ఆసియా క్రీడల్లో రజతంతో వీరిద్దరి శ్రమకు గుర్తింపు లభించింది. జిమ్, ఫిట్‌నెస్‌ ట్రైనింగ్, డైట్‌కు సంబంధించిన అన్ని అదనపు సౌకర్యాలు తన అకాడమీలోనే కల్పించి ద్యుతీని ప్రోత్సహిస్తూ భారత బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ కూడా అండగా నిలవడం విశేషం.  ‘ద్యుతీచంద్‌ రజతం నెగ్గడంతో చాలా సంతోషంగా ఉన్నాను. ఎన్నో ప్రతికూలతలను అధిగమించి ఆమె ఈ స్థాయికి చేరుకుంది’ అని గోపీచంద్‌ వ్యాఖ్యానించారు.

లక్ష్మణన్‌ విషాదం...
మరో భారత అథ్లెట్‌ గోవిందన్‌ లక్ష్మణన్‌ను దురదృష్టం వెంటాడింది. 10 వేల మీటర్ల పరుగును 29 నిమిషాల 44.91 సెకన్లలో పూర్తి చేసిన లక్ష్మణన్‌కు ముందుగా కాంస్య పతకం ఖరారైంది. అయితే అంతలోనే అతడిని డిస్‌క్వాలిఫైగా తేల్చడంతో ఆనందం ఆవిరైంది. పరుగులో ప్రత్యర్థిని దాటే ప్రయత్నంలో అతను ట్రాక్‌ వదిలి ఎడమ వైపు బయటకు వెళ్లినట్లు తేలింది. జ్యూరీ నిర్ణయాన్ని భారత జట్టు సవాల్‌ చేసింది. అతను గీత దాటినా సహచర ఆటగాడిని ఇబ్బంది పెట్టలేదని, దాని వల్ల అదనపు ప్రయోజనం ఏమీ పొందలేదని కూడా వాదించింది. అయితే ఈ అప్పీల్‌ను జ్యూరీ తిరస్కరించడంతో లక్ష్మణన్‌కు నిరాశ తప్పలేదు.

మరోవైపు పురుషుల లాంగ్‌జంప్‌ ఫైనల్లో శ్రీశంకర్‌ 7.95 మీటర్ల దూరం గెంతి ఆరో స్థానంలో నిలిచాడు. పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో ధరున్‌ అయ్యసామి, సంతోష్‌ కుమార్‌... మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో జౌనా ముర్ము, అను రాఘవన్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించారు.   అథ్లెటిక్స్‌కు సంబంధించి ఆసియా క్రీడలు ఎంతో కఠినమైనవి. ఇక్కడ ఎన్నో ఏళ్ల తర్వాత పతకం దక్కడం సంతోషంగా ఉంది. ఆమె ఆరంభంపై ఎంతో శ్రమించాం. దక్షిణాఫ్రికా నుంచి ప్రత్యేకంగా స్పీడ్‌ రబ్బర్లను తెప్పించి సాధన చేయించాం. గోపీచంద్‌తో పాటు ఎన్నో రకాలుగా సహకరించిన అందరికీ కృతజ్ఞతలు.


–నాగపురి రమేశ్, ద్యుతీ కోచ్‌  

2014లో నా గురించి జనం నానా రకాల మాటలు అన్నారు. ఇప్పుడు దేశం తరఫున పతకం సాధించడం గొప్ప ఘనతగా భావిస్తున్నా. రేసులో మొదటి 40 మీటర్లు చాలా వేగంగా పరుగెత్తాలని కోచ్‌ ముందే చెప్పారు. నేను కళ్లు మూసుకొనే పరుగెత్తాను. కళ్లు తెరిచే సరికి రేసు పూర్తయింది. గెలిచానో కూడా తెలీదు. డిస్‌ప్లే బోర్డుపై పేరు కనిపించిన తర్వాతే జాతీయ పతాకాన్ని చేతిలోకి తీసుకున్నాను. నా కెరీర్‌లో ఇదే పెద్ద పతకం.      
–ద్యుతీచంద్‌


ద్యుతీచంద్‌


హిమ దాస్‌, అనస్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement