నచ్చారండి హిమదాస్.. తెగ నచ్చేశారు. దేశమంతా క్రికెట్ ప్రపంచకప్ పిచ్చిలో మునిగి మీ గెలుపును గుర్తించకున్నా.. మీరు మాత్రం వరుస పతకాలతో భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించారు. మూడు వారాల వ్యవధిలో ఐదు స్వర్ణాలు సాధించి ఔరా అనిపించారు. మీ విజయానికి రావాల్సినంత పేరు రాకున్నా.. దాన్ని మీ చిరునవ్వుతోనే సరిపెట్టుకున్నారు. మొబైల్‌లో టెంపుల్ రన్ గేమ్ ఆడుతూ బిజీగా ఉన్న మేము.. మీ పరుగును పట్టించుకోకున్నా.. మీరు ముందుకు సాగారు. ప్రకృతి కన్నెర్ర చేసి మీ రాష్ట్రాన్ని వరదలతో ముంచెత్తుతుంటే.. కోట్లు సంపాదించే ఆటగాళ్లు ట్వీట్లతో సరిపెడితే.. మీరు మాత్రం మీకు తోచిన సాయం చేసి పెద్ద మనుసు చాటుకున్నారు.. సరిగ్గా ఏడాది క్రితం.. ఫిన్లాండ్‌లోని టాంపెరెలో జరిగిన ఈవెంట్‌లో 400 మీటర్ల పరుగులో 51.46 సెకన్ల టైమింగ్‌తో చిరుతలా పరుగెత్తి స్వర్ణ పతకం నెగ్గారు.
ఈ గెలుపుతో ఐఏఏఎఫ్ వరల్డ్ ట్రాక్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా నిలిచి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. రాత్రికి రాత్రే స్టార్ అయ్యారు. ఈ రేసులో నెగ్గిన వెంటనే మీరు జాతీయ పతాకం కోసం అన్వేషిస్తూ భావోద్వేగానికి లోనవ్వడం మాకు ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. మీ ప్రతిభను దేశ ప్రధానే కొనియాడుతుంటే.. మీకు నజరానాలు.. కానుకల వర్షం కురుస్తందని భావించాం. ప్చ్.. అందరూ ప్రశంసలతోనే సరిపెట్టినా.. మీరు ఏ మాత్రం అసంతృప్తికి లోనవ్వలేదు. మీ పరుగును ఆపలేదు. ఆ ప్రశంసలను తలకెక్కించుకోలేదు. అంతేకాకుండా ఆసియా క్రీడల్లో స్వర్ణంతో పాటు రెండు రజతాలు సాధించారు. తమ ప్రతిభను గుర్తించడం లేదని, నజరానాలు ఇవ్వడం లేదని గగ్గోలు పెడుతున్న ఆటగాళ్లున్న ఈ రోజుల్లో.. ఇన్ని విజయాలందుకున్న మీరు స్థిత ప్రజ్ఞతతో ఉండడం.. చిరునవ్వుతో ముందుకు సాగడం అందర్నీ ఆకట్టుకుంది. ఫిన్లాండ్‌లోని టాంపెరెలో మొదలైన మీ జైత్రయాత్ర.. నిన్నటి చెక్ రిపబ్లిక్ అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్ వరకు అప్రతిహతంగా కొనసాగింది. ఇది ఇలానే టోక్యో ఒలింపిక్స్-2020 వరకు కొనసాగాలని.. భారత్‌కు స్వర్ణపతకం అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.
Comments
Please login to add a commentAdd a comment