
ఒడిశా: ఏషియన్ గేమ్స్ 2018లో రజత పతకం సాధించిన అథ్లెట్ ద్యుతీచంద్‌కు ఒడిశా ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ఈ మేరకు రూ. 1.50 కోట్లు నజరానాను ద్యుతీచంద్‌కు ఇవ్వనున్నట్లు ఒడిశా సీఎంఓ(ముఖ్యమంత్రి కార్యాలయం) ఒక ప్రకటనలో తెలిపింది. ఆసియా క్రీడల్లో పతకం సాధించడానికి ద్యుతీచంద్ అంకిత భావంతో కృషి చేసిందని, అదే సమయంలో పతక వేటలో ఆమె ఎంతగానో శ్రమించిందని సీఎంఓ పేర్కొంది. దానిలో భాగంగానే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్.. ద్యుతీచంద్‌కు కోటిన్నర నజరానా ప్రకటించినట్లు సీఎంఓ స్పష్టం చేసింది.
1998 ఏషియన్ గేమ్స్‌లో తమ రాష్ట్ర అథ్లెట్ రచితా పాండా మిస్త్రీ కాంస్య పతకం సాధించిన సుదీర్ఘ కాలం తర్వాత ద్యుతీచంద్ రజత పతకాన్ని తేవడం ఎంతో గర్వంగా ఉందని సదరు ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ఒడిశా ఒలింపిక్ అసోసియేషన్(ఓఓఏ) రూ.50 వేల నజరానాను ద్యుతీకి ప్రకటించింది. ఆదివారం జరిగిన 100 మీటర్ల ఫైనల్ పోరులో ద్యుతిచంద్ రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే.