తొలిరోజే తడాఖా | As it happened: India vs South Africa, 2nd Test, Day 1 | Sakshi
Sakshi News home page

తొలిరోజే తడాఖా

Published Sun, Nov 15 2015 4:24 AM | Last Updated on Sun, Sep 3 2017 12:29 PM

తొలిరోజే తడాఖా

తొలిరోజే తడాఖా

వేదిక మారినా... వ్యూహం మారినా... అస్త్రం మాత్రం మారలేదు. బౌన్సీ వికెట్‌పై బంతిని గింగిరాలు తిప్పుతూ భారత స్పిన్నర్లు మరోసారి మ్యాజిక్ చేశారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని అద్భుతంగా ఒడిసిపడుతూ తొలి రోజే తడాఖా చూపెట్టారు. వందో టెస్టు ఆడుతున్న డివిలియర్స్ మినహా... ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ అంతా స్పిన్ దెబ్బకు దాసోహమనడంతో రెండో టెస్టులో టీమిండియా తొలిరోజే పట్టు బిగించినట్లు కనిపిస్తోంది.
 
* రెండో టెస్టులో స్పిన్నర్ల మ్యాజిక్
* తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 214 ఆలౌట్
* అశ్విన్, జడేజాలకు చెరో 4 వికెట్లు
* భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 80/0
బెంగళూరు: తొలి టెస్టు గెలుపుతో ఉత్సాహం మీదున్న భారత జట్టు.. రెండో టెస్టులోనూ జోరు చూపెట్టింది. శనివారం దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో పక్కా ప్రణాళికతో సమష్టిగా చెలరేగింది. ఆరంభంలో అశ్విన్ (4/70), జడేజా (4/50) స్పిన్ మ్యాజిక్ చేస్తే... ధావన్ (45 బ్యాటింగ్; 7 ఫోర్లు) బ్యాట్‌తో ఆకట్టుకున్నాడు.

ఫలితంగా తొలి రోజే మ్యాచ్‌ను టీమిండియా ఆధీనంలో తెచ్చుకుంది. చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న  ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 59 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటైంది. డివిలియర్స్ (85; 11 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడాడు. ఎల్గర్ (38; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. తర్వాత ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 22 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. ధావన్, విజయ్ (28 బ్యాటింగ్; 5 ఫోర్లు)లు క్రీజులో ఉన్నారు.  
 
అశ్విన్ చమక్కులు: ఆరంభంలో పిచ్ నుంచి సహకారం లభించడంతో అశ్విన్, జడేజాలు బంతిని బాగా టర్న్ చేశారు. దీంతో ప్రొటీస్ బ్యాట్స్‌మెన్ షాట్ల ఎంపికలో పొరపాట్లు చేశారు. ఒక్క డివిలియర్స్ మాత్రమే బంతి గమనానికి తగ్గట్టుగా ఆడాడు. 8వ ఓవర్‌లోనే బౌలింగ్‌కు దిగిన అశ్విన్ నాలుగు బంతుల తేడాలో ఓపెనర్ వాన్ జెల్ (10)తో పాటు, డు ప్లెసిస్ (0)లను అవుట్ చేసి సఫారీలకు షాకిచ్చాడు. తర్వాత ఎల్గర్‌తో కలిసి ఆమ్లా (7) కుదురుకునే ప్రయత్నం చేసినా ఆరోన్ పేస్ వేగం ముందు నిలువలేకపోయాడు. 15వ ఓవర్‌లో ఓ చక్కని ఇన్‌స్వింగర్‌తో ఆమ్లా వికెట్ ఆరోన్ ఎగరగొట్టాడు. తర్వాత స్టాండింగ్ ఒవేషన్‌తో క్రీజులోకి అడుగుపెట్టిన డివిలియర్స్ సహచరుడు ఎల్గర్‌తో కలిసి ఆచితూచి ఆడాడు. దాంతో ప్రొటీస్ లంచ్ వరకు మరో వికెట్ కోల్పోలేదు.
 
ఏబీ నిలకడ: సెషన్ రెండో బంతికే జడేజా మ్యాజిక్ చేస్తూ ఎల్గర్‌ను అవుట్ చేశాడు. దీంతో నాలుగో వికెట్‌కు 33 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత డుమిని (15)తో కలిసి డివిలియర్స్ వరుస బౌండరీలతో వేగం పెంచాడు.  ఈ క్రమంలో 59 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. జడేజా బంతిని బాగా ఫ్లయిట్ చేసినా.. ఏబీ మాత్రం చక్కటి ఫుట్‌వర్క్‌తో కవర్ డ్రైవ్స్ కొట్టాడు. రెండోఎండ్‌లో అశ్విన్ బంతులను ఎదుర్కొనేందుకు ఇబ్బందిపడ్డ డుమిని ఐదో వికెట్‌కు 42 పరుగులు సమకూరాక అవుటయ్యాడు.

దీంతో ప్రొటీస్ స్కోరు 120/5గా మారింది. ఈ దశలో విలాస్ (15) భారీ షాట్స్ కొట్టే ప్రయత్నంలో బంతిని తప్పుగా అంచనా వేసి జడేజాకు రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు. కొద్దిసేపటికే డివిలియర్స్ కూడా వెనుదిరగడంతో టీ విరామానికి 177 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది.  
 ధావన్ ధమాకా: టీ సెషన్ రెండో బంతికే జడేజా.. రబడ (0)ను అవుట్ చేసినా, మోర్కెల్ (22; 3 ఫోర్లు), అబాట్ (14) కాసేపు టీమిండియా బౌలర్లను పరీక్షించారు.

ఈ ఇద్దరు తొమ్మిదో వికెట్‌కు 37 పరుగులు జోడించడంతో సఫారీల స్కోరు 200లు దాటింది. తర్వాత బౌలర్లను మార్చిమార్చి ప్రయోగించడంతో కాస్త తడబాటుకు గురైన ఈ జోడి వరుస బంతుల్లో అవుట్‌కావడంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత ఓపెనర్లు ధావన్, విజ య్‌లు తడబాటు లేకుండా ఆడారు. మోర్కెల్ బౌ లింగ్‌లో ఫోర్‌తో టచ్‌లోకి వచ్చిన శిఖర్ బౌండరీల జోరు చూపెట్టాడు. ఈ ఇద్దరి సమన్వయంతో భారత్ 77 బంతుల్లోనే తొలి 50 పరుగులు సాధించింది. 16వ ఓవర్‌లో విజయ్ ఇచ్చిన క్యాచ్‌ను తాహిర్ వదిలిపెట్టాడు. ఓవరాల్‌గా తొలి రోజే టీమిండియా... సఫారీలపై పైచేయి సాధించింది.
 
స్కోరు వివరాలు:-
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: జెల్ ఎల్బీడబ్ల్యు (బి) అశ్విన్ 10; ఎల్గర్ (బి) జడేజా 38; డు ప్లెసిస్ (సి) పుజారా (బి) అశ్విన్ 0; ఆమ్లా (బి) ఆరోన్ 7; డివిలియర్స్ (సి) సాహా (బి) జడేజా 85; డుమిని (సి) రహానే (బి) అశ్విన్ 15; విలాస్ (సి అండ్ బి) జడేజా 15; అబాట్ రనౌట్ 14; రబడ (సి) పుజారా (బి) జడేజా 0; మోర్కెల్ (సి) బిన్నీ (బి) అశ్విన్ 22; తాహిర్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం: (59 ఓవర్లలో ఆలౌట్) 214.
 వికెట్ల పతనం: 1-15; 2-15; 3-45; 4-78; 5-120; 6-159; 7-177; 8-177; 9-214; 10-214.; బౌలింగ్: ఇషాంత్ 13-3-40-0; బిన్నీ 3- 2-1-0; అశ్విన్ 18-2-70-4; ఆరోన్ 9-0-51-1; జడేజా 16-2-50-4.
 
భారత్ తొలి ఇన్నింగ్స్: విజయ్ బ్యాటింగ్ 28; ధావన్ బ్యాటింగ్ 45; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం: (22 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా) 80 ; బౌలింగ్: మోర్కెల్ 7-1-23-0; అబాట్ 6-1-18-0; రబడ 5-1-17-0; డుమిని 2-0-9-0; తాహిర్ 2-0-9-0.
 
* చిన్నస్వామి స్టేడియంలో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకోవడం 1974 తర్వాత ఇదే తొలిసారి. అప్పటి నుంచి జరిగిన 19 టెస్టుల్లో టాస్ గెలిచిన కెప్టెన్లంతా బ్యాటింగ్ ఎంచుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement