బౌలింగ్ లో తిరుగులేని మొనగాడు!
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-9లో సన్ రైజర్స్ తరఫున ఆడుతున్న భారత వెటరన్ పేసర్ అశిష్ నెహ్రా తొలి నాలుగు మ్యాచుల్లో తీసింది రెండు వికెట్లు. దీంతో నెహ్రా బౌలింగ్ పదును తగ్గిందని భావించిన వారికి ఎప్పిటిలాగే బంతితోనే సమాధానం చెప్పాడు. ఆ తర్వాత ఆడిన రెండు కీలక మ్యాచుల్లో సరైన సమయంలో రాణించి మొత్తం ఆరు వికెట్లు పడగొట్టాడు. ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో హైదరాబాద్ బౌలర్ నెహ్రా తనదైన బంతులతో వైవిధ్యాన్ని చూపెట్టాడు. దీంతో ముంబై ఈ సీజన్లోలోనే దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్న జట్టుగా చెత్త రికార్డును నమోదు చేసుకుంది. విశాఖలోని వైఎస్ రాజశేఖరరెడ్డి స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్ అయితే దాదాపుగా పుణే గెలిచిందని ఆఖరికి సన్ రైజర్స్ కూడా భావించి ఆశలు వదిలేసుకుంది.
ఎప్పటిలాగే నమ్మకస్తుడైన నెహ్రాకు కెప్టెన్ డేవిడ్ వార్నర్ బంతిని అందిస్తే అతడి నమ్మకాన్ని నిలబెట్టి తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. చివరి ఓవర్లో 14 పరుగులు చేస్తే పుణే విజయం సాధిస్తుంది.. మరోవైపు క్రీజులో ఉన్నది తిషారా పెరీరా, మహేంద్ర సింగ్ ధోనీ. ఈ ఇద్దరూ హార్డ్ హిట్టర్సే. కానీ, ఓ తెలివైన బంతితో పెరీరాను పెవిలియన్ కు పంపాడు నెహ్రా. ఆ వెంటనే ధోనీ సిక్స్ కొట్టి ఆశలు రేపినా.. రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. మ్యాచ చివరి బంతికి అడం జంపాను అవుట్ చేసి సన్ రైజర్స్ ను 4 పరుగుల తేడాతో గట్టెక్కించి అత్భుత విజయాన్ని అందించాడు. పుణే బౌలర్ జంపా ఐపీఎల్-9లో (6/19)తో బెస్ట్ గణాంకాలు నమోదు చేసినా హైదరాబాద్ ను పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిపిన నెహ్రానే అందరి ప్రశంసలు అందుకున్న బౌలరయ్యాడు.