
కోల్‌కతా: వచ్చే ఏడాది విదేశీగడ్డపై జరిగే పర్యటనల్లో భారత్ విజయవంతం అవ్వాలంటే ఐదారుగురు మన్నికైన పేస్‌బౌలర్లు జట్టులో ఉండాలని ఇటీవల రిటైరయిన బౌలర్ ఆశిష్ నెహ్రా అభిప్రాయ పడ్డాడు. టెస్టుల్లో ప్రస్తుతం ఇషాంత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా ఆడకపోయినా నాణ్యమైన పేసర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారని టీమ్ రిజర్వ్‌బెంచ్‌పై ప్రశంసలు కురిపించాడు. ఇతర ఫార్మాట్లలోనూ ఇది కొనసాగాలని అభిప్రాయపడ్డాడు. భారత్–శ్రీలంక తొలిటెస్టు సందర్భంగా కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న నెహ్రా ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు. వచ్చే జనవరిలో మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20లను దక్షిణాఫ్రికా గడ్డపై ఆజట్టుతో టీమిండియా ఆడనుంది. అనంతరం ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల్లో విరాట్ కోహ్లిసేన పర్యటించనుంది.
మరోవైపు తొలిటెస్టు వేదికైన ఈడెన్‌పై నెహ్రా మాట్లాడుతూ.. వికెట్ చాలా బాగుందని, వర్షం కారణంగానే మైదానంలో తేమ నెలకొందని పేర్కొన్నాడు. ఈ వికెట్‌లో స్వింగ్, బౌన్స్, సీమ్ ఉన్నాయని తెలిపాడు. వర్షం కారణంగానే బంతి అనూహ్యంగా స్పందిస్తుందని అభిప్రాయపడ్డాడు. కోహ్లి ఔటైన తీరే దీనికి నిదర్శమని, దీనిపై బ్యాట్స్‌మెన్ ఏమీ చేయలేరని పేర్కొన్నాడు. ఇది బౌలర్లకు కూడా ఇబ్బందికరమేనని తెలిపాడు. మరోవైపు ఈమ్యాచ్‌లో టాస్ నెగ్గి ఉంటే భారత్ ఫీల్డింగ్‌ను ఎంచుకుని ఉండేదని, అప్పుడు లంక జట్టు 50–60 పరుగుల మధ్య ఆలౌటై ఉండేదని వ్యాఖ్యానించాడు.
200–220 పరుగులు ఇక్కడ చాలా మంచి స్కోరని అభిప్రాయపడ్డాడు. ఈడెన్‌లో మాదిరే దక్షిణాఫ్రికాలోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొని ఉంటాయని, ఆ పర్యటనకు ముందు ఇలాంటి వికెట్‌పై ఆడడం భారత్‌కు ఉపకరిస్తుందని అభిప్రాయపడ్డాడు. సఫారీగడ్డపై ఆడనుండడంతో భారతేమీ ఒత్తిడికి గురికాబోదని, ఆజట్టులో డేల్ స్టెయిన్, కగిసో రబడలాంటి పేసర్లుంటే మన జట్టులో కోహ్లి లాంటి అత్యుత్తమ బ్యాట్స్‌మన్ ఉన్నాడని అభిప్రాయపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment