అశ్విన్ ఖాతాలో మరో రికార్డు
పుణె:ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ ద్వారా అత్యంత వేగంగా 250 వికెట్లను సాధించిన రికార్డును సొంతం చేసుకున్న భారత ప్రధాన స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్.. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. శుక్రవారం రెండో రోజు ఆటలో భాగంగా ఆసీస్ రెండో ఇన్నింగ్స్ లో తొలి రెండు వికెట్లను అశ్విన్ తీశాడు. దాంతో 2016-17 స్వదేశీ సీజన్లో అశ్విన్ ఖాతాలో 64వికెట్లు చేరాయి. తద్వారా ఒక స్వదేశీ సీజన్ లో వేగంగా అత్యధిక వికెట్లను తీసిన ఘనత సాధించాడు. దాంతో కపిల్ దేవ్ పేరిట ఉన్న రికార్డును అశ్విన్ సవరించాడు.
1979-80 హోం సీజన్లో కపిల్ దేవ్ 13 టెస్టుల్లో 63 వికెట్ల తీయగా.. 2016-17 స్వదేశీ సీజన్లో అశ్విన్ ఆ రికార్డును అధిగమించాడు. 10 టెస్టుల్లో 64 వికెట్లతో అశ్విన్ ఆ రికార్డును చెరిపేశాడు. ఈ రోజు ఆసీస్ రెండో ఇన్నింగ్స్ లో భాగంగా డేవిడ్ వార్నర్, షాన్ మార్ష్ లను పెవిలియన్ కు పంపడం ద్వారా అశ్విన్ ఈ ఘనత సాధించాడు.
గతంలో ఈ రికార్డుకు అశ్విన్ దగ్గరగా వచ్చినప్పటికీ దాన్ని అధిగమించలేకపోయాడు.2012-13 స్వదేశీ సీజన్ లో అశ్విన్ 10 టెస్టుల్లో 61 వికెట్లు మాత్రమే తీసి ఆ రికార్డును తృటిలో చేజార్చుకున్నాడు. అయితే దాదాపు మూడు సీజన్ల తరువాత ఆ రికార్డును అశ్వినే బద్దలు కొట్టడం ఇక్కడ విశేషం.