'ఆసీస్ తో వన్డే సిరీస్ ఆడలేనేమో'
లండన్: త్వరలో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ నుంచి భారత ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇంగ్లండ్ లో జరుగుతున్న కౌంటీ క్రికెట్ లో భాగంగా వార్సెష్టర్‌షైర్ తరపున ఆడుతున్న అశ్విన్.. ఆసీస్ తో సిరీస్ పై అనుమానం వ్యక్తం చేశాడు. ఆసీస్ తో సిరీస్ కు సంబంధించి తనకు పిలుపువచ్చినా, ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయన్నాడు.
'ఆసీస్ తో వన్డే సిరీస్ ఆడలేనేమో. వార్సెష్టర్ షైర్ కు నాలుగు మ్యాచ్ లు ఆడతానని హామీ ఇచ్చా. అలా చూసుకుంటే ఆసీస్ తో సిరీస్ ఆడటం కష్టమే. కౌంటీల్లో ఆడుతున్న నేను భారత జట్టు నుంచి పిలుపు వచ్చినా పూర్తిస్థాయి మ్యాచ్ లో ఆడలేకపోవచ్చు'అని అశ్విన్ పేర్కొన్నాడు. 2019 వరల్డ్ కప్ ఇంగ్లండ్ లో జరుగుతున్న క్రమంలో నా ప్రస్తుత అనుభవం ఉపయోగపడుతుందనే విశ్వాసం వ్యక్తం చేశాడు. శ్రీలంకతో వన్డే సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చిన తనకు, ఆసీస్ తో సిరీస్ కు సంబంధించి బీసీసీఐ నుంచి పిలువు వచ్చే అవకాశాలున్నాయన్నాడు. అయితే ప్రస్తుతం బీసీసీఐతో ఎటువంటి కమ్యూనికేషన్ లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు.
ఆస్ట్రేలియా జట్టు సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 13 వరకు భారత్ తో ఐదు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. ఆసీస్‌పై మంచి రికార్డు ఉన్న అశ్విన్ ఈ సిరీస్‌కి అందుబాటులో ఉండకపోతే.. అతని స్థానంలో చైనామన్ కుల్దీప్ యాదవ్‌కి చోటు దక్కే అవకాశం ఉంది.