వార్నర్ తొమ్మిదో 'సారీ'
బెంగళూరు: భారత ప్రధాన స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ బౌలింగ్ ను ఎదుర్కోవడానికి ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ నానా తంటాలు పడుతున్నాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో అశ్విన్ బౌలింగ్ లో పెవిలియన్ కు చేరిన వార్నర్.. రెండో ఇన్నింగ్స్ లో కూడా అతని బౌలింగ్ లోనే నిష్క్రమించి నిరాశపరిచాడు.
రెండో ఇన్నింగ్స్ 10 ఓవర్ లో అశ్విన్ బౌలింగ్ లో వార్నర్ ఎల్బీగా పెవిలియన్ చేరాడు. తద్వారా 13 టెస్టుల్లో తొమ్మిదిసార్లు అశ్విన్ బౌలింగ్ లో వార్నర్ అవుటయ్యాడు. దాంతో తన టెస్టు కెరీర్ లో ఒకే ఆటగాడ్ని అత్యధిక సార్లు అవుట్ చేసిన ఘనతను అశ్విన్ సాధించాడు. కాగా, అదే సమయంలో ఒకే బౌలర్ కు తన వికెట్ ను అత్యధిక సార్లు సమర్పించుకున్న అప్రథను వార్నర్ సొంతం చేసుకోవడం ఇక్కడ గమనార్హం.
భారత్ విసిరిన 188 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ 42 పరుగులకు రెండు వికెట్లను కోల్పోయింది. తొలి వికెట్ గా రెన్ షా(5) అవుట్ కాగా, రెండో వికెట్ గా వార్నర్(17) పెవిలియన్ చేరాడు.