అశ్విన్ ఎట్ 200!
కాన్పూర్: తన కెరీర్లో 37వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న టీమిండియా స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ అత్యంత వేగవంతంగా రెండొందల టెస్టు వికెట్లు సాధించిన రెండో బౌలర్ గా గుర్తింపు సాధించాడు. తాజాగా న్యూజిలాండ్ జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ ద్వారా అశ్విన్ రెండొందల టెస్టు వికెట్ల క్లబ్ లో చేరాడు. తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లతో ఆకట్టుకున్న అశ్విన్.. రెండో ఇన్నింగ్స్ లో తొలి మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా పాకిస్తాన్ దిగ్గజం వసీం అక్రమ్, ఆస్ట్రేలియా మాజీ బౌలర్ డెన్నిస్ లిల్లీల(38 టెస్టుల్లో) పేరిట సంయుక్తంగా ఉన్న రికార్డు బద్దలైంది.
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ను మూడో వికెట్ గా పెవిలియన్ కు పంపడం ద్వారా అశ్విన్ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. అంతకుముందు లాథమ్(2), గప్టిల్(0)లు అశ్విన్ బౌలింగ్ లో పెవిలియన్ కు చేరారు. దీంతో 434 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ ఎదురీదుతోంది. విలియమ్సన్ తొలి ఇన్నింగ్స్ వికెట్ కూడా అశ్విన్ ఖాతాలో చేరడం విశేషం.
అయితే అత్యంత వేగవంతంగా 200 టెస్టు వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో ఆస్ట్రేలియా మాజీ లెగ్ స్పిన్నర్ క్లారీ గ్రెమెట్ తొలి స్థానంలో ఉన్నాడు. 36 టెస్టుల్లో క్లారీ గ్రెమెట్ ఈ ఘనతను సాధించాడు.