‘గీత’ దాటితే ప్రమాదం! | Ashwin urges people to social distance with a hilarious take on IPL | Sakshi
Sakshi News home page

‘గీత’ దాటితే ప్రమాదం!

Published Thu, Mar 26 2020 5:01 AM | Last Updated on Thu, Mar 26 2020 5:04 AM

Ashwin urges people to social distance with a hilarious take on IPL - Sakshi

చెన్నై: సరిగ్గా ఏడాది క్రితం మార్చి 25, 2019న జైపూర్‌లో రాజస్తాన్‌ రాయల్స్, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ మధ్య ఐపీఎల్‌ మ్యాచ్‌ జరిగింది. పంజాబ్‌ విధించిన 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్తాన్‌ దూసుకుపోయింది. 44 బంతుల్లో 77 పరుగులు చేయాల్సిన స్థితిలో చేతిలో 9 వికెట్లున్నాయి. ఈ సమయంలో పంజాబ్‌ కెప్టెన్‌ అశ్విన్‌ రాజస్తాన్‌ బ్యాట్స్‌మన్‌ సంజు సామ్సన్‌కు బౌలింగ్‌ చేస్తున్నాడు. అయితే నాన్‌ స్ట్రయికర్‌గా ఉన్న జోస్‌ బట్లర్‌... అశ్విన్‌ ‘డెలివరీ స్ట్రయిడ్‌’ పూర్తి కాకముందే  క్రీజ్‌ దాటి పరుగు కోసం ముందుకొచ్చాడు.

ఏమరుపాటుగా ఉన్న అశ్విన్‌ వెంటనే స్టంప్స్‌ను పడగొట్టి రనౌట్‌ కోసం అప్పీల్‌ చేశాడు. బట్లర్‌ చాలా ముందుకు వెళ్లిపోవడంతో అవుట్‌ కాక తప్పలేదు. అలా ‘మన్కడింగ్‌’ ద్వారా అవుట్‌ చేసి అశ్విన్‌ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడని విమర్శలు వచ్చినా... నిబంధనల ప్రకారం సరైందేనని భారత స్పిన్నర్‌ వాదించాడు. బట్లర్‌ వెనుదిరిగాక ఛేదనలో తడబడిన రాజస్తాన్‌ చివరకు 14 పరుగులతో ఓడిపోయింది. ఇప్పుడు ఏడాది తర్వాత ఈ ఘటనను అశ్విన్‌ మళ్లీ గుర్తు చేసుకున్నాడు.

కోవిడ్‌–19 నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో ప్రకటించిన కర్ఫ్యూ, దాని కారణంగా వస్తున్న సమస్యలను అతను ‘మన్కడింగ్‌’తో పోల్చాడు. గీత దాటితే రనౌట్‌ అయినట్లు ఇప్పుడు ‘ఇల్లు దాటితే కష్టమని’ అశ్విన్‌ చెబుతున్నాడు. బయటకు రాకుండా ఉండటం కొంత కష్టమే అయినా... చివరకు విజయం కోసం ఇదంతా చేయాల్సిందేనని అతను అంటున్నాడు. ‘దేశం మొత్తం లాక్‌డౌన్‌ అవుతున్న వేళ దీనిని గుర్తు చేయడం అవసరమని నేను భావిస్తున్నా. బయట ఎక్కడా తిరగకండి. ఇంట్లోనే ఉండండి.

భద్రంగా ఉండండి’ అని నాటి రనౌట్‌ ఫొటోతో అశ్విన్‌ ట్వీట్‌ చేయడం విశేషం. మొదటి నుంచి ప్రకృతి ప్రేమికుడు అయిన అశ్విన్‌ తాజా పరిణామాల పట్ల తన అభిప్రాయాలు వెల్లడించాడు. ‘ఈ విశ్వం ఇప్పుడు మానవజాతిని సవాల్‌ చేస్తోంది. సమాజం పట్ల మనం ఎంత బాధ్యతగా ఉండగలమా అని ప్రశ్నిస్తోంది. మరో మనిషి కోసం మనం ఎంత త్యాగం చేయగలమో నిజాయితీగా చెప్పమని అడుగుతోంది. ఇవన్నీ సమాధానం చెప్పలేని కఠినమైన ప్రశ్నలు. ఇప్పుడు ఇంట్లోనే ఉంటూ వీటికి జవాబులు ఆలోచించండి’ అంటూ కూడా అతను తన ట్విట్టర్‌లో అభిప్రాయం వ్యక్తం చేశాడు.  

క్రీడలకంటే ప్రధానమైనవి ఎన్నో...
న్యూజిలాండ్‌ పర్యటన నుంచి తిరిగి వచ్చిన అనంతరం అశ్విన్‌ కొన్ని స్థానిక లీగ్‌లలో ఆడాడు. ఇప్పుడు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ నెలకొన్న నేపథ్యంలో అతను తన సమయాన్ని ఇంట్లోనే గడుపుతున్నాడు. ఈ సందర్భంగా తన రోజువారీ కార్యక్రమాల గురించి పలు ఆసక్తికర అంశాలు అతను పంచుకున్నాడు.  
     
► ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యకు త్వరలోనే వైద్యులు పరిష్కారం కనుగొంటారని ఆశిస్తున్నా.  
     
► అయితే ఇదంతా ఇప్పుడు మనకు పెద్ద పాఠం. మనలో చాలా మంది ఆటలకు అనవసర ప్రాధాన్యత ఇస్తున్నారని, జీవితంలో అంతకంటే ముఖ్యమైనవి ఎన్నో ఉన్నాయని తాజా పరిణామాలు గుర్తు చేస్తున్నాయి.  

► ఇంత సమయం ఉన్నా నేను క్రికెట్‌ గురించి అస్సలు ఆలోచించడం లేదు. టీవీలో చూడటం గానీ, యూట్యూబ్‌లో పాత క్లిప్‌లు గానీ అస్సలు చూడటం లేదు. సమీపంలో ఎలాంటి మ్యాచ్‌లు లేవు కాబట్టి నేను ప్రాక్టీస్‌ కూడా చేయడం లేదు.  

► మా అకాడమీ జెన్‌–నెక్ట్స్‌ట్‌ను రెండు వారాల క్రితమే మూసేశాం. దాంతో మా విద్యార్థులకు వాట్సాప్, టెలికాన్ఫరెన్స్‌ ద్వారా కోచింగ్‌ ఇస్తున్నా.  

► ఉదయం లేచిన దగ్గరి నుంచి నా ఇద్దరు అమ్మాయిలతో (ఐదు, నాలుగేళ్ల వయసు) ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నిస్తున్నా. నా ఇంటి చుట్టుపక్కన పక్షుల కిలకిలరావాలు విని ఎన్నేళ్లయింది. ఇప్పుడు ట్రాఫిక్‌ లేకపోవడం వల్ల కావచ్చు అంతా స్పష్టంగా వినిపిస్తుంది. ఏవో కొత్త పక్షులు చేరినట్లు కూడా అనిపించింది.  
     
► ఇక నేను, భార్య ప్రీతి సినిమాలు, సిరీస్‌లు చూస్తూనే ఉన్నాం. నాకు ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ ఇష్టమైతే...ఆమెకు ‘సెక్స్‌ అండ్‌ ద సిటీ’ అంటే ఆసక్తి. అయితే మాజీ ముఖ్యమంత్రి జయలలిత మీద రూపొందించిన సిరీస్‌ ‘క్వీన్‌’ను మాత్రం ఇద్దరం కలిసి చూస్తున్నాం.  
     
► ఇక పుస్తకాలు చదివే పాత అలవాటు కూడా మళ్లీ వచ్చింది. కల్కి రచించిన ఐదు భాగాల ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ పూర్తి చేసేందుకు నా వద్ద తగినంత సమయం ఉంది.  

► మా అమ్మానాన్నలు మాతో పాటే ఉంటారు కానీ వారిద్దరూ కూడా చాలా బిజీ. అయితే ప్రతీ రోజు అమ్మతో ఒక్క గంట పాటైనా  ‘క్యారమ్‌’ ఆడుతూ ఉన్నా. కొంత విశ్రాంతి తర్వాత అమ్మాయిలతో పజిల్స్, లెగోలాంటివి ఆడుకుంటా. ఇంతకుముందులాగా సాయంత్రం కాగానే బయటకు వెళ్లాల్సిన అనవసరం లేదు. సరైన సమయానికే నిద్రపోతుండటం కూడా ఒక మంచి మార్పు.  
     
► కరోనాలాంటి ఉత్పాతాన్ని ఇప్పుడు మనం అధిగమించలిగితే అందరికీ ఇదో పెద్ద పాఠం కావాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement