
కొలంబో: పరిస్థితులు మెరుగుపడి క్రికెట్‌కు అవకాశం ఏర్పడితే ఈ ఏడాది ఆసియా కప్ క్రికెట్ టోర్నీ శ్రీలంకలో జరగనుంది. షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీ సెప్టెంబరులో నిర్వహించాల్సి ఉంది. వాస్తవానికి ఈసారి ఆసియా కప్ నిర్వహణ హక్కులు పాకిస్తాన్‌కు ఉన్నాయి. అయితే భారత్ కూడా ఈ టోర్నీలో పాల్గొంటుంది కాబట్టి పాక్‌లో జరగడం దాదాపుగా అసాధ్యంగా మారింది. దాంతో నిర్వహణా హక్కులు ఈసారి శ్రీలంకకు ఇచ్చి 2022 ఆసియా కప్‌ను తమకు ఇవ్వాలని పాకిస్తాన్ బోర్డు (పీసీబీ) కోరింది. దీనికి శ్రీలంక బోర్డు అంగీకరించింది. పైగా ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే ప్రస్తుతం శ్రీలంకలో మాత్రం కరోనా విజృంభణ తక్కువగా ఉంది. అయినా సరే టోర్నీ నిర్వహణ అంత సులువు కాదు. తాజాగా భారత జట్టు శ్రీలంక పర్యటన రద్దు చేసుకోవడం కూడా అందుకు ఉదాహరణ. కనీసం ఆరు దేశాల జట్లు పాల్గొనే ఆసియా కప్ కోసం ఆరోగ్య సంబంధిత ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. పైగా అప్పటికి అంతర్జాతీయ ప్రయాణాల పరిస్థితిని కూడా చూడాల్సి ఉంటుంది. అయితే 2010లో చివరిసారిగా ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇచ్చిన శ్రీలంక ఏమాత్రం అవకాశం లభించినా సిద్ధమంటోంది.
Comments
Please login to add a commentAdd a comment