‘పసిడి’తోనే ముగించారు
చివరి రోజు భారత్‌కు ఐదు స్వర్ణాలు
ఆసియా ఎయిర్‌గన్ చాంపియన్‌షిప్
న్యూఢిల్లీ: సొంతగడ్డపై భారత షూటర్లు మెరిశారు. ఆసియా ఎయిర్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకాలతో తమ వేటను ముగించారు. తొలి రోజు ఆదివారం రెండు స్వర్ణాలతో బోణీ కొట్టిన భారత్... చివరి రోజు ఏకంగా ఐదు పసిడి పతకాలను సాధించింది. బుధవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ వ్యక్తిగత విభాగంలో స్టార్ క్రీడాకారిణి హీనా సిద్ధూ (197.8 పాయింట్లు) స్వర్ణం, మరో షూటర్ శ్వేతా సింగ్ రజతం (197 పాయింట్లు) గెలిచారు. హీనా సిద్ధూ, శ్వేతా సింగ్, యశస్విని సింగ్‌లతో కూడిన భారత బృందం టీమ్ విభాగంలో 1157 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది.
యూత్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో హర్షదా నితవే (174.8 పాయింట్లు) కాంస్యం సాధించగా... మలైకా గోయల్, హర్షదా, నయని భరద్వాజ్‌లతో కూడిన భారత జట్టు 1116 పాయింట్లతో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. జూనియర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. శ్రీనివేత (200.7 పాయింట్లు), గౌరి, శ్రేయా వరుసగా భారత్‌కు స్వర్ణ, రజత, కాంస్య పతకాలు అందించారు. ఈ ముగ్గురితో కూడిన భారత జట్టుకే టీమ్ ఈవెంట్‌లో పసిడి పతకం లభించింది.