మన పంచ్ అదిరింది!
►సెమీస్‌లో శివ, వికాస్, సుమీత్, అమిత్
►నాలుగు పతకాలు ఖాయం
►ప్రపంచ చాంపియన్‌షిప్‌కూ అర్హత
తాష్కెంట్ (ఉజ్బెకిస్తాన్): ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు తమ పంచ్ పవర్‌ను చాటుకున్నారు. వికాస్ కృషన్ (75 కేజీలు), శివ థాపా (60 కేజీలు), అమిత్ ఫంగల్ (49 కేజీలు), సుమీత్ సాంగ్వాన్ (91 కేజీలు) సెమీఫైనల్‌కు చేరుకున్నారు. ఈ ప్రదర్శనతో నలుగురు భారత బాక్సర్లకు కనీసం కాంస్య పతకాలు ఖాయమయ్యాయి. అంతేకాకుండా ఈ ఏడాది ఆగస్టు–సెప్టెంబరులో జర్మనీలో జరిగే ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌కు కూడా అర్హత సాధించారు. మరో నలుగురు భారత బాక్సర్లు గౌరవ్ బిధురి (56 కేజీలు), మనోజ్ కుమార్ (69 కేజీలు), కవీందర్ సింగ్ బిష్త్ (52 కేజీలు), మనీష్ పన్వర్ (81 కేజీలు) క్వార్టర్ ఫైనల్‌ను దాటలేకపోయారు. జాంగ్ (చైనా) చేతిలో గౌరవ్, లతిపోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో కవీందర్, బ్యామ్‌బా (మంగోలియా) చేతిలో మనోజ్, నుర్యదైవ్ (తుర్క్‌మెనిస్తాన్) చేతిలో మనీష్ ఓడిపోయారు.
బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో అమిత్ 5–0తో కార్నెలిస్ (ఇండోనేసియా)పై... శివ థాపా 5–0తో లాయ్ చు ఎన్ (చైనీస్ తైపీ)పై... వికాస్ 5–0తో బ్రమహేంద్ర (ఇండోనేసియా)పై... సుమీత్ 4–1తో యు ఫెంగ్‌కాయ్ (చైనా)పై గెలిచారు. శుక్రవారం జరిగే సెమీఫైనల్స్‌లో దుస్‌మతోవ్ (ఉజ్బెకిస్తాన్)తో అమిత్; బతార్‌సుక్ (మంగోలియా)తో శివ థాపా; డాంగ్‌యున్ లీ (కొరియా)తో వికాస్; జఖోన్ (తజికిస్తాన్)తో సుమీత్ తలపడతారు.