
మస్కట్ (ఒమన్): ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీలో సంయుక్త విజేతలుగా నిలిచిన భారత్, పాకిస్తాన్ జట్లకు ఆశ్చర్యకరరీతిలో బహుమతి పంపకం జరిగింది. ఫైనల్ మ్యాచ్ రద్దు అనంతరం ట్రోఫీ అందించేందుకు నిర్వాహకులు టాస్ వేశారు. టాస్ గెలిచిన భారత్‌కు ట్రోఫీని అందజేశారు. రెండేళ్లకు ఒకసారి ఈ టోర్నీ జరుగనుండగా... తొలి సంవత్సరం పాటు ట్రోఫీ మన వద్దే ఉంటుంది. రెండో సంవత్సరం పాకిస్తాన్ తీసుకువెళుతుంది. ఈసారి ట్రోఫీ మనకు దక్కడంతో ఫైనల్ విజేతలకు ఇచ్చే స్వర్ణ పతకాలు పాకిస్తాన్ ఆటగాళ్లకు అందించారు. అయితే బహుమతి ప్రదానోత్సవ సమయంలో మాత్రం ముందుగా సిద్ధం చేసుకున్న విధంగా రన్నరప్‌కు ఇచ్చే రజత పతకాలను మాత్రం భారత ఆటగాళ్ల మెడలో వేశారు!
త్వరలోనే భారత జట్టు సభ్యులకు కూడా స్వర్ణ పతకాలు పంపిస్తామని ఆసియా హాకీ ఫెడరేషన్ సీఈ దాటో తయ్యబ్ ఇక్రామ్ చెప్పారు. భారత ఆటగాడు ఆకాశ్‌దీప్ సింగ్ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డు గెలుచుకోగా, పాకిస్తాన్‌కు చెందిన మహమూద్ ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్’గా నిలిచాడు. నవంబర్ 28 నుంచి సొంతగడ్డపై జరిగే ప్రపంచ కప్‌కు ముందు భారత జట్టుకు ఇదే ఆఖరి టోర్నీ. మరోవైపు భువనేశ్వర్‌లో జరిగే ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి టాటా స్టీల్ అధికారిక భాగస్వామిగా ఉండేందుకు ముందుకు వచ్చింది. ప్రపంచంలో పదో అతి పెద్ద ఉక్కు ఉత్పత్తి సంస్థ అయిన టాటా స్టీల్‌కు గతంలోనూ హాకీతో అనుబంధం ఉంది. ప్రైవేట్ రంగంలో తొలి హాకీ అకాడమీని ఏర్పాటు చేసిన ఘనత ఈ సంస్థదే.