
న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌తో కలిసి సంయుక్త విజేతగా నిలిచిన పాకిస్తాన్ వక్రబుద్ధిని చాటుకుంది. వర్షం అనంతరం మ్యాచ్ ఆడేందుకు తాము సిద్ధంగా ఉన్నా... భారత్ విముఖత చూపిందని పాకిస్తాన్ కోచ్ హసన్ సర్దార్ బుధవారం తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. దీన్ని హాకీ ఇండియా (హెచ్‌ఐ) అదే స్థాయిలో తిప్పికొట్టింది. ‘ ‘భారీ వర్షం కురిసిన అనంతరం కూడా మా కుర్రాళ్లు ఆడేందుకు సిద్ధంగానే ఉన్నారు. అదే విషయాన్ని మేము నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లాం.
కానీ అలాంటి స్థితిలో ఆడేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించారు’ అని బుధవారం కరాచీలో హసన్ సర్దార్ వ్యాఖ్యానించాడు. దీన్ని తీవ్రంగా పరిగణించిన హెచ్‌ఐ అధికారులు హసన్ ఆరోపణలను తోసిపుచ్చారు. ‘ఇది పచ్చి అబద్ధం. తెల్లవారుజామున 3 గంటలకు పాకిస్తాన్ జట్టు కరాచీకి తిరుగు ప్రయాణం కావాల్సి ఉంది. అందుకే వాళ్లు ఆడేందుకు నిరాకరించారు. మా విమానం మరుసటి రోజు అక్కడి నుంచి బయలుదేరింది. అలాంటిది మాకు అభ్యంతరం ఏముంటుంది’ అని వివరించారు.