
ఏషియాడ్ మహిళల డిస్కస్ త్రో డిఫెండింగ్ చాంపియన్, భారత వెటరన్ క్రీడాకారిణి సీమా పూనియా... ఈసారి కాంస్యంతో వెనుదిరిగింది. గురువారం జరిగిన పోటీలో 35 ఏళ్ల సీమా డిస్క్‌ను 62.26 మీటర్లు మాత్రమే విసరగలిగింది. ఆసియా చాంపియన్, చైనా అథ్లెట్ చెన్ యాంగ్ (65.12 మీ.) స్వర్ణం నెగ్గింది. ఆ దేశానికే చెందిన ఫెంగ్ బిన్ (64.25 మీ.)కు రజతం దక్కింది. మరోవైపు 2014 ఇంచియోన్ ఏషియాడ్‌లో స్వర్ణం గెలిచిన గణాంకాలను (61.03 మీ.) సీమా సవరించినా ప్రత్యర్థులు ఇంకా మెరుగ్గా రాణించడంతో మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గత ఆరేళ్లలో ఆమెకిదే అత్యుత్తమ రికార్డు కావడం గమనార్హం. భారత మరో త్రోయర్ సందీప్ కుమారి (54.61 మీ.) ఐదో స్థానంలో నిలిచింది.
పెద్ద మనసు చాటుకుంది
ఆసియా క్రీడల రోజువారీ భత్యం కింద తనకు లభించిన 700 అమెరికన్ డాలర్ల (రూ.50 వేలు)కు మరో లక్ష రూపాయలు కలిపి కేరళ వరద బాధితుల సహాయార్థం అందజేయనున్నట్లు సీమా పూనియా ప్రకటించింది. ఇతర అథ్లెట్లు కూడా తమ భత్యాల్లో కనీసం సగమైనా అందించాలని ఆమె కోరింది. స్వయంగా కేరళ వెళ్లి సహాయ చర్యల్లో పాల్గొంటానని హరియాణాకు చెందిన సీమా తెలిపింది. అక్కడి నుంచి తిరిగి వచ్చాక తన ఎడమ పాదంలో దెబ్బతిన్న ఎముకకు శస్త్ర చికిత్స చేయించుకోనున్నట్లు పేర్కొంది. గురువారం డిస్కస్ త్రో పోటీల సందర్భంగానూ గాయం ఇబ్బంది పెట్టిందని, అయితే తన వైఫల్యానికి అది కారణం కాదని వివరించింది. ఇదే సందర్భంగా తనకు అర్జున అవార్డు రాకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రస్తుతం సీమా హరియాణా పోలీస్ శాఖలో ఎస్సైగా పనిచేస్తోంది.
ద్యుతీ, స్వప్నలకు నజరానా
ఏషియాడ్ మహిళల 100 మీ., 200 మీ. పరుగులో రజతాలు నెగ్గిన ద్యుతీ చంద్‌కు రూ.కోటిన్నర నగదు ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. హెప్టాథ్లాన్‌లో స్వర్ణం సాధించిన స్వప్నా బర్మన్‌కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రూ.10 లక్షల నజరానా ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment