‘కనక’ కాంతలు...
- 4x400 రిలేలో నాలుగోసారి భారత మహిళలకు పసిడి పతకం
- షాట్‌పుట్‌లో ఇందర్‌జిత్‌కు కాంస్యం
ఇంచియాన్: రిలే రేసుల్లో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకుంటూ భారత మహిళల జట్టు వరుసగా నాలుగోసారి ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. గురువారం జరిగిన మహిళల 4ఁ400 మీటర్ల రిలేలో ప్రియాంక, టింటూ లుకా, మన్‌దీప్ కౌర్, పూవమ్మలతో కూడిన భారత బృందం విజేతగా నిలిచింది. దీంతో 2002 బుసాన్ గేమ్స్ నుంచి వరుసగా నాలుగోసారి పసిడి పతకం భారత్ సొంతమైంది. 3ని 28.68 సెకన్లలో రేసును పూర్తి చేసిన భారత బృందం ఆసియా క్రీడల రికార్డును నెలకొల్పింది. 2010లో తమ పేరిటే ఉన్న రికార్డును (3ని 29.02 సెకన్లు) తిరగరాసింది. జపాన్ (3ని 30.80 సెకన్లు), చైనా (3ని 32.02 సెకన్లు)లు రజతం, కాంస్యం దక్కించుకున్నాయి.
తొలి అంచెలో పరుగెత్తిన ప్రియాంక..... జపాన్ అమ్మాయి కంటే కాస్త వెనుకబడింది. అయితే రెండో అంచెలో టింటూ అద్భుతమైన పరుగుతో భారత్ లోటును పూర్తి చేసింది. మూడో అంచెలో జపాన్ నుంచి సవాలు ఎదురైనా మన్‌దీప్ ఏమాత్రం తడబడకుండా ఆధిక్యాన్ని కొనసాగిస్తూ పరుగు పూర్తి చేసింది. చివరిదైన నాలుగో అంచెలో పూవమ్మ యాంకర్ పాత్రలో అద్భుతమైన ఫినిషింగ్ ఇచ్చి భారత్‌కు కనకాన్ని అందించింది.
పురుషుల షాట్‌పుట్‌లో భారత్‌కు కాంస్యం లభించింది. ఫైనల్లో ఇందర్‌జిత్ సింగ్ ఇనుప గుండును 19.63 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచాడు. ఐదో ప్రయత్నంలో భారత షాట్ పుటర్ ఈ దూరాన్ని అందుకున్నాడు.