బుల్లెటు దిగింది
ఒలింపిక్స్, కామన్వెల్త్, ఆసియా క్రీడలు... వేదిక ఏదైనా భారత్ పతకాల బోణీ చేసేది మాత్రం షూటింగ్‌లోనే. నిలకడ, కచ్చితత్వం, ఏకాగ్రత.. ఈ మూడింటినీ అద్భుతంగా సమన్వయం చేసుకుంటున్న ‘బుల్లెట్’ వీరులు ఇంచియాన్ ఏషియాడ్‌లో కూడా దుమ్మురేపారు. దీంతో తొలి రోజు భారత్‌కు ఓ స్వర్ణం, కాంస్యం లభించాయి.పిస్టల్ ఈవెంట్‌లో భారత్‌కు రెండు పతకాలు...
- జీతూ రాయ్‌కి స్వర్ణం
- కాంస్యంతో మెరిసిన శ్వేత
ఇంచియాన్: ఒకే ఒక్క షాట్... ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణాన్ని అందించింది. అప్పటి వరకు రెండో స్థానం తప్పదనుకున్నా... చివరి షాట్‌కు సంధించిన బుల్లెట్.... ప్రత్యర్థి ఆధిక్యాన్ని వెనక్కి నెడుతూ ముందుకు దూసుకెళ్లింది. ఫలితంగా చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో భారత మేటి షూటర్ జీతూ రాయ్ (186.2 పాయింట్లు) పసిడి కాంతులు పూయించాడు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో శ్వేతా చౌదురి 176.4 పాయింట్లతో కాంస్యంతో తళుక్కుమంది. ఓవరాల్‌గా శనివారం ప్రారంభమైన ఏషియాడ్‌లో భారత షూటర్ల బుల్లెట్ పదును పెరిగింది.
సూపర్ షాట్
క్వాలిఫయింగ్‌లో 559 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచిన జీతూ రాయ్ ఫైనల్లో మరింత నిలకడను చూపెట్టాడు. ప్రత్యర్థుల నుంచి పోటీ తీవ్రంగా ఉన్నా తన ఏకాగ్రతను మాత్రం సడలనీయలేదు. ఒక్కో రౌండ్‌ను అధిగమిస్తూ ముందుకెళ్లాడు. అయితే వియత్నాం షూటర్ గుయాన్ హోయాంగ్ ఫౌంగ్ నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. ప్రతి రౌండ్‌లో ప్రత్యర్థి ఎక్కువ పాయింట్లు సాధించడంతో జీతూ రాయ్ రెండో స్థానానికే పరిమితమయ్యాడు. కానీ ఊహించని రీతిలో ఆఖరి షాట్‌ను సంధించిన భారత షూటర్ 8.4 పాయింట్లు గెలిస్త్తే, గుయాన్ 5.8 పాయింట్లతోనే సరిపెట్టుకున్నాడు.
అంతే అప్పటి వరకు ఉన్న ఆధిక్యంలో ఉన్న గుయాన్ (183.4 పాయింట్లు) రెండో స్థానానికి పడిపోయి రజతంతో సరిపెట్టుకోగా.. జీతూ స్వర్ణం ఎగరేసుకుపోయాడు. వాంగ్ హీవీ (165.6 పాయింట్లతో) కాంస్యం దక్కించుకున్నాడు. మరోవైపు ఇతర భారత షూటర్లలో ఓం ప్రకాశ్ (555 పాయింట్లు), ఓంకార్ సింగ్ (551 పాయింట్లు)లు వరుసగా 10, 16వ స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయారు. టీమ్ విభాగంలో జీతూ, ఓంకార్, ఓం ప్రకాశ్ బృందం 1665 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది.
రెండో షూటర్: ఆసియా గేమ్స్ పిస్టల్ ఈవెంట్‌లో స్వర్ణం సాధించిన రెండో షూటర్‌గా 27 ఏళ్ల జీతూ రాయ్ రికార్డులకెక్కాడు. గతంలో జస్పాల్ రాణా ఈ ఘనత సాధించాడు. అయితే షాట్‌గన్ షూటర్లలో స్వర్ణం సాధించిన జాబితాలో మాత్రం జీతూ నాలుగో స్థానంలో ఉన్నాడు. జస్పాల్, రణ్‌ధీర్ సింగ్ (1978), రంజన్ సోధి (2010)లు గతంలో స్వర్ణాలు గెలిచారు. ఈ ఏడాది అంతర్జాతీయ పోటీల్లో జీతూకు ఇది వరుసగా ఆరో పతకం కావడం విశేషం.
రాష్ట్రపతి అభినందనలు: జీతూ రాయ్, శ్వేతా చౌదురిలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభినందనలు తెలిపారు. ‘అంతర్జాతీయ యవనికపై భారత పతాకాన్ని రెపరెపలాడించినందుకు నా అభినందనలు. తర్వాతి పోటీల్లో పతకాల కోసం ప్రయత్నించేవారికి నా శుభాకాంక్షలు’ అని ప్రణబ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
సొంత పిస్టల్ లేకపోయినా...
మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో శ్వేతా చౌదురి మెరుపులు మెరిపించింది. తను రెగ్యులర్‌గా వాడే పిస్టల్ కొరియా కస్టమ్స్ అధికారుల దగ్గరే ఉండిపోయినా.. వేరే పిస్టల్‌తో ఫైనల్లోకి బరిలోకి దిగిన శ్వేత 176.4 పాయింట్లతో నేర్పుగా కాంస్య పతకాన్ని ఒడిసిపట్టుకుంది. ఆరంభంలో కాస్త తడబడిన భారత షూటర్ ఆరో స్థానం నుంచి నెమ్మదిగా పుంజుకుంది.
షూటాఫ్‌లో జుహు క్వింగ్‌యాన్ (చైనా) 10 పాయింట్లు సాధిస్తే, శ్వేత 10.7 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. అంతకుముందు జరిగిన క్వాలిఫయింగ్‌లో శ్వేత 383 పాయింట్లు సాధించింది. సహచర క్రీడాకారిణులు హీనా సిద్ధూ (378 పాయింట్లు), మలైకా గోయల్ (373 పాయింట్లు) వరుసగా 13, 24వ స్థానాల్లో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయారు. అయితే టీమ్ విభాగంలో ఈ త్రయం (1134 పాయింట్లు) ఐదో స్థానంతో సరిపెట్టుకుంది.