Pistol event
-
Asian Shooting Championships 2023: అనీశ్ డబుల్ ధమాకా
చాంగ్వాన్ (దక్షిణ కొరియా): ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. సోమవారం జరిగిన పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో భారత యువ షూటర్ అనీశ్ భన్వాలా కాంస్య పతకం సాధించాడు. ఆరుగురి మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో 21 ఏళ్ల అనీశ్ 28 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంతో ముగించాడు. ఈ ప్రదర్శనతో అనీశ్ వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌ను కూడా ఖరారు చేసుకున్నాడు. ఇప్పటి వరకు షూటింగ్లో భారత్‌కు 12 ఒలింపిక్ బెర్త్‌లు లభించాయి. మరోవైపు పురుషుల ట్రాప్ టీమ్ ఈవెంట్లో హైదరాబాద్ షూటర్ కైనన్ షెనాయ్, జొరావర్ సింగ్ సంధూ, పృథ్వీరాజ్ తొండైమన్‌లతో కూడిన భారత జట్టుకు రజత పతకం దక్కింది. కైనన్, జొరావర్, పృథీ్వరాజ్ బృందం 341 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో భారత్ 30 పతకాలు సాధించింది. -
పసిడి పతకాలతో ముగింపు
చాంగ్వాన్ (కొరియా): ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్ పోటీలను భారత షూటర్లు పసిడి పతకాలతో ముగించారు. ఈ టోర్నీ చివరిరోజు సోమవారం భారత్‌కు మూడు స్వర్ణాలు, ఒక రజత పతకం లభించాయి. పురుషుల 50 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కమల్జీత్ 544 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణ పతకాన్ని సాధించాడు. కమల్జీత్, అంకిత్ తోమర్, సందీప్ బిష్ణోయ్‌లతో కూడిన భారత జట్టు 50 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లో 1617 పాయింట్లతో పసిడి పతకాన్ని దక్కించుకుంది. మహిళల 50 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో టియానా 519 పాయింట్లతో రజత పతకాన్ని సొంతం చేసుకుంది. టియానా, యశిత షోకీన్, వీర్పాల్ కౌర్‌లతో కూడిన భారత జట్టు మహిళల 50 మీటర్ల పిస్టల్ టీమ్ విభాగంలో 1498 పాయింట్లతో బంగారు పతకాన్ని గెల్చుకుంది. ఈ మెగా ఈవెంట్లో భారత షూటర్లు ఓవరాల్‌గా ఆరు స్వర్ణాలు, ఆరు రజతాలు, ఐదు కాంస్య పతకాలతో కలిపి మొత్తం 17 పతకాలతో రెండో స్థానంలో నిలిచారు. 28 పతకాలతో చైనా టాప్ ర్యాంక్‌లో నిలిచింది. -
ప్రపంచ రికార్డు... అయినా పతకానికి దూరం
ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ రిథమ్ సాంగ్వాన్ కొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. అజర్‌బైజాన్‌లోని బాకులో జరుగుతున్న ఈ పోటీల్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో రిథమ్ 595 పాయింట్లు స్కోరు సాధించి రికార్డును నమోదు చేసింది. అయితే ఈ పోటీల క్వాలిఫయింగ్ ఈవెంట్లో ఆమె ఈ కొత్త ఘనతను ప్రదర్శించింది. రికార్డు స్కోరుతో ఫైనల్ చేరిన రిథమ్ అసలు సమరంలో మాత్రం విఫలమైంది. సత్తా చాటలేకపోయిన ఆమె చివరగా ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. ఇదే ఈవెంట్ క్వాలిఫయింగ్ ఇతర భారత షూటర్లు ఇషాసింగ్, మను భాకర్ వరుసగా 13వ, 27వ స్థానాల్లో నిలిచి ఆరంభంలోనే ని్రష్కమించారు. పురుషుల 50 మీటర్ల 3 పొజిషన్ రైఫిల్ ఈవెంట్లో కూడా భారత షూటర్లెవరూ ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయారు. -
Bhopal ISSF World Cup: మనూ భాకర్‌కు కాంస్యం
భోపాల్‌లో జరుగుతున్న ప్రపంచకప్ షూటింగ్లో భారత్ ఖాతాలో ఆరో పతకం చేరింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో మనూ భాకర్ (20 పాయింట్లు) కాంస్య పతకం గెలుచుకుంది. టోర్నీలో భాకర్‌కు ఇదే మొదటి పతకం. ఈ పోరులో డొరీనా (30 పాయింట్లు), జియూ డు (29 పాయింట్లు) స్వర్ణ, రజతాలు గెలుచుకున్నారు. ఇదే విభాగంలో మరో భారత షూటర్, తెలంగాణకు చెందిన ఇషా సింగ్ పతకం సాధించడంలో విఫలమైంది. శనివారం ఈవెంట్లు ముగిసే సరికి భారత్ 1 స్వర్ణం, 1 రజతాలు, 4 కాంస్యాలతో రెండో స్థానంలో కొనసాగుతుండగా...6 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలు (మొత్తం 10 పతకాలు) చైనా అగ్ర స్థానంలో నిలిచింది. -
ISSF World Championship: ఇషా పసిడి గురి
కైరో (ఈజిప్ట్): ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ షూటర్ ఇషా సింగ్ స్వర్ణ పతకం సాధించింది. శనివారం జరిగిన జూనియర్ మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో ఇషా సింగ్ చాంపియన్ గా అవతరించింది. ఫైనల్లో ఇషా 29 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. సిజువాన్ ఫెంగ్ (చైనా; 26 పాయింట్లు) రజతం, మిరియమ్ జాకో (హంగేరి; 18 పాయింట్లు) కాంస్యం గెలిచారు. పురుషుల జూనియర్ 25 మీటర్ల పిస్టల్, స్టాండర్డ్ పిస్టల్ ఈవెంట్స్‌లో భారత్‌కే చెందిన ఉదయ్‌వీర్ సిద్ధూ పసిడి పతకాలు సొంతం చేసుకున్నాడు. పిస్టల్ విభాగంలో ఉదయ్‌వీర్ 580 పాయింట్లు స్కోరు చేసి టాప్ ర్యాంక్‌లో నిలిచాడు. మాస్ట్రోవలెరియో (ఇటలీ; 579 పాయింట్లు) రజతం, లియు యాంగ్పన్ (చైనా; 577 పాయింట్లు) కాంస్యం సాధించారు. స్టాండర్డ్ పిస్టల్ ఈవెంట్లో ఉదయ్‌వీర్ 568 పాయింట్లు స్కోరు చేసి అగ్ర స్థానాన్ని దక్కించుకున్నాడు. సమీర్ (భారత్; 567 పాయింట్లు) కాంస్యం గెలిచాడు. -
Rahi Sarnobat: రాహీ పసిడి గురి
ఒసిజెక్ (క్రొయేషియా): ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్‌కు తొలి పసిడి పతకం లభించింది. సోమవారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో రాహీ సర్నోబత్ బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన 30 ఏళ్ల రాహీ ఎనిమిది మంది పాల్గొన్న ఫైనల్లో 39 పాయింట్లు స్కోరు చేసింది. లామోలి మథిల్డె (ఫ్రాన్స్–31 పాయింట్లు) రజతం, వితాలినా (రష్యా–28 పాయింట్లు) కాంస్యం సాధించారు. ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో భారత్‌కే చెందిన మరో షూటర్ మనూ భాకర్ 11 పాయింట్లు స్కోరు చేసి ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. 49 మంది షూటర్లు పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో రాహీ 591 పాయింట్లు... మనూ 588 పాయింట్లు స్కోరు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు. మరోవైపు మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో భారత షూటర్ తేజస్విని సావంత్ క్వాలిఫయింగ్‌లో పదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందలేకపోయింది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో ఇప్పటి వరకు భారత్ స్వర్ణం, రజతం, రెండు కాంస్యాలతో కలిపి మొత్తం నాలుగు పతకాలు గెల్చుకుంది. -
ఆసియా క్రీడల్లో భారత్ ఆటగాళ్లు
-
షూటింగ్లో భారత్‌కు మరో కాంస్యం
ఇంచియాన్ : ఏషియన్ కీడ్రల్లో మూడోరోజు భారత్ మరో పతకాన్ని కైవసం చేసుకుంది. 25 మీటర్ల మహిళల పిస్టల్ ఈవెంట్లో భారత్ కాంస్య పతకం సాధించింది. పసిడి పతకాన్ని సౌత్ కొరియా, చైనా సిల్వర్ పతకాన్ని సొంతం చేసుకున్నాయి. షూటింగ్ విభాగంలో ఇప్పటికే భారత్ నాలుగు పతకాలు సాధించిన విషయం తెలిసిందే. ఆసియా క్రీడల్లో భారత షూటర్ జీతూ రాయ్ తొలిస్వర్ణం సాధించగా, శ్వేతా చౌదరి కాంస్య పతకం గెలుచుకొంది. మరోవైపు సైక్లింగ్ లో భారత్ క్రీడాకారులు నిరాశపరిచారు. -
బుల్లెటు దిగింది
ఒలింపిక్స్, కామన్వెల్త్, ఆసియా క్రీడలు... వేదిక ఏదైనా భారత్ పతకాల బోణీ చేసేది మాత్రం షూటింగ్‌లోనే. నిలకడ, కచ్చితత్వం, ఏకాగ్రత.. ఈ మూడింటినీ అద్భుతంగా సమన్వయం చేసుకుంటున్న ‘బుల్లెట్’ వీరులు ఇంచియాన్ ఏషియాడ్‌లో కూడా దుమ్మురేపారు. దీంతో తొలి రోజు భారత్‌కు ఓ స్వర్ణం, కాంస్యం లభించాయి.పిస్టల్ ఈవెంట్లో భారత్‌కు రెండు పతకాలు... - జీతూ రాయ్‌కి స్వర్ణం - కాంస్యంతో మెరిసిన శ్వేత ఇంచియాన్: ఒకే ఒక్క షాట్... ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణాన్ని అందించింది. అప్పటి వరకు రెండో స్థానం తప్పదనుకున్నా... చివరి షాట్‌కు సంధించిన బుల్లెట్.... ప్రత్యర్థి ఆధిక్యాన్ని వెనక్కి నెడుతూ ముందుకు దూసుకెళ్లింది. ఫలితంగా చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత మేటి షూటర్ జీతూ రాయ్ (186.2 పాయింట్లు) పసిడి కాంతులు పూయించాడు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో శ్వేతా చౌదురి 176.4 పాయింట్లతో కాంస్యంతో తళుక్కుమంది. ఓవరాల్‌గా శనివారం ప్రారంభమైన ఏషియాడ్‌లో భారత షూటర్ల బుల్లెట్ పదును పెరిగింది. సూపర్ షాట్ క్వాలిఫయింగ్‌లో 559 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచిన జీతూ రాయ్ ఫైనల్లో మరింత నిలకడను చూపెట్టాడు. ప్రత్యర్థుల నుంచి పోటీ తీవ్రంగా ఉన్నా తన ఏకాగ్రతను మాత్రం సడలనీయలేదు. ఒక్కో రౌండ్‌ను అధిగమిస్తూ ముందుకెళ్లాడు. అయితే వియత్నాం షూటర్ గుయాన్ హోయాంగ్ ఫౌంగ్ నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. ప్రతి రౌండ్లో ప్రత్యర్థి ఎక్కువ పాయింట్లు సాధించడంతో జీతూ రాయ్ రెండో స్థానానికే పరిమితమయ్యాడు. కానీ ఊహించని రీతిలో ఆఖరి షాట్‌ను సంధించిన భారత షూటర్ 8.4 పాయింట్లు గెలిస్త్తే, గుయాన్ 5.8 పాయింట్లతోనే సరిపెట్టుకున్నాడు. అంతే అప్పటి వరకు ఉన్న ఆధిక్యంలో ఉన్న గుయాన్ (183.4 పాయింట్లు) రెండో స్థానానికి పడిపోయి రజతంతో సరిపెట్టుకోగా.. జీతూ స్వర్ణం ఎగరేసుకుపోయాడు. వాంగ్ హీవీ (165.6 పాయింట్లతో) కాంస్యం దక్కించుకున్నాడు. మరోవైపు ఇతర భారత షూటర్లలో ఓం ప్రకాశ్ (555 పాయింట్లు), ఓంకార్ సింగ్ (551 పాయింట్లు)లు వరుసగా 10, 16వ స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయారు. టీమ్ విభాగంలో జీతూ, ఓంకార్, ఓం ప్రకాశ్ బృందం 1665 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. రెండో షూటర్: ఆసియా గేమ్స్ పిస్టల్ ఈవెంట్లో స్వర్ణం సాధించిన రెండో షూటర్‌గా 27 ఏళ్ల జీతూ రాయ్ రికార్డులకెక్కాడు. గతంలో జస్పాల్ రాణా ఈ ఘనత సాధించాడు. అయితే షాట్‌గన్ షూటర్లలో స్వర్ణం సాధించిన జాబితాలో మాత్రం జీతూ నాలుగో స్థానంలో ఉన్నాడు. జస్పాల్, రణ్‌ధీర్ సింగ్ (1978), రంజన్ సోధి (2010)లు గతంలో స్వర్ణాలు గెలిచారు. ఈ ఏడాది అంతర్జాతీయ పోటీల్లో జీతూకు ఇది వరుసగా ఆరో పతకం కావడం విశేషం. రాష్ట్రపతి అభినందనలు: జీతూ రాయ్, శ్వేతా చౌదురిలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభినందనలు తెలిపారు. ‘అంతర్జాతీయ యవనికపై భారత పతాకాన్ని రెపరెపలాడించినందుకు నా అభినందనలు. తర్వాతి పోటీల్లో పతకాల కోసం ప్రయత్నించేవారికి నా శుభాకాంక్షలు’ అని ప్రణబ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సొంత పిస్టల్ లేకపోయినా... మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో శ్వేతా చౌదురి మెరుపులు మెరిపించింది. తను రెగ్యులర్‌గా వాడే పిస్టల్ కొరియా కస్టమ్స్ అధికారుల దగ్గరే ఉండిపోయినా.. వేరే పిస్టల్‌తో ఫైనల్లోకి బరిలోకి దిగిన శ్వేత 176.4 పాయింట్లతో నేర్పుగా కాంస్య పతకాన్ని ఒడిసిపట్టుకుంది. ఆరంభంలో కాస్త తడబడిన భారత షూటర్ ఆరో స్థానం నుంచి నెమ్మదిగా పుంజుకుంది. షూటాఫ్‌లో జుహు క్వింగ్యాన్ (చైనా) 10 పాయింట్లు సాధిస్తే, శ్వేత 10.7 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. అంతకుముందు జరిగిన క్వాలిఫయింగ్‌లో శ్వేత 383 పాయింట్లు సాధించింది. సహచర క్రీడాకారిణులు హీనా సిద్ధూ (378 పాయింట్లు), మలైకా గోయల్ (373 పాయింట్లు) వరుసగా 13, 24వ స్థానాల్లో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయారు. అయితే టీమ్ విభాగంలో ఈ త్రయం (1134 పాయింట్లు) ఐదో స్థానంతో సరిపెట్టుకుంది.