హమెదాన్ (ఇరాన్): భారత మహిళల చెస్ నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఆసియా నేషన్స్ కప్ చెస్ టోర్నమెంట్‌లో పసిడి మెరుపులు మెరిపించింది. ఒకే రోజు రెండు స్వర్ణాలతోపాటు రజతం, కాంస్య పతకాలు దక్కించుకుంది. శుక్రవారం ముగిసిన ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో హారిక మహిళల బ్లిట్జ్ ఈవెంట్‌లో టీమ్, వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణ పతకాలు గెలిచింది. దాంతోపాటు స్టాండర్డ్ ఈవెంట్ టీమ్ విభాగంలో కాంస్యం, వ్యక్తిగత విభాగంలో రజతం సొంతం చేసుకుంది. హారికతోపాటు ఇషా కరవాడే, వైశాలి, పద్మిని రౌత్, ఆకాంక్ష భారత జట్టులో సభ్యులుగా ఉన్నారు. తొలుత ఏడు రౌండ్‌ల స్టాండర్డ్ విభాగంలో భారత్ ఎనిమిది పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. ఏడు మ్యాచ్‌లు ఆడిన భారత బృందం మూడు విజయాలు సాధించి... మరో రెండింటిని ‘డ్రా’ చేసుకొని, మరో రెండింటిలో ఓడిపోయింది. 13 పాయింట్లతో చైనా స్వర్ణం, 11 పాయింట్లతో వియత్నాం రజతం గెల్చుకున్నాయి.
స్టాండర్డ్ విభాగంలో బోర్డు–1పై బరిలోకి దిగిన హారిక తాను ఆడిన ఆరు గేముల్లోనూ విజయం సాధించి ఆరు పాయింట్లతో సారాసదత్ (ఇరాన్)తో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా సారాసదత్‌కు స్వర్ణం, హారికకు రజతం ఖాయమయ్యాయి. బోర్డు– 3పై ఇషా కరవాడే, బోర్డు–4పై పద్మిని రౌత్, బోర్డు– 5పై ఆకాంక్ష కాంస్య పతకాలు దక్కించుకున్నారు. ఇక బ్లిట్జ్ విభాగంలో భారత మహిళల జట్టు ఆరు మ్యాచ్‌ల్లో గెలిచి, మరో మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించి అజేయంగా నిలిచింది. నిర్ణీత ఏడు రౌండ్‌ల తర్వాత 13 పాయింట్లతో చాంపియన్‌గా అవతరించింది. ఈ విభాగంలోనూ బోర్డు–1పై బరిలోకి దిగిన హారిక ఐదు పాయింట్లతో టాప్ ర్యాంక్ పొంది పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది.
ఓపెన్ విభాగంలో రజతం...
మరోవైపు ఓపెన్ విభాగంలో ఆధిబన్, సేతురామన్, కృష్ణన్ శశికిరణ్, సూర్యశేఖర గంగూలీ, అభిజిత్ గుప్తాలతో కూడిన భారత పురుషుల జట్టు స్టాండర్డ్ విభాగంలో 10 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. నిర్ణీత ఏడు రౌండ్‌లకుగాను భారత్ నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి, రెండింటిని ‘డ్రా’ చేసుకొని, మరో మ్యాచ్‌లో ఓడి రజత పతకాన్ని దక్కించుకుంది. 13 పాయింట్లతో ఇరాన్ గ్రీన్ స్వర్ణం కైవసం చేసుకుంది. వ్యక్తిగత విభాగంలో సేతురామన్ (బోర్డు–2), కృష్ణన్ శశికిరణ్ (బోర్డు–3) పసిడి పతకాలు సంపాదించగా... ఆధిబన్ (బోర్డు–1) రజతం గెల్చుకున్నాడు.
హారిక బృందం పసిడి మెరుపులు
Published Sat, Aug 4 2018 12:48 AM | Last Updated on Sat, Aug 4 2018 12:48 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment