
సాక్షి, హైదరాబాద్: ఏఐసీఎఫ్ అంతర్జాతీయ మహిళల గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్ గురువారం ఘనంగా ప్రారంభమైంది. గచ్చిబౌలిలోని ‘నిథమ్’ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీని తెలంగాణ క్రీడా కార్యదర్శి బుర్రా వెంకటేశం, భారత గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక ప్రారంభించారు. ఈనెల 16 వరకు జరుగనున్న ఈ మెగా టోర్నీలో భారత్ నుంచి ఆరుగురు జాతీయ స్థాయి క్రీడాకారులు పాల్గొంటున్నారు. వీరితో పాటు మంగోలియా, వియత్నాం, కజకిస్థాన్, ఉక్రెయిన్‌లకు చెందిన ఆరుగురు అంతర్జాతీయ క్రీడాకారులు టైటిల్‌కోసం పోటీ పడుతున్నారు. ఈ టోర్నీ తొలి అంచె పోటీలు ముంబైలో జరుగగా, రెండో అంచె పోటీలకు భాగ్యనగరం ఆతిథ్యమిస్తోంది.
టోర్నీ మెత్తం ప్రైజ్‌మనీ రూ. 7,50,000 కాగా విజేతకు రూ. 1,60,000 అందజేస్తారు. రన్నరప్‌కు రూ. 1,30,000, మూడోస్థానంలో నిలిచిన వారికి లక్ష రూపాయలు ప్రైజ్‌మనీగా ఇవ్వనున్నారు. టోర్నీ ప్రారంభోత్సవం సందర్భంగా అర్జున అవార్డు గ్రహీత, తెలుగు తేజం ద్రోణవల్లి హారికను క్రీడా కార్యదర్శి బుర్రా వెంకటేశం, ‘శాట్స్’ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి సత్కరించారు. అనంతరం బుర్రా వెంకటేశం మాట్లాడుతూ క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment