జయహో జోష్నా..
ఆసియా స్క్వాష్ చాంప్‌గా చినప్ప
ఫైనల్లో దీపికపై విజయం
చెన్నై: ఎట్టకేలకు నిరీక్షణ ముగిసింది. ఆసియా స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత్ నుంచి తొలి చాంపియన్ అవతరించింది. ఆదివారం ముగిసిన ప్రతిష్టాత్మక ఆసియా వ్యక్తిగత స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో జోష్నా చినప్ప విజేతగా నిలిచింది. భారత్‌కే చెందిన మరో స్టార్ క్రీడాకారిణి దీపిక పళ్లికల్‌తో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో జోష్నా 13–15, 12–10, 11–13, 11–4, 11–4తో విజయం సాధించింది. 78 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో ఒకదశలో 1–2 గేమ్‌లతో వెనుకబడిన జోష్నా అద్భుతంగా పుంజుకొని వరుసగా రెండు గేమ్‌లను సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది.
ఈ క్రమంలో ఆసియా చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన తొలి భారతీయ ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది. 31 ఏళ్ల ఆసియా చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్ నుంచి ఇద్దరు క్రీడాకారిణులు ఫైనల్లో తలపడటం ఇదే తొలిసారి. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో సౌరవ్ ఘోషాల్‌కు నిరాశ ఎదురైంది. టాప్ సీడ్ మాక్స్ లీ (హాంకాంగ్)తో జరిగిన ఫైనల్లో సౌరవ్ 11–5, 4–11, 8–11, 7–11తో ఓడిపోయాడు. అయితే పురుషుల సింగిల్స్‌లో భారత్ నుంచి రన్నరప్‌గా నిలిచిన తొలి క్రీడాకారుడిగా సౌరవ్ గుర్తింపు పొందాడు.