గువాహటి: అస్సాంతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. రెండో రోజంతా బౌలింగ్ చేసి కేవలం ఒకే ఒక్క వికెట్ తీశారు. దీంతో ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్ గోకుల్ శర్మ (285 బంతుల్లో 126 బ్యాటింగ్, 17 ఫోర్లు), శివశంకర్ రాయ్ (373 బంతుల్లో 134, 17 ఫోర్లు) సెంచరీలతో కదం తొక్కారు. రంజీ ట్రోఫీ గ్రూప్-సిలో భాగంగా బార్సాపర స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శుక్రవారం ఆట ముగిసే సమయానికి అస్సాం తొలి ఇన్నింగ్స్‌లో 180 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 422 పరుగుల భారీ స్కోరు చేసింది.
181/5 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన అస్సాం మరో 241 పరుగులు జోడించింది. ఓవర్ నైట్ బ్యాట్స్‌మెన్ శివశంకర్ రాయ్, గోకుల్ సెంచరీలతో చెలరేగారు. హైదరాబాద్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్నారు. దీంతో ఇన్నింగ్స్ దూకుడుగా కాకుండా సాఫీగా సాగిపోయింది. కెప్టెన్ అక్షత్ రెడ్డి పదే పదే బౌలర్లను మార్చి ప్రయోగించినప్పటికీ లాభం లేకపోయింది. ఇద్దరు ఆరో వికెట్‌కు 107 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో మొదట శివశంకర్ తొలి ఫస్ట్ క్లాస్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు.
అనంతరం జట్టు స్కోరు 285 పరుగుల వద్ద రాయ్... ఆశిష్ రెడ్డి బౌలింగ్‌లో సందీప్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన సయ్యద్ మహ్మద్ (117 బంతుల్లో 52 బ్యాటింగ్, 6 ఫోర్లు) కూడా క్రీజులో నిలదొక్కుకోవడంతో హైదరాబాద్ బౌలర్లకు కష్టాలు తప్పలేదు. ఇతని సహకారంతో గోకుల్ శర్మ కూడా సెంచరీ మైలురాయిని అందుకున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో గోకుల్‌కిది మూడో సెంచరీ కాగా... ఆట ముగిసే సమయానికి సయ్యద్, గోకుల్‌లిద్దరూ అభేద్యమైన ఏడో వికెట్‌కు 137 పరుగులు జోడించి క్రీజులో ఉన్నారు.
సంక్షిప్త స్కోర్లు
అస్సాం తొలి ఇన్నింగ్స్: 180 ఓవర్లలో 422/6 (శివశంకర్ 134, గోకుల్ 126 బ్యాటింగ్, సయ్యద్ 52 నాటౌట్; షిండే 3/124, ఆశిష్ 1/52, సుమన్ 1/8)
భారీ స్కోరు దిశగా అస్సాం
Published Sat, Nov 9 2013 12:55 AM | Last Updated on Fri, Sep 7 2018 1:56 PM
Advertisement
Advertisement