పొర్వోరిమ్ (గోవా): ఊహించినట్టుగానే గోవాతో జరిగిన రంజీ మ్యాచ్‌ను హైదరాబాద్ జట్టు డ్రాతో ముగించింది. అయితే చివరి రోజు ఆటలో స్పిన్నర్ అమోల్ షిండే (3/92) కీలక సమయంలో వికెట్లు తీసి గోవా బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. దీంతో హైదరాబాద్‌కు 49 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఈ కారణంగా జట్టుకు మూడు పాయింట్లు రాగా ఓవరాల్‌గా ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో 15 పాయింట్లు సాధించింది. జమ్మూ అండ్ కాశ్మీర్, కేరళతో ఇంకా మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నాయి. అయితే దాదాపుగా జట్టు ఈ సీజన్‌ను కూడా నిరాశాజనకంగా ముగించక తప్పదు.
ఎందుకంటే ఈ రెండు మ్యాచ్‌లను హైదరాబాద్ గెలుచుకుని, పోటీగా ఉన్న మిగతా జట్లు తమ అన్ని మ్యాచ్‌లను ఓడితే తప్ప లాభం లేదు. అలాంటి పరిస్థితి దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది.
గ్రూప్ ‘సి’లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో మంగళవారం గోవా 164.4 ఓవర్లలో 465 పరుగులకు ఆలౌటయ్యింది. దర్శన్ మిసల్ (151 బంతుల్లో 57; 5 ఫోర్లు), షాదాబ్ జకాతి (159 బంతుల్లో 80; 10 ఫోర్లు; 1 సిక్స్) పోరాడారు. రవికిరణ్‌కు మూడు, అబ్సొలెమ్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం తమ రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన హైదరాబాద్ 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 11 పరుగులతో చివరి రోజును ముగించింది.
సెంచరీ భాగస్వామ్యం
273/5 ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆట ప్రారంభించిన గోవాను ఆదిలోనే షిండే దెబ్బతీశాడు. గడేకర్ (73 బంతుల్లో 26; 4 ఫోర్లు)ను బౌల్డ్ చేయడంతో బరిలోకి దిగిన జకాతి జట్టును ఆదుకున్నాడు. మిసల్‌తో కలిసి చక్కటి ఇన్నింగ్స్ ఆడుతూ బౌలర్లను విసిగించాడు. ఈ క్రమంలోనే వీరిద్దరు అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఈ జోడి జోరుగా ఆడడంతో ఓ దశలో గోవా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కేలా కనిపించినా అబ్సొలెమ్ రాకతో పరిస్థితి మారిపోయింది. క్రీజులో కుదురుకున్న మిసల్‌ను చక్కటి బంతితో ఊరించగా వికెట్ కీపర్‌కు చిక్కాడు. దీంతో ఏడో వికెట్‌కు 101 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది.
అమిత్ యాదవ్ (72 బంతుల్లో 29; 2 ఫోర్లు)తో కలిసి పోరాడిన జకాతి... సందీప్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇవ్వడంతో గోవా ఆశలు అడుగంటాయి. అనంతరం రెండో ఇన్నింగ్స్‌కు దిగిన హైదరాబాద్ చివరి రోజు ముగిసేలోపు 5 ఓవర్లు ఆడి 11 పరుగులు చేసింది. సుమన్ (1), అక్షత్ (10) నాటౌట్‌గా నిలిచారు.
హైదరాబాద్‌కు మూడు పాయింట్లు
Published Wed, Dec 18 2013 12:21 AM | Last Updated on Wed, Sep 19 2018 6:31 PM
Advertisement