న్యూఢిల్లీ: భారత మహిళా అథ్లెట్ హిమ దాస్ ‘అడిడాస్’ పేరుపై ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. భారత సీనియర్ క్రికెటర్ రైనాతో ఆమె ఇన్ స్టాగ్రామ్‌లో చాటింగ్ చేసింది. ఈ సంభాషణలో ఆ సంగతి చెబుతూ ‘పందెం కోసం నా పరుగు ఉట్టి పాదాలతోనే మొదలైంది. ఎలాంటి బూట్లు, పాదరక్షల్లేవ్. అయితే నేను పాల్గొనే తొలి జాతీయ పోటీల కోసం నా తండ్రి తన స్తోమతకు తగిన సాదాసీదా స్పైక్ బూట్లను తెచ్చాడు. అయితే వాటిపై నేను చేతితో అడిడాస్ అనే బ్రాండ్ పేరు రాసి పోటీల్లో పాల్గొన్నాను. ఇప్పుడు అదే అడిడాస్ నాకు స్పాన్సర్ చేసిన కిట్‌పై నా పేరు రాసివ్వడం గొప్ప అనుభూతినిచ్చింది. షూస్‌పై హిమ దాస్ అని ఉండటం చూసిన నాకు అప్పటి అనుభవం గుర్తొచ్చింది’ అని చెప్పింది. 20 ఏళ్ల హిమ 2018లో ఫిన్లాండ్‌లో జరిగిన ప్రపంచ అండర్–20 చాంపియన్‌షిప్‌లో 400 మీటర్ల రేసులో పసిడి పతకం గెలిచింది. దీంతో ప్రముఖ షూ కంపెనీ అడిడాస్ ఆమెను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. ఆమె కోసం ప్రత్యేకంగా తయారు చేసిన షూస్‌లపై హిమ పేరు రాసింది.
Comments
Please login to add a commentAdd a comment