మెల్‌బోర్న్: భారత్ బౌలర్ యజువేంద్ర చాహల్ దెబ్బకు ఆసీస్ విలవిల్లాడింది. సాధారణ స్కోరుకే చాప చుట్టేసింది. మూడో వన్డేలో భారత్‌కు ఆస్ట్రేలియా 231 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 48.4 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది. హ్యాండ్స్‌కోంబ్ అర్ధ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఆసీస్‌ను భారీ స్కోరు చేయకుండా నిలువరించారు. ముఖ్యంగా చాహల్ మాయాజాలం చేశాడు. ఆరుగురు బ్యాట్స్‌మన్లను పెవిలియన్‌కు పంపి సత్తా చాటాడు.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 27 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ పదునైన బంతులతో ఓపెనర్ల భరతం పట్టాడు. తర్వాత ఖవాజా, మార్ష్ జాగ్రత్తగా ఆడి స్కోరును వంద పరుగులకు చేర్చారు. వీరిద్దరినీ వెంట వెంటనే అవుట్ చేసి చాహల్ వికెట్ల వేట ప్రారంభించాడు. ఒక ఎండ్‌లో హ్యాండ్స్‌కోంబ్ బాధ్యతాయుతంగా ఆడుతూ జట్టు స్కోరు 200 పరుగులు దాటించాడు. ఈ క్రమంలో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. 63 బంతుల్లో 2 ఫోర్లతో 58 పరుగులు చేసి 8వ వికెట్‌గా వెనుదిరిగాడు. చివరి వరుస బ్యాట్స్‌మెన్ నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాకపోవడంతో ఆసీస్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఖవాజా 34, షాన్ మార్ష్ 39, మ్యాక్స్‌వెల్ 26, రిచర్డ్‌సన్ 16, ఫించ్ 14, సిడిల్ 10 పరుగులు చేశారు. భారత బౌలర్లలో చాహల్ 6 వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్, షమి రెండేసి వికెట్లు తీశారు.
Comments
Please login to add a commentAdd a comment