సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా ఆస్ట్రేలియా స్టార్ డేవిడ్ వార్నర్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓవరాల్‌గా లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో వార్నర్‌ది (4,706) నాలుగో స్థానం కాగా, విదేశీ ఆటగాళ్లలో అతనే నంబర్‌వన్. సారథిగా కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ముందుండి నడిపించిన వార్నర్ 2016లో హైదరాబాద్ టీమ్ టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. అందుకే అతనికి ఇదో మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఐపీఎల్ విజేతగా నిలవడం తన కెరీర్‌లో అత్యుత్తమ క్షణాల్లో ఒకటని సన్‌రైజర్స్ కెప్టెన్ వ్యాఖ్యానించాడు. నాటి ఫైనల్ మ్యాచ్‌ను ఈ సందర్భంగా అతను గుర్తు చేసుకున్నాడు. 2016 సీజన్‌లో వార్నర్ 848 పరుగులు చేసి విరాట్ కోహ్లి (973) తర్వాత రెండో స్థానంలో నిలిచాడు.
‘ఐపీఎల్‌లో 2016 టైటిల్ గెలిచిన క్షణమే నాకు అతి మధురం. ఆ ఏడాది అన్ని మ్యాచ్‌లు బాగా ఆడాం. హోరాహోరీ సమరాల్లో నెగ్గడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. అద్భుతంగా సాగిన నాటి టోర్నీని నా జీవితకాలం గుర్తుంచుకుంటాను. ఫైనల్లో బెంగళూరును వారి సొంతగడ్డపై ఓడించడం మరచిపోలేను. నాడు కోహ్లి అద్భుతమైన ఫామ్‌లో ఉండగా...గేల్, డివిలియర్స్ అతడికి తోడుగా నిలిచారు. అయితే మా సామర్థ్యాన్ని మేం నమ్మాం. అందుకే టాస్ గెలిచినా బ్యాటింగ్ తీసుకున్నాం. 209 పరుగుల లక్ష్యాన్ని అందుకునే క్రమంలో ఆర్‌సీబీ 10 ఓవర్లలో ఒక వికెట్‌కే 145 పరుగులు చేయడంతో గుండె ఆగినంత పనైంది. అయితే రెండు కీలక వికెట్లు పడగొట్టి మళ్లీ మ్యాచ్‌లోకి వచ్చేశాం’ అని వార్నర్ గుర్తు చేసుకున్నాడు. నాటి ఫైనల్లో చివరకు హైదరాబాద్ 8 పరుగులతో విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment