
మాంచెస్టర్: క్రీజులో దిగిన ప్రతి బ్యాట్స్‌మన్ ప్రతిఘటించినా యాషెస్ నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. ఆదివారం ఇక్కడ ముగిసిన ఈ మ్యాచ్‌లో 383 పరుగుల భారీ లక్ష్యానికి గాను ఓవర్‌నైట్ స్కోరు 18/2తో ఐదో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆతిథ్య జట్టు 197 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆస్ట్రేలియా 185 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, ఇంగ్లండ్ ఏమీ అంత తేలిగ్గా తలొంచలేదు. ప్రత్యర్థి పేసర్ల ధాటిని తట్టుకుంటూ ఆ జట్టు గట్టి పోరాటమే చేసింది.
ఈ క్రమంలో ఓపెనర్ జాన్ డెన్లీ (123 బంతుల్లో 53; 6 ఫోర్లు), జేసన్ రాయ్ (67 బంతుల్లో 31) ఓవర్లను కరిగిస్తూ వచ్చారు. కానీ, రాయ్, మూడో టెస్టు హీరో బెన్ స్టోక్స్ (1)లను ఔట్ చేసిన కమిన్స్ (4/43) ఆసీస్‌కు పట్టు చిక్కేలా చేశాడు. తర్వాత డెన్లీ, బెయిర్ స్టో (61 బంతుల్లో 25), బట్లర్ (111 బంతుల్లో 34) జట్టును గట్టెక్కించేందుకు యత్నించారు. టీ విరామం తర్వాత బట్లర్, ఆర్చర్ (1) వెనుదిరిగినా లోయరార్డర్‌లో ఓవర్టన్ (105 బంతుల్లో 21), లీచ్ (51 బంతుల్లో 12) మరింత పట్టుదలగా ఆడి 14 ఓవర్ల పాటు నిలిచారు.
ఈ దశలో మ్యాచ్ ‘డ్రా’ అయ్యేలా కనిపించింది. లీచ్‌ను పార్ట్‌టైమర్ లబషేన్, ఓవర్టన్‌ను హాజల్‌వుడ్ పెవిలియన్ చేర్చి ఆసీస్‌ను గెలిపించారు. డబుల్ సెంచరీతో అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చిన స్టీవ్ స్మిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. ఐదు టెస్టుల సిరీస్‌లో ప్రస్తుతం ఆస్ట్రేలియా 2–1 ఆధిక్యంలో ఉంది. గత సిరీస్‌ను ఆ జట్టే గెల్చుకోవడంతో గురువారం నుంచి ప్రారంభమయ్యే ఐదో టెస్టులో ఓడినా గణాంకాలు 2–2తో సమం అవుతాయి. తద్వారా ట్రోఫీ కంగారూల వద్దనే ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment