మళ్లీ గర్జించిన ఆసీస్!
కాన్బెర్రా: వరుస ఓటములతో కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపించిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సిరీస్‌లో రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఇక్కడి మనుకా ఓవల్ మైదానంలో న్యూజిలాండ్ తో మంగళవారం జరిగిన రెండో వన్డేలో ఆసీస్ 116 పరుగుల భారీ తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. తొలి వన్డేలోనూ నెగ్గిన ఆసీస్ జట్టు సిరీస్‌లో ప్రస్తుతం 2-0 ఆధిక్యంలో ఉంది. తొలుత ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ వీర విహారానికి(119;115 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్సర్) తోడు కెప్టెన్ స్టీవ్ స్మిత్(72), ట్రావిస్ హెడ్(57), మిచెల్ మార్ష్(76 నాటౌట్)లు రాణించడంతో ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 378 పరుగులు చేసింది. అయితే 379 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 47.2 ఓవర్లలో 262 పరుగులకు ఆలౌటై దారుణ పరాజయాన్ని మూటకట్టుకుంది. సెంచరీ వీరుడు వార్నర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు.
లక్ష్యఛేదనకు దిగిన కివీస్ ఓపెనర్ గప్టిల్(45) మరోసారి రాణించగా, మరో ఓపెనర్ లాథమ్(4) నిరాశ పరిచాడు. కివీస్ కెప్టెన్ విలియమ్సన్(81: 80 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), నీషమ్(74: 83 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్ మాత్రమే పోరాటం చేయగా, ఇతర ఆటగాళ్లు పెవిలియన్‌కు త్వరగా క్యూ కట్టడంతో 262 పరుగులకు ఆలౌటై 116 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. కివీస్ వికెట్లన్నీ ఆసీస్ పేసర్లకే దక్కడం గమనార్హం. ముఖ్యంగా కమిన్స్, హజెల్ వుడ్ ధాటికి కివీస్ ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ 4 వికెట్లు దక్కించుకోగా, హజెల్ వుడ్, ఫాల్కనర్, స్టార్క్ తలో రెండు వికెట్లు తీసి జట్టు విజయంలో పాలు పంచుకున్నారు.