- ఆస్ట్రేలియా ఆటగాళ్ల సుదీర్ఘ సాధన
- కోహ్లీ, అశ్విన్‌లను ఉద్దేశించి వార్నర్ ఆసక్తికర కామెంట్స్
ముంబై: భారత గడ్డపై భారీ సమరానికి సన్నద్ధమవుతున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు బుధవారం తొలిసారి మైదానంలోకి అడుగు పెట్టింది. జట్టు సభ్యులంతా సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు. కీలక ఆటగాళ్లు స్మిత్, వార్నర్, ఖాజా, మ్యాక్స్‌వెల్ నెట్స్‌లోని వేర్వేరు వికెట్‌లపై తమ ప్రాక్టీస్‌ను కొనసాగించగా, మరి కొందరు స్లిప్ క్యాచింగ్‌లో పాల్గొన్నారు. ముఖ్యంగా స్థానిక స్పిన్ బౌలర్లతో పాటు జట్టు స్పిన్ కన్సల్టెంట్ శ్రీధరన్ శ్రీరామ్ బౌలింగ్‌లో ఆసీస్ క్రికెటర్లంతా స్పిన్‌ను ఆడటంపై ఎక్కువగా దృష్టి పెట్టారు. శుక్రవారం నుంచి ఇక్కడ జరిగే మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ ‘ఎ’తో ఆస్ట్రేలియా తలపడుతుంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టు ఈ నెల 23 నుంచి పుణేలో జరుగుతుంది.
అశ్విన్‌తో పోరుకు సిద్ధం...: భారత్‌తో సిరీస్ అంటే ఆసీస్‌కు అశ్విన్ రూపంలోనే అగ్నిపరీక్ష ఎదురవుతోంది. నాలుగేళ్ల క్రితం 0–4తో కంగారూలు చిత్తుగా ఓడిన సిరీస్‌లో అశ్విన్ 29 వికెట్లతో చెలరేగాడు. ఈసారి భారత ఆఫ్ స్పిన్నర్‌ను ఎదుర్కొనేందుకు తాము సన్నద్ధమై వచ్చామని ఆ జట్టు అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్ వార్నర్ అన్నాడు.‘ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ మనసును చదివి బౌలింగ్ చేసే అశ్విన్ లాంటి బౌలర్‌నునేను గౌరవిస్తా. అతని బౌలింగ్‌లో జాగ్రత్తగా ఆడటం అవసరం. అయితే అశ్విన్ కోసం నా వద్ద ప్రత్యేక ప్రణాళిక సిద్ధంగా ఉంది. మా ఇద్దరి మధ్య ఆసక్తికర పోరు జరగవచ్చు’ అని వార్నర్ చెప్పాడు.
కోహ్లితో స్లెడ్జింగ్ అంటే వ్యతిరేక ఫలితం వచ్చే ప్రమాదం కూడా ఉంటుందన్న వార్నర్... మాటల యుద్ధాన్ని ఎలా ఎదుర్కోవాలో గొప్ప ఆటగాళ్లకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదన్నాడు. స్లెడ్జింగ్ విషయంలో వార్నర్‌తో అతని సహచరుడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా ఏకీభవించాడు. అందుకే కోహ్లితో స్లెడ్జింగ్‌కు దిగే సాహసం చేయనని స్పష్టం చేశాడు. ‘కోహ్లిని నేను ఏమీ అనదల్చుకోలేదు. అది మాత్రం ఖాయం. ఎందుకంటే అతడితో పెట్టుకుంటే ఇక అంతే సంగతులు. ప్రస్తుతం అత్యద్భుత ఫామ్‌లో ఉన్న కోహ్లి అవుట్ కావాలంటే ఏ రనౌట్‌లాంటిదో అదృష్టం మాకు కలిసి రావాల్సిందే’ అని మ్యాక్స్‌వెల్ వ్యాఖ్యానించాడు. మరోవైపు భారత పిచ్‌లపై ఆస్ట్రేలియా పేసర్ మిషెల్ స్టార్క్ కూడా మంచి ప్రభావం చూపించగలడని, అతని పదునైన బౌలింగ్ విరాట్ కోహ్లిని కూడా ఇబ్బంది పెట్టవచ్చని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైక్ హస్సీ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రాక్టీస్... ప్రాక్టీస్... ప్రాక్టీస్...
Published Thu, Feb 16 2017 12:29 AM | Last Updated on Tue, Sep 5 2017 3:48 AM
Advertisement
Advertisement