విరాట్ కోహ్లి
బర్మింగ్‌హామ్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై ఆస్ట్రేలియా మీడియా దుమ్మెత్తిపోస్తోంది. అతడి ఇమేజ్‌ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తోంది. సరిగ్గా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ముందే ఇలా చేయడం చర్చనీయాంశమైంది. ఈ ప్రయత్నాలను భారత అభిమానులు తిప్పికొడుతున్నారు. ‘ఫాక్స్ స్పోర్ట్స్ ఆస్ట్రేలియా’ తన ఫేస్‌బుక్ పేజీలో కోహ్లిపై ప్రత్యేకంగా రూపొందించిన ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో గత ఇంగ్లండ్ పర్యటనలో కోహ్లి వైఫల్యాలను జతపరిచింది. అంతేకాకుండా ఈ వీడియోకు ‘ఇంగ్లండ్ గడ్డపై విరాట్ కోహ్లి ఫేవరేట్ షాట్’ అని సెటైరిక్ క్యాప్షన్‌తో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియోపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసీస్ గడ్డపై కోహ్లి సాధించిన సెంచరీలు మరిచిపోయారా? అంటూ చురకలంటిస్తున్నారు.
ఇక కోహ్లిపై ఆసీస్ మీడియా విషం గక్కడం ఇదే తొలిసారేం కాదు.. భారత పర్యటనలో భాగంగా డక్‌వర్త్ లూయిస్ విషయంలో స్మిత్ చేసిన పొరపాటును కప్పిపుచ్చుతూ.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో కోహ్లిని పోల్చుతూ విమర్శలు గుప్పించింది. ఇక తమ దేశ ఆటగాళ్లను వెనుకేసుకు రావడంలో ఆసీస్ మీడియా ఎప్పుడు ముందే ఉంటుదన్న విషయం తెలిసిందే. 2014 ఇంగ్లండ్ పర్యటనలో కోహ్లి దారుణంగా విఫలమయ్యాడు. ఐదు మ్యాచ్‌లు ఆడిన కోహ్లి కేవలం 134 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్ 13.40 కాగా.. రెండు సార్లు డకౌట్ కూడా అయ్యాడు.
ఈ సిరీస్ అనంతరం కోహ్లి నేలకు కొట్టిన బంతిలా విజృంభించాడు. ఆస్ట్రేలియా గడ్డపై వరుస సెంచరీలతో చెలరేగాడు.. ఇప్పటి వరకు ఆసీస్ గడ్డపై మొత్తం 8 మ్యాచ్‌లాడిన కోహ్లి 62 సగటుతో 992 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉండటం విశేషం. అనంతరం దక్షిణాఫ్రికా గడ్డపై 5 మ్యాచుల్లో 55.80 సగటుతో 558 పరుగులు చేశాడు. ఈ పర్యటనలో రెండు సెంచరీలు నమోదు చేశాడు. న్యూజిలాండ్ గడ్డపై రెండు మ్యాచుల్లో ఓ సెంచరీతో 214 పరుగులు చేశాడు. ఇలా అన్ని దేశాల మీద రాణించిన కోహ్లికి ఇంగ్లండ్‌లో విఫలమవ్వడం వెలతిగా మిగిలిపోయింది. తన సారథ్యంలో నేటి నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభమయ్యే 5 టెస్టుల సిరీస్‌లో చెలరేగాలని కోహ్లి భావిస్తున్నాడు.
‘ఫాక్స్ స్పోర్ట్స్ ఆస్ట్రేలియా’ షేర్ చేసిన వీడియో
Comments
Please login to add a commentAdd a comment