
సాధించారోచ్..!
పెర్త్: ఎప్పుడో 2009లో ఇంగ్లండ్‌కు ‘యాషెస్’ను కోల్పోయిన ఆస్ట్రేలియా... ఆ తర్వాత మరో రెండుసార్లు విశ్వప్రయత్నాలు చేసినా... తిరిగి విజయాన్ని దక్కించుకోలేకపోయింది. తాజాగా నాలుగు నెలల క్రితం ఇంగ్లండ్‌లో ఘోరమైన ఆటతీరుతో పరాభవాన్ని మూటగట్టుకున్న ఆస్ట్రేలియా... ఎట్టకేలకు జూలు విదిల్చింది. తొలి మూడు టెస్టుల్లోనే ఘన విజయాలు సాధించి... ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో రెండు టెస్టులు మిగిలుండగానే 3-0తో సాధించింది. దీంతో కేవలం నాలుగు నెలల్లోనే కుక్‌సేన మీద ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. మంగళవారం వాకాలో ముగిసిన మూడో టెస్టులోనూ ఆసీస్ 150 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై నెగ్గింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 3-0 ఆధిక్యంలో నిలిచింది.
504 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 251/5 ఓవర్‌నైట్ స్కోరుతో ఆఖరి రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్... రెండో ఇన్నింగ్స్‌లో 103.2 ఓవర్లలో 353 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ స్టోక్స్ (195 బంతుల్లో 120; 18 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీతో చెలరేగినా, ప్రయర్ (26) విఫలమయ్యాడు. వీరిద్దరి మధ్య ఆరో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. నిలకడగా ఆడుతున్న ఈ జోడిని జాన్సన్ విడగొట్టడంతో వికెట్లపతనం మొదలైంది.
తర్వాత వచ్చిన బ్రెస్నన్ (12) క్రీజులో కుదురుకునేందుకు ప్రాధాన్యమివ్వడంతో 332/6 స్కోరుతో ఇంగ్లండ్ లంచ్‌కు వెళ్లింది. అయితే లంచ్ తర్వాత సెంచరీ పూర్తి చేసిన స్టోక్స్‌ను లియోన్ దెబ్బతీశాడు. బంతిని స్వీప్ చేయబోయి హాడిన్ చేతికి చిక్కాడు. దీంతో బ్రెస్నన్, స్టోక్స్‌ల మధ్య ఏడో వికెట్‌కు నెలకొన్న 40 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. స్వాన్ (4), బ్రెస్నన్, అండర్సన్ (2) వెంటవెంటనే అవుట్ కావడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. జాన్సన్ 4, లియోన్ 3 వికెట్లు పడగొట్టారు. స్టీవ్ స్మిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య నాలుగో టెస్టు ఈనెల 26 నుంచి మెల్‌బోర్న్‌లో జరుగుతుంది.
3 తొలి మూడు టెస్టుల్లో గెలిచి యాషెస్‌ను దక్కించుకోవడం ఆస్ట్రేలియాకు ఇది మూడోసారి.
32 ప్రస్తుత విజయంతో కలిపి ఆసీస్ ఇప్పటి వరకు 32 సార్లు యాషెస్‌ను గెలుచుకుంది. 68 యాషెస్ సిరీస్‌ల్లో ఇంగ్లండ్ 31సార్లు గెలవగా, ఐదుసార్లు సిరీస్ డ్రా అయ్యింది.