సిడ్నీ: భారత్‌తో ఇక్కడ జరుగుతున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియా 289 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్ జట్టులో ఉస్మాన్ ఖవాజా(59; 81 బంతుల్లో 6 ఫోర్లు), షాన్ మార్ష్(54; 70 బంతుల్లో 4 ఫోర్లు), హ్యాండ్ స్కాంబ్(73; 61 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక‍్సర్లు)లు హాఫ్ సెంచరీలతో రాణించడంతో పాటు మార్కస్ స్టోనిస్(47 నాటౌట్; 43 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ అరోన్ ఫించ్(6) మూడో ఓవర్‌లోనే ఔటయ్యాడు. భువనేశ్వర్ బౌలింగ్‌లో బౌల్డ్ కావడంతో ఆసీస్ ఎనిమిది పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆపై అలెక్స్ క్యారీ (24), ఖవాజాల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. వీరిద్దరూ 33 పరుగులు జత చేసిన తర్వాత క్యారీ రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. కుల్దీప్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చిన క్యారీ ఔటయ్యాడు.
అటు తర్వాత షాన్ మార్ష్-ఖవాజాల జంట కుదురుగా బ్యాటింగ్ చేసింది. ఈ జోడి మరింత ప్రమాదకరంగా మారుతున్న సమయంలో ఖవాజాను జడేజా ఔట్ చేసి చక‍్కటి బ్రేక్ ఇచ్చాడు. ఆసీస్ జట్టు మరో 53 పరుగులు జోడించిన తర్వాత మార్ష్‌ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేశాడు. కుల్దీప్ బౌలింగ్‌లో మార్ష్ భారీ షాట్‌కు యత్నించగా లాంగాన్‌లో మహ్మద్ షమీ క్యాచ్ పట్టాడు. దాంతో ఆసీస్ 186 పరుగుల వద్ద నాల్గో వికెట్‌ను చేజార్చుకుంది.
ఆ తరుణంలో హ్యాండ్ స్కాంబ్ బాధ్యతాయుతంగా ఆడుతూ జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. అతనికి మార్కస్ స్టోనిస్ చక్కటి సహకారం అందించాడు. దాంతో ఆసీస్ 42వ ఓవర్‌లో రెండొందల పరుగుల మార్కును చేరింది. ప్రధానంగా కుల్దీప్ వేసిన 44 ఓవర్‌లో స్టోనిస్-హ్యాండ్ స్కాంబ్‌లు తలో సిక్సర్ కొట్టడంతో స్కోరులో వేగం పెరిగింది. ఇక భువనేశ్వర్ వేసిన 46వ ఓవర్‌లో వీరిద్దరూ చెరొక ఫోర్ కొట్టారు. ఆపై భువీ వేసిన 48 ఓవర్‌లో తొలి బంతిని సిక్స్ కొట్టిన హ్యాండ్ స్కాంబ్ మరుసటి బంతికి ఔటయ్యాడు. మరొకసారి భారీ షాట్‌కు ప్రయత్నించి శిఖర్ ధావన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. చివరి రెండు ఓవర్లలో 29 పరుగులు రావడంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 288 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆఖరి పది ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే తీసిన భారత జట్టు 93 పరుగుల్ని సమర్పించుకుంది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్‌లు తలో రెండు వికెట్లు తీయగా, రవీంద్ర జడేజాకు వికెట్ దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment