ఆస్ట్రేలియా యువ జట్టుపై భారత అండర్-19 క్రికెట్ టీమ్ ఘన విజయం సాధించింది. రెండో యూత్ వన్డేలో కంగారూ టీమ్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో మట్టికరిపించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. కాగా మూడు వన్డేలు, రెండు యూత్ టెస్టులు ఆడేందుకు ఆసీస్ అండర్-19 జట్టు ఇండియా పర్యటనకు వచ్చింది.
ఇందులో భాగంగా.. పుదుచ్చేరిలో శనివారం జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఆస్ట్రేలియాను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ క్రమంలో సోమవారం నాటి రెండో వన్డేలోనూ ఆకాశమే హద్దుగా చెలరేగింది. పుదుచ్చేరిలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసింది.
భారత బౌలర్ల జోరు.. కంగారూ బ్యాటర్లు బేజారు
కంగారూ టీమ్‌లో అడిసన్ షెరిఫ్(39), క్రిస్టియన్ హోవే(28) మినహా మిగతా వాళ్లంతా చేతులెత్తేశారు. దీంతో 49.3 ఓవర్లలో ఆస్ట్రేలియా కేవలం 176 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో సమర్థ్ నాగరాజ్, మొహ్మద్ ఎనాన్, కిరణ్ చోర్మాలే రెండేసి వికెట్లు పడగొట్టగా.. యుధాజిత్ గుహ, హార్దిక్ రాజ్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
సాహిల్ పరేఖ్ ధనాధన్ సెంచరీ
ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ అండర్-19 జట్టు 22 ఓవర్లనే పని పూర్తి చేసింది. ఓపెనర్ సాహిల్ పరేఖ్ 75 బంతుల్లో 14 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 109 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ రుద్ర పటేల్(10) విఫలం కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ అభిజ్ఞాన్ కుందు.. సాహిల్‌తో కలిసి స్కోరు బోర్డును పరిగెత్తించాడు. 50 బంతుల్లో 53 పరుగులతో నాటౌట్‌గా నిలిచి.. సాహిల్‌తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
సిరీస్ భారత్ కైవసం
వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా భారత యువ జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసి.. సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. సాహిల్ పరేఖ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య గురువారం నామమాత్రపు మూడో వన్డే జరుగనుంది.
తుదిజట్లు
భారత్
రుద్ర పటేల్, సాహిల్ పరేఖ్, అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), మహ్మద్ అమాన్ (కెప్టెన్), కె.పి.కార్తికేయ, కిరణ్ చోర్మాలే, హార్దిక్ రాజ్, నిఖిల్ కుమార్, మొహ్మద్ ఎనాన్, యుధాజిత్ గుహ,సమర్థ్ నాగరాజ్.
ఆస్ట్రేలియా
రిలే కింగ్సెల్, జాక్ కర్టెన్, అడిసన్ షెరిఫ్, ఆలివర్ పీక్ (కెప్టెన్), అలెక్స్ లీ యంగ్ (వికెట్ కీపర్), క్రిస్టియన్ హోవే, లింకన్ హాబ్స్, హ్యారీ హోక్స్ట్రా, లాచ్లాన్ రానాల్డో, హేడెన్ షిల్లర్, విశ్వ రామ్ కుమార్.
చదవండి: కెప్టెన్‌గా రహానే.. జట్టులోకి ఇద్దరు టీమిండియా స్టార్లు!
Comments
Please login to add a commentAdd a comment