సహచర ప్లేయర్‌ను ఢీకొట్టిన భారత బౌలర్ (PC: BCCI Women Twitter(X))
ఆస్ట్రేలియాతో మ్యాచ్ మధ్యలోనే భారత మహిళా క్రికెటర్ స్నేహ్ రాణా మైదానాన్ని వీడింది. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో సహచర ప్లేయర్ పూజా వస్త్రాకర్‌ను ఢీకొట్టిన ఆమె తలనొప్పి కారణంగా ఫీల్డ్ నుంచి నిష్క్రమించింది.
ఈ నేపథ్యంలో స్నేహ్ రాణా స్థానంలో హర్లీన్ డియోల్‌ను కన్‌కషన్ సబ్‌స్టిట్యూట్‌గా ప్రకటించింది బీసీసీఐ మేనేజ్‌మెంట్. కాగా సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో ఏకైక టెస్టులో విజయం సాధించి చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన.. ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడుతోంది.
ముంబై వేదికగా జరుగుతున్న ఈ సిరీస్‌లో తొలి వన్డేను ఆసీస్ గెలిచింది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య శనివారం నాటి రెండో వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది.
ఇక భారత బౌలర్లలో స్పిన్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ అత్యధికంగా ఐదు వికెట్లు పడగొట్టగా.. ఇతర స్పిన్నర్లు స్నేహ్ రాణా, శ్రెయాంక పాటిల్ ఒక్కో వికెట్ తీశారు. పేస్ ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్‌కు ఒక వికెట్ దక్కింది.
ఇదిలా ఉంటే.. ఆసీస్ ఇన్నింగ్స్ 25వ ఓవర్ వద్ద ఆసీస్ బ్యాటర్ బెత్ మూనీ బంతిని గాల్లోకి లేపగా బ్యాక్‌వర్డ్ పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న స్నేహ్ రాణా.. పూజా వస్త్రాకర్ పరస్పరం ఢీకొట్టుకున్నారు. ఈ ఘటనలో తలకు దెబ్బ తగలడంతో స్నేహ్ రాణా నొప్పితో విలవిల్లాడింది.
ఈ క్రమంలో తీవ్ర తలనొప్పితో బాధపడిన ఆమెను స్కానింగ్‌కు పంపించగా.. హర్లిన్ డియోల్ ఆమె స్థానాన్ని భర్తీ చేసేందుకు సిద్ధమైంది. అయితే, రాణా తిరిగి రావడంతో ఆమె అవసరం లేకపోయింది. ఇక ఈ మ్యాచ్‌లో గాయపడటానికి ముందు నాలుగు ఓవర్లు బౌల్ చేసిన స్నేహ్ రాణా.. తిరిగి వచ్చిన తర్వాత తన కోటాలో మిగిలిన మిగిలిన ఆరు ఓవర్లు పూర్తి చేసి ఓ వికెట్ ఖాతాలో వేసుకుంది.
కాగా ఐసీసీ నిబంధన ప్రకారం.. ఎవరైనా బ్యాటర్/బౌలర్ కన్‌కషన్(తలకు దెబ్బ తగలడం/బ్రెయిన్ ఫంక్షన్ ఎఫెక్ట్ చేసేలా గాయపడటం) కారణంగా దూరమైతే వారి స్థానంలో అవే నైపుణ్యాలున్న ప్లేయర్‌ను బరిలోకి దించాలి.
అయితే, ఆల్‌రౌండర్‌తో సదరు ప్లేయర్ స్థానాన్ని భర్తీ చేస్తే బ్యాటర్ ప్లేస్‌లో వేస్తే బ్యాటింగ్, బౌలర్ ప్లేస్‌లో వస్తే బౌలింగ్ మాత్రమే చేయాలి. ఇక్కడ స్నేహ్ రాణా స్పిన్నర్ కాగా.. హర్లిన్ డియోల్ పార్ట్‌టైమ్ స్పిన్నర్.
ఇక ఈ మ్యాచ్‌లో లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రిచా ఘోష్ అద్భుత అర్ధ శతకంతో మెరిసింది. దురదృష్టవశాత్తూ సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment