ఆస్ట్రేలియాను క్లీన్‌ స్వీప్‌ చేసిన భారత్‌ | India Under 19 Team Beat Australia By 7 Runs In Third Youth ODI | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాను క్లీన్‌ స్వీప్‌ చేసిన భారత్‌

Published Thu, Sep 26 2024 7:03 PM | Last Updated on Thu, Sep 26 2024 7:47 PM

India Under 19 Team Beat Australia By 7 Runs In Third Youth ODI

అండర్‌-19 యూత్‌ వన్డే సిరీస్‌లో భారత్‌ ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్‌ 3-0 తేడాతో క్లీన్‌ స్వీప్‌ చేసింది. సిరీస్‌లో భాగంగా ఇవాళ (సెప్టెంబర్‌ 26) జరిగిన నామమాత్రపు మూడో వన్డేలో భారత్‌ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన యంగ్‌ ఇండియా.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసింది. కెప్టెన్‌ మొహమ్మద్‌ అమాన్‌ (71), ఓపెనర్‌ రుద్ర పటేల్‌ (77) అర్ద సెంచరీలతో రాణించగా.. హర్‌వంశ్‌ సింగ్‌ (46), కిరణ్‌ చోర్‌మలే (30), హార్దిక్‌ రాజ్‌ (30) పర్వాలేదనిపించారు. ఆసీస్‌ బౌలర్లలో ఎయిడెన్‌ ఓ కాన్నర్‌ 4 వికెట్లు పడగొట్టగా..  లాచ్లన్‌ రనాల్డో 2, క్రిస్టియన్‌ హోవ్‌, హ్యారీ హొయెక్స్‌ట్రా తలో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం​ 325 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. కెప్టెన్‌ ఒలివర్‌ పీక్‌ (111), స్టీవెన్‌ హోగన్‌ (104) సెంచరీలతో కదంతొక్కడంతో లక్ష్యానికి చేరువగా వచ్చింది. అయితే ఆఖర్లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఆసీస్‌కు పరాభవం తప్పలేదు. భారీ లక్ష్య ఛేదనలో ఆసీస్‌ సైతం గట్టిగానే పోరాడింది. ఒలివర్‌ పీక్‌, స్టీవెన్‌ హోగన్‌ మూడో వికెట్‌కు 180 పరుగులు జోడించి ఆసీస్‌ శిబిరంలో గెలుపుపై ఆశలు రేకెత్తించారు. 

ఆఖర్లో ఎయిడెన్‌ ఓ కాన్నర్‌ (35) వేగంగా పరుగులు సాధించినప్పటికీ ఆసీస్‌ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. భారత బౌలర్లలో హార్దిక్‌ రాజ్‌ 3, కిరణ్‌ చోర్‌మలే, యుద్దజిత్‌ గుహ తలో 2 వికెట్లు పడగొట్టారు. ఈ సిరీస్‌లో భారత యువ జట్టు తొలి రెండు వన్డేల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా, మూడు వన్డేలు, రెండు టెస్ట్‌ మ్యాచ్‌ల కోసం ఆస్ట్రేలియా అండర్‌-19 జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. వన్డే సిరీస్‌ అనంతరం సెప్టెంబర్‌ 30 నుంచి తొలి టెస్ట్‌.. అక్టోబర్‌ 7 నుంచి రెండో టెస్ట్‌ మ్యాచ్‌ ప్రారంభమవుతాయి.

చదవండి: కమిందు మెండిస్‌.. 147 ఏళ్ల టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో తొలి ఆటగాడు..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement