ఆసీస్ 'ప్రాక్టీస్'అదిరింది
చెన్నై: ఇండియన్ బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్తో జరుగుతున్న వన్డే ప్రాక్టీస్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా అదుర్స్ అనిపించింది. బోర్డు ఎలెవన్ కు 348 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించి బ్యాటింగ్ లో సత్తా చూపెట్టింది. ఆసీస్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, స్టోనిస్ లు అర్థ శతకాలతో దుమ్మురేపారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ ఆదిలోనే హిల్టన్ కార్ట్ రైట్ వికెట్ ను కోల్పోయింది. కార్ట్ రైట్ ఖాతా తెరవకుండానే అవేశ్ ఖాన్ బౌలింగ్ లో అవుటయ్యారు. ఆపై వార్నర్(64;48 బంతుల్లో11 ఫోర్లు) తో కలిసిన స్మిత్ (55;68 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.ఈ ఇద్దరూ రెండో వికెట్ కు 106 పరుగులు జోడించి ఆసీస్ ను పటిష్టస్థితికి చేర్చారు.కాకపోతే వార్నర్, స్మిత్ లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరడంతో ఆసీస్ 134 పరుగుల వద్ద మూడో వికెట్ ను నష్టపోయింది. ఆపై ట్రావిస్ హెడ్(65;63 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్), స్టోనిస్(76;60 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు) లు సైతం హాఫ్ సెంచరీలు సాధించడంతో ఆసీస్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లకు 347 పరుగులు చేసింది. ఇండియన్ బోర్డు ఎలెవన్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, కుశాంగ్ పటేల్ తలో రెండు వికెట్లు సాధించగా, అవేశక ఖాన్, అక్షయ్ కార్నేశ్వర్, కుల్వంత్ తలో వికెట్ తీశారు.