ఆస్ట్రేలియా... అదరహో
► రెండో టెస్టులో విండీస్‌పై ఘన విజయం
► 2-0తో సిరీస్ కైవసం
► బౌలింగ్‌లో రాణించిన మార్ష్, లియోన్
మెల్‌బోర్న్: ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఆస్ట్రేలియా... వెస్టిండీస్‌తో నాలుగు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్టులో 177 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను స్మిత్ బృందం ఒక టెస్టు మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. 460 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు మంగళవారం నాలుగో రోజు బరిలోకి దిగిన విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 88.3 ఓవర్లలో 282 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ హోల్డర్ (68), రామ్‌దిన్ (59), రాజేంద్ర చంద్రికా (37), బ్రాత్‌వైట్ (31)లు మినహా మిగతా వారు నిరాశపర్చారు. ఆతిథ్య బౌలర్ల ధాటికి కరీబియన్ జట్టు ఓ దశలో 150 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.
అయితే హోల్డర్, రామ్‌దిన్ ఆరో వికెట్‌కు 100 పరుగులు జోడించారు. కానీ లోయర్ ఆర్డర్ నుంచి పెద్దగా సహకారం లేకపోవడంతో ఓటమి తప్పలేదు. విండీస్ 32 పరుగుల తేడాతో చివరి 5 వికెట్లను కోల్పోయింది. మిచెల్ మార్ష్ 4, లియోన్ 3 వికెట్లు తీశారు. అంతకుముందు ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌ను ఓవర్‌నైట్ స్కోరు 32 ఓవర్లలో 3 వికెట్లకు 179 పరుగుల వద్దే డిక్లేర్ చేసింది. హోల్డర్ 2 వికెట్లు తీశాడు. లియోన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య చివరిదైన మూడో టెస్టు జనవరి 3 నుంచి సిడ్నీలో జరుగుతుంది.