రోజర్స్ సెంచరీ; ఆసీస్ విక్టరీ
మెల్‌బోర్న్: యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళుతోంది. తాజాగా జరిగిన నాలుగు టెస్టులోనూ ఆసీస్ విజయం సాధించి సిరీస్లో 4-0 ఆధిక్యం సాధించింది. నాలుగో టెస్టు నాలుగు రోజుల్లోనే ముగియడం విశేషం. ఇంగ్లండ్ నిర్దేశించిన 231 పరుగుల లక్ష్యాన్ని క్లార్క్ సేన 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
30 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ కేవలం 2 వికెట్లు నష్టపోయి విజయాన్ని అందుకుంది. రోజర్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి సెంచరీ సాధించాడు. 155 బంతుల్లో 13 ఫోర్లతో 116 పరుగులు చేశాడు. వాట్సన్ అజేయ అర్థ సెంచరీతో చెలరేగాడు. 90 బంతుల్లోనే 11 ఫోర్లతో 83 పరుగులు పిండుకున్నాడు. వార్నర్ 25 పరుగులు చేసి అవుటయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్, పనేసర్ చెరో వికెట్ తీశారు.
తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 255, రెండో ఇన్నింగ్స్లో 179 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్లో 204 పరుగులకు ఆలౌటయింది. మొత్తం 8 వికెట్లు పడగొట్టిన ఆసీస్ బౌలర్ మిచెల్ జాన్సన్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అందుకున్నాడు.