విశాఖ: భారత్ నిర్దేశించిన 127 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా జట్టు 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బ్యాటింగ్‌కు పిచ్ అంతగా అనుకూలం కాకపోవడంతో మ్యాచ్ ఏకపక్షంగా ఆసీస్‌వైపే మొగ్గుతుందని అందరూ భావించారు. కానీ, రెండో ఓవర్ చివరి బంతికే స్టొయినిస్ రనౌట్, మూడో ఓవర్ తొలి బంతికే ఫించ్‌ను బుమ్రా వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో టీమిండియా శిబిరంలో జోష్ వచ్చింది. అయితే, ఓపెనర్ డియార్సీ (37: 37 బంతుల్లో 4s x 4), మూడో వికెట్‌గా క్రీజులోకొచ్చిన మాక్స్‌వెల్ (56 : 43 బంతుల్లో 4s x 6, 6s x2) కుదురుగా, జట్టు విజయానికి అవసరమైన విధంగా ఆడి ఆసీస్ విజయానికి బాటలు వేశారు.
ఇదిలాఉండగా.. భారత బౌలర్లు క్రమంగా వికెట్లు తీయడం.. పరుగులు కట్టడి చేయడంతో చివర్లో మ్యాచ్ ఒకింత ఉత్కంఠగా మారింది. దీంతో విజయం సాధించడానికి ఆసీస్ ఆటగాళ్లు చివరి బంతివరకు పోరాడక తప్పలేదు. అప్పటికే ప్రధాన బ్యాట్స్‌మెన్ పెవిలియన్ చేరడంతో.. టెయిలెండర్లు హ్యాండ్స్‌కోంబ్ (13), కల్టర్ నీలే 4, పాట్ కమిన్స్7, జే రిచర్డ్సన్ 7 పరుగులు చేయడంతో ఆసీస్ విజయతీరాలకు చేరింది. టీమిండియా బౌలర్లలో జస్ప్రిత్ బుమ్రా 3, యజువేంద్ర చహల్, కృనాల్ పాండ్యా చెరో వికెట్ పడగొట్టారు. డియార్సీ, స్టొయినిస్‌ను రనౌట్ చేశారు.
అంతకు ముందు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా భారత్‌ను బ్యాటింగ్ ఆహ్వానించింది.భారత్ ఆదిలోనే షాక్ తగిలింది. రోహిత్ శర్మ 5 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో కేఎల్ రాహుల్‌తో కలిసి కెప్టెన్ విరాట్ స‍్కోరును బోర్డును పరుగెత్తించారు. వీరిద్దరూ 55 పరుగులు జోడించిన తర్వాత కోహ్లి(24) ఔటయ్యాడు. కాసేపటికి రిషభ్ పంత్(3) అనవసరపు పరుగు కోసం యత్నించి రనౌట్‌గా వెనుదిరిగాడు. దాంతో భారత్ 80 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
అటు తర్వాత హాఫ్ సెంచరీ సాధించిన రాహుల్(50) ఔట్ కాగా మిగతా ఆటగాళ్లు దినేశ్ కార్తీక్(1), కృనాల్ పాండ్యా(1), ఉమేశ్ యాదవ్(2)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరారు. క్రీజ్‌లో ధోని(29 నాటౌట్) కడవరకూ ఉండటంతో భారత్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. ఆరుగురు భారత ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడం గమనార్హం. ఆసీస్ బౌలర్లలో నాథన్ కౌల్టర్ నైల్ మూడు వికెట్లు సాధించగా, ఆడమ్ జంపా, ప్యాట్ కమిన్స్ బెహ్రన్‌డార్ఫ్‌లు తలో వికెట్ తీశారు.
Comments
Please login to add a commentAdd a comment