లంకను మళ్లీ కూల్చిన స్టార్క్‌  | Australia won the second Test against Sri Lanka | Sakshi
Sakshi News home page

లంకను మళ్లీ కూల్చిన స్టార్క్‌ 

Published Tue, Feb 5 2019 1:24 AM | Last Updated on Tue, Feb 5 2019 1:24 AM

Australia won the second Test against Sri Lanka - Sakshi

కాన్‌బెర్రా: భారత్‌ చేతిలో సొంతగడ్డపై చేష్టలుడిగిన ఆస్ట్రేలియాకు వెంటనే ఆత్మవిశ్వాసం పెంచే విజయం దక్కింది. శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను ఆతిథ్య జట్టు 2–0తో కైవసం చేసుకుంది. రెండో టెస్టులో ఆసీస్‌ స్పీడ్‌స్టర్‌ మిషెల్‌ స్టార్క్‌ (5/46) మళ్లీ శ్రీలంకను కూల్చేశాడు. మొత్తం 10 వికెట్లు (తొలి ఇన్నింగ్స్‌లో 5/54) తీయడంతో ఆస్ట్రేలియా 366 పరుగుల భారీతేడాతో నాలుగో రోజే జయభేరి మోగించింది. సోమవారం 17/0తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 51 ఓవర్లలో 149 పరుగులకే కుప్పకూలింది. క్రితం రోజు స్కోరుకు ఒక పరుగు జతకాగానే ఒక వికెట్‌ కూలింది.

ఇలా మొదలైన పతనం... శ్రీలంక వంద పరుగులు చేసేలోగానే 6 వికెట్లు కోల్పోయేలా చేసింది. కుశాల్‌ మెండిస్‌ (42; 3 ఫోర్లు, 1 సిక్స్‌), ఓపెనర్‌ తిరిమన్నె (30; 2 ఫోర్లు) కాస్త మెరుగనిపించారు. ఏడుగురు బ్యాట్స్‌మెన్‌ 8 పరుగులను మించలేకపోయారు. స్టార్క్‌ ఏ ఒక్కర్నీ నిలదొక్కుకోకుండా దెబ్బమీద దెబ్బ తీశాడు.  దిముత్‌ కరణరత్నే (8), కెప్టెన్‌ చండిమల్‌ (4), కుశాల్‌ పెరీరా (0), ఫెర్నాండో (0) అతని పేస్‌కు తలవంచారు. మరోవైపు కమిన్స్‌ (3/15) కూడా అతనికి సహకరించాడు. ఇద్దరు కలిసి లంకను కనీసం 150 పరుగులైనా చేయనివ్వలేదు. స్టార్క్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, కమిన్స్‌కు ‘సిరీస్‌’ అవార్డులు లభించాయి. 

ఆ బాటలో... వరుసగా మూడోది! 
శ్రీలంక పరాభవాల పరంపర ఆసీస్‌ గడ్డపైనా కొనసాగింది. పరాజయాల బాటలో వరుసగా ఇది మూడో సిరీస్‌ ఓటమి. తమ సొంతగడ్డపై 0–3తో ఇంగ్లండ్‌ చేతిలో ఓడిన లంక... ఆ తర్వాత న్యూజిలాండ్‌తో 2 టెస్టు సిరీస్‌ను 0–1తో... ఇప్పుడేమో కంగారూ చేతిలో 0–2తో ఓడింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement