నిరుద్యోగులుగా ఆసీస్ క్రికెటర్లు!
సిడ్నీ: క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ), ఆ దేశ ఆటగాళ్లకు మధ్య కొనసాగుతున్న వేతనాల ఒప్పందం మరింత తీవ్ర రూపం దాల్చింది.నూతన ఒప్పందంపై సంతకాలు చేసేందుకు శుక్రవారం(జూన్ 30)తో గడువు ముగిసిన నేపథ్యంలో ఆ దేశ క్రికెటర్ల భవిష్యత్తు ప్రశార్ధకంగా మారింది. కొంతమంది క్రికెటర్లు మినహా ప్రధాన క్రికెటర్లూ ఎవ్వరూ శనివారం నుంచి ఆసీస్ తరపున బరిలోకి దిగే అవకాశాన్ని కోల్పోయారు.
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు తరపున బరిలోకి దిగాలంటే కొత్త కాంట్రాక్ట్ పై ఆటగాళ్లు సంతకాలు చేయాల్సి ఉంది. అయితే దాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఆసీస్ క్రికెటర్లు అందుకు ఒప్పుకోలేదు. దాంతో ఆస్ట్రేలియా తరపున ఆడుతున్న పురుష, మహిళా క్రికెటర్లు నిరుద్యోగులుగా మారిపోయారు. మొత్తం ఆస్ట్రేలియాకు చెందిన 230 మంది క్రికెటర్లు భవితవ్యం ప్రశ్నార్దకంగా మారింది. మరోవైపు సీఏ అనుమతి ఇవ్వకపోతే ఆ దేశ ట్వంటీ 20 లీగ్ బిగ్ బాష్ లో కూడా ఆటగాళ్లు పాల్గొనడం కష్టమే.
దాంతోపాటు ఆస్ట్రేలియా జట్ల పర్యటనపై కూడా నీలినీడలు అలుముకున్నాయి. భారత్-ఎ, దక్షిణాఫ్రికా-ఎ జట్లతో ఆస్ట్రేలియా-ఎ జట్టు జూలైలో ముక్కోణపు సిరీస్ ఆడాల్సి ఉంది. ఇందుకోసం దక్షిణాఫ్రికా పయనం కావాల్సి ఉంది. ప్రస్తుత వివాదం నేపథ్యంలో ఆ పర్యటన అనుమానాస్పదంగా మారింది. ఒకవేళ ఇదే సమస్య కొనసాగితే మాత్రం ఆగస్టులో బంగ్లాదేశ్ పర్యటన, సెప్టెంబర్ లో భారత్ లో పర్యటనల కూడా కష్టమే. మరొకవైపు ఆస్ట్రేలియా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునే యాషెస్ సిరీస్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది ఆఖర్లో యాషెస్ సిరీస్ జరగునున్న తరుణంలో క్రికెటర్లు మొండికేయడం సీఏకు సవాల్ గా మారింది.
ఇప్పటివరకూ ఆసీస్ క్రికెట్ ఆదాయంలో 25 శాతాన్ని క్రికెటర్లకు పంచుతూ వచ్చింది. అయితే తాజా ఒప్పందం ప్రకారం సీఏ మిగులు ఆదాయంలోమాత్రమే క్రికెటర్లకు ఇవ్వాలనేది సీఏ యోచన. ఈ మేరకు కొత్త కాంట్రాక్ట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకు క్రికెటర్లు ఒప్పుకోవాలంటూ హెచ్చరించింది కూడా. అందుకు జూన్ 30 చివరి తేదీగా నిర్ణయించింది. ప్రస్తుతం ఆసీస్ క్రికెట్ ను కుదిపేస్తున్న వివాదం ఎంతవరకూ దారి తీస్తుందో చూడాలి.